గెలిచినా.. ఓడినా అప్పులే మిగిలాయి

by Bhoopathi Nagaiah |

ఎన్నికల తర్వాత గ్రామాల్లో నెలకొన్న నిశ్శబ్దం ఆనందాన్ని కాదు, ఆందోళనను ప్రతిబింబిస్తోంది.

గెలిచినా.. ఓడినా అప్పులే మిగిలాయి
X

తెలంగాణ రాష్టంలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో నినాదాలు ఆగిపోయాయి. విజయసంబరాలు కూడా చేశారు. కానీ ఎన్నికల తర్వాత గ్రామాల్లో నెలకొన్న నిశ్శబ్దం ఆనందాన్ని కాదు, ఆందోళనను ప్రతిబింబిస్తోంది. ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్నది అభివృద్ధి చర్చ కాదు అప్పుల లెక్కల మాట.... ఎవరితో ఎన్ని డబ్బులు తెచ్చినాము, ఎంత బంగారం తాకట్టు పెట్టినాము, అనే ఆలోచన వెంటాడుతున్నది...

ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడినా అభ్యర్థులందరూ ఇప్పుడు ఒకే మానసిక వేదన ఎదుర్కొంటున్నారు. గెలిచినా ఓడినా ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి భారమే కళ్లకు కనిపిస్తుంది. గ్రామానికి సేవ చేయాలనే ఆశయం వెనక్కి నెగ్గి, “పెట్టుబడి ఎలా భరించాలి” అనే మానసిక ప్రశ్నే రాజకీయ చర్చల కేంద్రంగా మారింది.

పదవితో వచ్చింది ఊరట కాదు

గెలిచిన సర్పంచ్‌లకు పదవి లభించినా, ఆ పదవితో పాటు వచ్చినది ఊరట కాదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలనే ఒత్తిడి గ్రామ పాలనపై మొదటి నీడగా పడుతోంది. అభివృద్ధి ప్రణాళికలు ఆలోచించేలోపే, అప్పులు చేసిన లెక్కలే ముందుకు వస్తున్నాయి. ఫలితంగా గ్రామ అవసరాల కంటే ఆర్థిక ఒత్తిడే నిర్ణయాలను ప్రభావితం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి మరింత బాధాకరం. ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం, అప్పుల ఒత్తిడి, గ్రామంలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఇవన్నీ వారిని లోపల నుంచి నలిపేస్తున్నాయి. పోలింగ్ కంటే ముందు రోజులు, పోలింగ్ జరిగిన తర్వాత కూడా అభ్యర్థుల దగ్గరకి వెళ్లి డబ్బులు అడిగి తీసుకెళ్లిన సంఘటనలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఇది రాజకీయ ఓటమి కాదు; సామాజిక సంక్షోభం.

పెట్టుబడికి లాభాల వేట షురూ

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికల తర్వాత ఇదే దృశ్యం కనిపిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికల చర్చలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో అప్పుల చర్చలు, ఖర్చుల లెక్కలే వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా గెలిచిన నాయకుడి వద్ద అభివృద్ధిని ప్రశ్నించడానికి సంకోచిస్తారు. ఈ పరిస్థితి వ్యక్తుల వైఫల్యం కాదు. ఇది పెట్టుబడి రాజకీయాల ప్రత్యక్ష ఫలితంగా భావించాలి. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ పెట్టుబడికి లాభం రావాలనే ఆలోచన సహజంగా ప్రతి మనిషికి వస్తుంది. ఆ లాభం అభివృద్ధి ద్వారా కాదు లావాదేవీల ద్వారా వచ్చే ప్రమాదమే ఎక్కువ.

విజేత, పరాజిత ఇద్దరూ బాధితులైతే...

సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత గెలిచినవారు, ఓడినవారు ఇద్దరూ బాధితులైతే, ఈ ఎన్నికల్లో నిజంగా ఓడిపోతున్నది గ్రామాభివృద్ధే అనేది నిజం. గ్రామ రాజ్యం అప్పుల భారంతో క్రమంగా క్షీణిస్తోంది. సర్పంచ్ ఎన్నికలు సేవకు వేదికగా తిరిగి మారాలంటే, ఖర్చుల రాజకీయాలకు ముగింపు పలకాల్సిందే. లేకపోతే ప్రతి ఎన్నిక తర్వాత ఇదే దీనగాధ గెలుపు లేని ఓటమి గ్రామాల మీద , ఆ గ్రామాల అభివృద్ధి మీద ఉంటుంది.

అప్పుల భారంతో కుంగుతున్న గ్రామ సమాజం

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి తన ప్రత్యర్థి విపరీతంగా డబ్బులు పంచుతున్నాడని, తనకు ఓటమి తప్పదని భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ప్రజాస్వామ్యంలో ఎన్నికల పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉంది. ... ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో నేను ఒక జర్నలిస్టుగా ప్రత్యక్ష్యంగా చూసాను. కనుక వారి ఆవేదన అర్థం చేసుకున్నాను. గ్రామ ప్రజాస్వామ్యం నేడు అప్పుల భారంతో కుంగిపోతోంది. సర్పంచ్ ఎన్నికల్లో పెరుగుతున్న పెట్టుబడి రాజకీయాలు అభివృద్ధి ఆలోచనను మూలకు నెట్టేస్తున్నాయి.

ప్రజాస్వామ్యానికి పరాజయం

రాజకీయ నాయకులు, పాలకులు ఈ వాస్తవాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని మూల్యం గ్రామాలే చెల్లించాలి. ఎన్నికల ఖర్చులపై కఠిన నియంత్రణలు అమలు చేయడం, అక్రమాలకు రాజకీయ రక్షణను పూర్తిగా తొలగించడం, ఖర్చులపై పారదర్శకత తీసుకురావడం తప్పనిసరి కావాలి. రాబోయే ఎంపీటీసీ, జెడ్ పి టి సి, మునిసిపల్ ఎన్నికలలో మార్పు తెచ్చే దిశగా అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాల్సిన తరుణ ఆసన్నమైంది. ఎన్నికలు ముగిశాక గెలిచినవారు,ఓడినవారు ఇద్దరూ బాధితులుగా మారితే, అది ప్రజాస్వామ్యానికి పరాజయం. ఈ పరిస్థితి మారాల్సిందే. మార్పు మాటల్లో కాదు నిర్ణయాల్లో కనిపించాలి. గ్రామ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ హెచ్చరికను ఇప్పుడే గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

G. మధు గౌడ్

95335 51188

Next Story