స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వెనుక కుట్ర చేస్తోంది ఎవరు?

by Ravi |   (  Updated:2025-09-09 01:16:20  IST  )

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచడం విషయంలో బీసీ నాయకులు, బీసీ ప్రజలు ఎప్పుడు తమ కోసం తెచ్చిన

స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వెనుక కుట్ర చేస్తోంది ఎవరు?
X

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచడం విషయంలో బీసీ నాయకులు, బీసీ ప్రజలు ఎప్పుడు తమ కోసం తెచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కలుగుతుందో నని ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం అందుకు మోకాలడ్డుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయాలు, ఆదేశాలు తీసుకున్న విషయం తెలిసిందే.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే ప్రతిపాదన అసెంబ్లీలో ఆమోదం పొందినా, గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉంది. ఎప్పుడు ఆమోదం దక్కుతుందా? అని బీసీ జనం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగి పోవడం వెనుక బీజేపీ కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. బీసీలకు న్యాయం చేయడం బీజేపీకి ఇష్టం లేదా? అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.

హామీలను నెరవేర్చింది కానీ..

కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకో వడానికి తన వంతుగా కృషి చేస్తూనే ఉంది. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట రెండు కీలక హామీలను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా కీలక అడుగులు కూడా పడ్డాయి. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కుల గణన పూర్తి చేసి, ప్రత్యేక డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపింది. ఈ బిల్లుకు ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గడువులోపు చర్యలు చేపట్టకపోతే..

ఒక వైపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తోంది. కోర్టు ఇచ్చిన గడువులో చర్యలు పూర్తి చేయకపోతే పాత రిజ ర్వేషన్ విధానంతోనే ఎన్నికలు జరగాల్సి రావచ్చు. లేదా ఎన్నికలు వాయిదా పడే ప్రమాదం ఉంది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రత్యేక తీర్మానం చేసి జీవో జారీ చేసే ఆలోచన ఉన్నా, రాజ్యాంగ నిపుణులు పలు అంశాలను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో పలు సందర్భాల్లో మోసపోయిన బీసీలు మరోసారి మోసపోయే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో బీసీల పోరాటం అసలు ఆగదని, కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలతో పాటు బీసీ సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, బీసీల హక్కుల సాధనలో కూడా ఈ పరిణామాలు భాగం. 42% బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం ఆగదని హెచ్చరికలు కేంద్రానికి పంపారు. బీసీ బిల్లును ముస్లింల బిల్లుగా ముద్ర వేయడంపై కూడా పలువురు విమర్శించారు.

ఈ బిల్లులు కూడా పెండింగ్‌లోనే..

బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్సులను ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ రెండు ఆర్డినెన్సులు జూలై 15న గవర్నర్ కార్యాలయానికి చేరాయి. గవర్నర్ వాటిని కేంద్ర హోంశాఖకు పంపారు. రాష్ట్రపతి వద్ద బిల్లులు, గవర్నర్ వద్ద ఆర్డినెన్సులు పెండింగ్‌లో ఉండటంతో సమస్య మరింత పెరిగింది. హైకోర్టు సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో రెండు సవరణ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. కానీ, గవర్నర్ వాటిని కూడా న్యాయ సలహా కోసం నిలిపివేశారు.

రిజర్వేషన్ పెంపు ఎన్నికల హామీనే కాదు

న్యాయపరంగా రాష్ట్రపతి/గవర్నర్ల వద్దకు రాష్ట్రాలు పంపిన బిల్లులను మూడు నెలల్లోగా ఆమోదించాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీనిపై రాష్ట్రాల అభి ప్రాయాలు ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపు కేవలం ఎన్నికల హామీ కాదు. ఇది చట్టపరమైన, రాజకీయ, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటం. దీర్ఘ కాలిక ఫలితాల కోసం రాజ్యాంగబద్ధ చట్ట సవరణ చేసిన బిల్లులు, గవర్నర్ ఆమోదం, జీవో విడుదల తప్పనిసరి అవసరంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచే వ్యతిరేకంగా ఉండడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోంది.

జంతువుల లెక్కలున్నాయి కానీ..

దశాబ్దాలుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారు. బీసీల విషయంలో బీజేపీ నిబద్ధత ఎక్కడ? రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు నెలల తరబడి ఆగిపోవడం ఎందుకు? బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, అరవింద్‌లు సమాధానం చెప్పాలి. జంతువుల లెక్కలు ఉన్న దేశంలో, బీసీల లెక్కలు ఎందుకు లేవనే ప్రశ్నను వేసుకోవాలి బీసీ నేతలు.. నెలల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ కూడా అదే గతి పడటం చాలా బాధాకరం. బీసీల పట్ల బీజేపీ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోవాలని బీసీ నేతలు, ప్రజలు బీజేపీకి హితవు పలుకుతూ ఉన్నారు.

- దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Next Story