ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ప్రయోజనమెవరికీ..?

by Disha edit |
ఫ్రెండ్లీ ప్రభుత్వంతో  ప్రయోజనమెవరికీ..?
X

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించింది. దీంతో జిల్లా కలెక్టర్ల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ అధికార పార్టీకి దాసోహం అయ్యారు. ఉద్యోగుల పనితీరుపై ప్రభుత్వ అజమాయిషీ కూడా తగ్గుముఖం పట్టడం వల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో క్రమంగా ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయి ఉద్యోగుల విధుల్లో నిర్లక్ష్యం ఆవహించింది. రాష్ట్రంలోని పోలీసులు సైతం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారి, ప్రతిపక్ష పార్టీలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రభుత్వ అధికారులు కొంచెం నమ్మకంగా ఉంటే ఒకేచోట మూడేళ్లకు పైగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా అందినకాడికి దోచుకుంటున్నారు.

గత ఐదేళ్లుగా పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీస్ ముసుగేసుకోవడం వల్ల రాష్ట్రంలో నేరస్థులు రెచ్చిపోతున్నారు. దీంతో తెలంగాణలో నేరాల సంఖ్య పెరిగిందని క్రైం రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. ఏడాది కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లించకపోయినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం దానిని పట్టించుకోవడం లేదు. వారికి తగ్గట్టే ప్రభుత్వం కూడా వారిని సరిగ్గా పనిచేయాలని, సమయపాలన పాటించాలని ఆదేశించడం లేదు. ఫ్రెండ్లీ సర్కార్ ముసుగులో అటు ప్రభుత్వం, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తించడం మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంస్కరణలు, ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ ఇప్పటి జిల్లా కలెక్టర్లు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారి, పింక్ కండువాలు మెడలో వేసుకుని ప్రజావ్యతిరేక పాలన సాగించడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం మాటని పక్కనపెట్టి ప్రభుత్వ ఉద్యోగుల, అధికారుల చేత వారికి చెల్లిస్తున్న వేతనానికి తగ్గట్టు పని చేయించుకుంటేనే సామాన్య ప్రజలకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నాణ్యమైన పౌర సేవలు అందుతాయి.

-పసునూరి శ్రీనివాస్

అడ్వకేట్, మెట్ పల్లి.

8801800222.

Also Read...

అధికారులపై దురుసు ప్రవర్తనా?


Next Story