దంపుడు బియ్యం vs తెల్ల బియ్యం ఏవి తినడం మంచిది?

by Ravi |   (  Updated:2025-05-18 00:45:34  IST  )

మార్కెట్ ఎకానమీ మహా చెడ్డది. ఇక సైన్స్ అయితే మొహమాం లేకుండా దేనికైనా తికమక పెట్టి అధ్యయనాలు ఇప్పించగలదు.

దంపుడు బియ్యం vs తెల్ల బియ్యం ఏవి తినడం మంచిది?
X

మార్కెట్ ఎకానమీ మహా చెడ్డది. ఇక సైన్స్ అయితే మొహమాం లేకుండా దేనికైనా తికమక పెట్టి అధ్యయనాలు ఇప్పించగలదు. దాన్ని ఏదో ఉపద్రవంలా చెప్పే 'మేధావులకు' వేదికలు కల్పించగలదు. జనాన్ని నిరంతరం అభద్రతతో, అసంతృప్తితో కొట్టుమిట్టాడేలా చెయ్యడం సైన్స్‌కు సరదా. పొట్టుతో ఉండే వరి (అన్ పాలిష్డ్ / బ్రౌన్) అన్నం మూలంగా అది తినే వారిలో ఆర్సెనిక్ (విషపూరితమైన మూలకం) ఎక్కువగా చేరుతుంది. అది కేన్సర్‌కి దారితీయవచ్చునని ఈ మధ్య ఒక విశేషం చక్కర్లు కొడుతున్నది. ఇంకేం.. మేధావులు అంతా తమకు తోచిన లాజిక్కులతో ఈ అధ్యయనాన్ని విశ్లేషిస్తున్నారు.

తెల్ల బియ్యం తినడం వలన..

నిజానికి పొట్టు తీయని (ముడి) బియ్యం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రీయంగా నిరూపితమైంది. బియ్యపు పై పొరలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పీచు (ఫైబర్) జీర్ణ వ్యవస్థను చక్కగా పనిచేసేలా చేస్తుంది. ఇది పేగుల్లో ఉండే బాక్టీరియా (ఇంటెస్టైనల్ ఫ్లోరా) వృద్ధికి తోడ్పడుతుంది. మలబద్ధకం రాకుండా నివారిస్తుంది. పైగా పైరిడాక్సిన్, రైబోఫ్లావిన్, థయామిన్ వంటి బి విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి ఇతర ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఈ అన్నం తిన్నాక, దానిలో వుండే కార్బో హైడ్రేట్స్‌ని శరీరం నెమ్మదిగా శోషించుకొంటుంది. దాని మూలంగా రక్తంలో షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అలా కాకుండా, తెల్ల బియ్యం అని పిలిచే పాలిష్డ్ రైస్ తింటే రక్తంలో షుగర్ స్థాయి ఒక్కసారిగా (స్పైక్) పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వారికి ఇలా పెరగడం వల్ల దీర్ఘకాలంలో అనేక కాంప్లికేషన్స్‌కి దారితీయవచ్చు. అయితే, షుగర్ లేని వారిలో ఈ పెరుగుదల ప్రి డయాబెటీస్‌కి దారితీస్తుంది. అంతేకాకుండా ఈ ముడి బియ్యంలో ఉండే ఫైబర్ ఎక్కువ నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. తద్వారా తక్కువ పరిమాణంలో బియ్యం ఉన్నా కూడా ఎక్కువ అన్నంలా అవుతుంది. పాలిష్డ్ బియ్యంలో ఎక్కువ అన్నం కావాలంటే ఎక్కువ బియ్యం కావాల్సి వస్తుంది.

ఆర్సెనిక్ స్థాయి ఉన్నప్పటికీ..

ఇక ఆర్సెనిక్ విషయానికి వస్తే, ప్రపంచంలో ఒక్కో నేలలో ఒక్కో స్థాయిలో ఆర్సెనిక్ ఉంటుంది. అది అక్కడ పండే పంటల్లో చేరుతుంది. వరిలో కూడా ఆర్సెనిక్ చేరుతుంది. ఇది కేవలం పొట్టుకే పరిమితం కాదు. లోపల ఉన్న తెల్ల గింజలోనూ చేరుతుంది. అయితే పొట్టు లో ఎక్కువ శాతంలో ఉంటుంది. పొట్టుని తొలగించడం వల్ల కొంత మేరకు ఆర్సెనిక్ ని తగ్గించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 10% నుండి 40% వరకు ఉండవచ్చు. తెల్ల బియ్యంలో ఆర్సెనిక్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో చేరే ఆర్సెనిక్ స్థాయి ముడి బియ్యం తిన్నప్పుడు చేరే ఆర్సెనిక్ స్థాయికి దగ్గరగా ఉండవచ్చు. అయితే, ఇది ఆయా ప్రాంతంలోని వరిపై ఆధారపడి ఉంటుంది. కనుక ఆర్సెనిక్ నుండి తప్పించుకోవడానికి ముడి బియ్యం - అన్ పాలిష్డ్ రైస్ తినే వాళ్ళు తెల్ల బియ్యానికి మారడం వివేకవంతమైన పనికాదు. ప్రపంచంలో నిత్యం అనేక పరిశోధనల ఫలితాలు ప్రకటిస్తారు. మనం ప్రతిదాన్నీ పట్టుకొని పోతూ, సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ, అసహనంతో, అభద్రతతో బతక రాదు. శాస్త్రీయ సమాచారాన్ని వివేకంతో అర్థం చేసుకోవడం ముఖ్యం.

డాక్టర్. యనమదల మురళీ కృష్ణ,

ఎం.డి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు,

94406 77734

Next Story