ప్రభుత్వ విద్యా సంక్షోభానికి బాధ్యులు ఎవరు?

by Disha edit |
ప్రభుత్వ విద్యా సంక్షోభానికి బాధ్యులు ఎవరు?
X

మానవ సమాజ వికాసానికి, మనదేశ సర్వతోముఖాభివృద్ధికి మూలాధారం విద్య. ఇలాంటి విద్యావ్యవస్థలోని తొలి అడుగైన పాఠశాల విద్యకు సర్వహంగులతో పరిపుష్టి నింపి, రేపటి తరం కోసం మేలైన భవిష్యత్తుకు పాలకులు బాటలు వేయాల్సింది. కానీ 1991 లో ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రపంచీకరణ, కార్పొరేటీకరణతో చదువును కొనుక్కునే పరిస్థితి దాపురించింది. 1964 లో 'కొఠారి కమిషన్' మన దేశ విద్యా వ్యవస్థ పరిస్థితులను అధ్యయనం చేసి, విద్యాభివృద్ధికి కొన్ని విలువైన, ఆచరణాత్మక సూచనలు చేసింది. వీటి అమలులో పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్య వ్యాపారంగా మారి లాభార్జనే ధ్యేయంగా నడుస్తుంది.

విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, ఉచితంగా నిర్బంధంగా నాణ్యమైన విద్యను అందించాలనే రాజ్యాంగ విధానం నేడు అమలు జరగడం లేదు. గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలకు ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించుకోవాలనే స్ఫూర్తి, చిత్తశుద్ధి లోపించక సర్కారీ విద్య అష్టకష్టాలు అరకొర వసతులనతో కూనరిల్లుతుంది. పరిస్థితి ఇలా ఉంటే సమాజంలో సామాజిక స్ఫూహా ఆశించడం వృధా ప్రయత్నమే. దానికి తోడు ఎన్నో ఏళ్ళుగా కనీస అవసరాలైన వసతులు, నియామకాలు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. కానీ విద్యావ్యవస్థలో సంవత్సరానికో కొత్త బోధన విధానం తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను ప్రయోగశాలగా మార్చారు.

విద్యలో విఫల ప్రయత్నాలు చేస్తూ

1986లో ప్రవేశపెట్టిన ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ విధానం, తర్వాత గుణాత్మక విద్య పేరుతో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ పోగ్రాం వంటి మాదిరిగా ప్రస్తుతం 2020లో రీడ్ ఎంజాయ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, నేడు తొలిమెట్టు ప్రోగ్రాం అంటూ పునాది స్థాయి అక్షరాస్యత, గణిత సామర్థ్యాలు, భాషా సామర్థ్యాలు పిల్లలలో ఏర్పడాలని దీనిని ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుత తరగతి పాఠ్యాంశాలతో పాటు బోధిస్తారు. అయితే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్ని ప్రవేశపెట్టినా, క్షేత్రస్థాయిలో విఫలం అవుతుంది. అది విఫలమైందని మళ్ళి కొత్త ప్రయోగం అంటూ ఏకరువు పెడుతున్నారు. అయినా ఈ 75 ఏళ్ళలో విద్యారంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మరింది. ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఇవి మంచి విధానాలే అయితే ప్రైవేటు రంగంలో వీటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు. వారికేమో బోధనలో స్వేచ్ఛ, వారి బోధన విధానాలపై పర్యవేక్షణ, ఆంక్షలు ఉండవు. ప్రభుత్వ రంగంలో మాత్రం విఫల ప్రయత్నాలు, ఇలాంటి ఫలితం లేని ప్రయోగాల వలన పిల్లల భవిష్యత్ అంధకారం కాదా?

పాఠశాల విద్య నుంచి మన సమాజం ప్రాథమిక స్థాయి నుంచి పట్టించడం, విద్యార్థుల ఆసక్తులు, అంతర్గత నైపుణ్యాలను గుర్తించకపోవడం, పిల్లల భావోధ్వేగ వైఖరులను మెరుగుపర్చడం, క్రమం తప్పిన వ్యాయామం, క్రీడలు, ఆరోగ్య స్పృహ కలిగించడం వంటి వాటికి పాఠశాలలు వేదికలు కావాలి. అంతేకాని పాలకులు మారినప్పుడల్లా వారి అలోచనలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు మార్చకూడదు. ప్రతీసారి కొత్త ప్రయోగం పేరుతో కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఉపాధ్యాయులను బోధించమనడం కాకుండా పిల్లలలో సృజనాత్మకతను, వినూత్నకతను వెలికి తీసే కార్యశాలగా బడులను ఎందుకు మార్చలేకపోతున్నారు. ఇతర దేశాల మాదిరిగా మనదేశం విద్యలో ఉన్నత స్థానాల్లో ఎందుకు నిలవలేకపోతుంది. ఇది పాలకుల లోపం కాదా?

నైతికత ఎలా వస్తుంది?

75 ఏళ్ళుగా విద్యారంగంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటూ, నేడు విద్యారంగ సంక్షోభం నుంచి బయటకు రావడానికి ఇది తొలిమెట్టని 'ఎఫ్ఎల్ఎన్' కార్యక్రమాన్ని 2022 ఆగస్ట్ 15న ప్రారంభించారు. దీనిని ఎన్ఈపీ-2020 నుంచి సంగ్రహించి విస్తరిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇది గత విధానాల కన్నా బాగానే అనిపించినా, ఇది విఫల ప్రయత్నమేనని కార్పోరేట్ విద్యను ప్రోత్సహించడానికే ఇది ఉపయోగపడుతుందని విద్యానిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక వసతులు కల్పించకున్నా ఉన్న ఉద్యోగులు అరకొర వసతులతో అష్టకష్టాలు పడి నెట్టుకొస్తున్నా, వాటిని పరిష్కరించకుండా పాలకులు చూసి చూడనట్టు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కానీ విద్యాసంక్షోభంలో ఉపాధ్యాయులను బలిపశువులను చేస్తున్నారు ఇది భావ్యామా! ఇప్పుడు ప్రవేశపెట్టిన ఎఫ్ఎల్ఎన్ విధానం కూడా ఇలా అరకొర వసతులతో నడుస్తే ఇది విఫల ప్రయత్నమే అవుతుందని విద్యానిపుణులు భావిస్తున్నారు. అందుకే ముందు ప్రభుత్వాలు పాఠశాల విద్యలో విఫల ప్రయోగాలను ఆపాలి.

అలాగే విద్యావ్యవస్థలో ఇన్నాళ్ళ నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే విద్యా పరిరక్షణకు పూనుకోని టైం బాండ్ ప్రోగ్రాంతో ముందుకెళ్లాలి. అటు ఉపాధ్యాయులు సైతం వృత్తి నిబద్దతతో విధులు నిర్వహించాలి. సమాజం విద్యను వ్యాపారంగా మారుస్తుంటే చూస్తూ ఉండి, విలువలు సామాజిక స్పృహ, నైతికతను పిల్లల నుండి ఆశించడం అంటే? 'ఇసుక నుండి తైలం తీయడం లాంటిదే' అని గమనించండి. ప్రభుత్వాలు ప్రాథమిక విద్యాలో లోతైన అవగాహన కల్పించి, సొంత కాళ్లపై నిలబడే శక్తి కలిగించే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి. ముందుగా పాఠశాల విద్యకు పరిపుష్టి నింపకుండా, ఆర్భాటంగా ఎన్ని పథకాలు, ఎన్ని విధానాలు, తీసుకొచ్చినా కనీస ఫలితాలు ఇవ్వలేవని గ్రహించి పాలకులు గమనించాలి. అందుకే రాబోవు 50 ఏళ్లలో అవసరాలను శాస్త్రీయంగా మదింపు చేసి ఆయా రంగాల్లో విద్యార్థులను తయారు చేయాలి.

మేకిరి దామోదర్

సోషల్ ఎనలిస్ట్

9573666650

Read More...

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇంత వివక్షా?


Next Story