రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల స్థానం ఎక్కడ?

by Disha edit |
రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల స్థానం ఎక్కడ?
X

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం తన పదవ వార్షిక బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతుంది. 2015 తర్వాత లక్ష కోట్ల రూపాయలు దాటిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ ఏడు రూ. 3 లక్షల కోట్లకు చేరుకోబోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బలహీన వర్గాల జనాభా 52 శాతం ఉంటే బడ్జెట్‌లో బలహీన వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయిస్తుంది మాత్రం కేవలం మూడు శాతం కంటే తక్కువ నిధులు అనేది వాస్తవం. మేమెంతో మాకు అంత వాటా, బీసీలు సగం బీసీలకు సగం, అవకాశాలలో సగం ఆర్థికంలో సగం అని బీసీలు నినదిస్తున్నా, సమైక్యాంధ్రప్రదేశ్ నుండి స్వరాష్ట్రం వరకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా వారి అభివృద్ధికి పథకాలు ప్రణాళికలు విధానాలు ఏ విధంగా రూపొందిస్తారో ప్రభుత్వాలే చెప్పాలి. బీసీలు సాధారణ అభివృద్ధిలో భాగంగానే ఎదగాలి తప్ప వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు పథకాలు అక్కర్లేదని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.

బడ్జెట్‌లో నిధులేవి?

బీసీలు జనాభాలో 50 శాతం కంటే ఎక్కువే... కానీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మాత్రం మూడు శాతం కంటే తక్కువ. 2020-21 బడ్జెట్ 1.82 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించింది కేవలం 4,356 కోట్ల రూపాయలు 2021- 22 బడ్జెట్ 2.30 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే బీసీల సంక్షేమానికి కేటాయించింది రూ. 5,522 కోట్ల రూపాయలు అలాగే 2022-23 బడ్జెట్ రూ. 2.56 లక్షల కోట్లుగా ఉంటే బీసీల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ. 5,697 కోట్లు మాత్రమే. పైగా కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం. 2023-24 బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు కానీ దీంట్లో కూడా బీసీల సంక్షేమానికి ఏ 6,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకునే అవకాశం కనబడుతుంది.

కార్పొరేషన్‌ల నిర్వీర్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటైంది కానీ, ఎంబీసీ కార్పొరేషన్లు నిధులు లేక నిర్వీర్యం అయిపోయినాయి. ప్రస్తుతం ఈ కార్పొరేషన్లు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి 2021-22 బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2022-23 బడ్జెట్‌లో మాత్రం నిధులను 300 కోట్ల రూపాయలకు తగ్గించారు. అలాగే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటైన 2017 -18 బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కార్పొరేషన్‌కి వరుసగా మూడు బడ్జెట్లలో రూ. 3,000 కోట్లను కేటాయించినా వాటిని ప్రభుత్వం ఖర్చు చేయలేదు. 2021- 22 బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు 2022-23 బడ్జెట్‌లో ఎంబీసీ కార్పొరేషన్‌కి 300 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోతున్నాయి.

ఫెడరేషన్‌లపై చిన్న చూపు

రజక, నాయి బ్రాహ్మణ, మేదర, కుమ్మరి, బట్రాజు, వాల్మీకి, వడ్డెర, సగర, పూసల, విశ్వబ్రాహ్మణ, మత్స్య, గౌడ లాంటి 12 కులాల అభివృద్ధి కోసం ఫెడరేషన్లు ఏర్పాటు చేసినారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరొక ఆరు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు 2021 -22 బడ్జెట్ లో ఫెడరేషన్లకి ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించలేదు కానీ 2022 -23 బడ్జెట్ లో మాత్రం కార్పొరేషన్‌లకి సింగిల్ డిజిట్ లో నిధులు కేటాయించటం ఆయా వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. కార్పొరేషన్‌ల పరిస్థితి ఇలా ఉంటే బీసీ వృత్తిదారులకు స్వయంఉపాధిపై జీవించే వారికి ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ రుణాలను 2017 నుండి ప్రభుత్వం నిలిపివేయటంతో బీసీలకు అన్యాయం జరిగిందనే చెప్పాలి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ జాడేది?

ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా ఫీజులు రియంబర్స్‌మెంట్ చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో ఆంక్షలు పెట్టడం వల్ల అనేకమంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులను కొనసాగించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు మాత్రమే ర్యాంకుల ఆధారంగా ఫీజులు చెల్లిస్తున్నారు. ఎంసెట్లో పదివేల కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం కేవలం 35 వేల రూపాయల ఫీజు మాత్రమే చెల్లించి బీసీ విద్యార్థుల పట్ల తన వివక్షను ప్రదర్శిస్తుంది. ఒక్కతెలంగాణ రాష్ట్రం మాత్రమే బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లించడంలో ఆంక్షలు పెడుతుందనేది వాస్తవం. పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం ద్వారా బీసీ విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించడానికి ప్రతి సంవత్సరం కేవలం 300 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయటం వలన సగటున కులానికి ఇద్దరు విద్యార్థులకు కూడా అవకాశం దొరకటం లేదు. బీసీ కుల గణనతో పాటు బీసీలకు సబ్ ప్లాన్ ప్రకటించి రాబోయే బడ్జెట్‌లో ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా బీసీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ భావించింది దశాబ్దాలుగా భారత రాజకీయాలలో నిజమవుతూనే ఉంది.

డా. తిరునాహరి శేషు,

9885465877



Next Story

Most Viewed