- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనలో బీసీల లెక్క ఎక్కడ? సమగ్ర అభివృద్ధికి అసలైన గణన అవసరం!
జనగణన దేశ అభివృద్ధికి కీలకం. కానీ బీసీ/ఓబీసీ వర్గాల అసలు జనాభా గణన లేకపోవడం సామాజిక న్యాయానికి పెద్ద లోటు. సమగ్ర అభివృద్ధి, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల కోసం బీసీ గణన ఎందుకు అవసరమో తెలిపే వ్యాసం.

దేశ నిర్మాణానికి దిక్సూచి లాంటిదే జనగణన. సంఖ్యలు కేవలం అంకెలు కావు. వాటి వెనుక సమాజపు వాస్తవాలు దాగి ఉంటాయి. గణన లేకుండా అభివృద్ధి అసాధ్యం. ఇలాంటి కీలక ప్రక్రియను రాజకీయ రంగు పూస్తే నష్టం దేశానికే. అదే సమయంలో బీసీ/ఓబీసీ వర్గాల నిజమైన జనాభా గణన లేకపోవడం మరింత పెద్ద లోటు. స్వాతంత్ర్యం తర్వాత కూడా బీసీల వాస్తవ సంఖ్యపై స్పష్టత లేకపోవడం సామాజిక సమానత్వానికి విఘాతం.
ఓబీసీలకు తావులేని గణన..
భారత్‌లో మొదటి జనగణన బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో ఆధ్వర్యంలో 1872లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 సంవ త్సరాలకు క్రమం తప్పకుండా కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ రెండు దశల్లో సాగుతోంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన, అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ జరుగుతుంది. ప్రస్తుతం డిజిటల్ విధానంలో జనగణన ముందుకు సాగుతోంది. స్వీయ గణన, మొబైల్ యాప్, ఆన్‌లైన్ నమోదు సౌలభ్యాన్ని పెంచుతున్నాయి. 33 ప్రశ్నలతో సామాజిక-ఆర్థిక చిత్రాన్ని సమగ్రంగా అందించాలనే లక్ష్యం ప్రశంసనీయం. కానీ ఈ ప్రశ్నల్లో బీసీ/ఓబీసీ గణన లేకపోతే ఆ సమగ్రత ఎక్కడుంది?
గుర్తింపు ఉన్నవారికే లబ్ధి..
దేశ జనాభాలో బీసీల వాటా సుమారు 50–52 శాతం వరకు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినా అధికారిక డేటా లేకపోవడంతో విధానాలు అంచనాలపైనే నడుస్తున్నాయి. నేటికీ గ్రామాలు, పట్టణాల్లో బీసీ కుటుంబాలు అవకాశాల కోసం ఇంకా పోరాడుతున్నాయి. విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. NSSO, NFHS సర్వేలు సూచించినట్లుగా, విద్యా నిలిపివేత అధికం, అసంఘటిత రంగంలో ఉపాధి ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన గణన లేకపోతే లక్ష్యిత పథకాలు ఎలా రూపొందిస్తారు? ‘అడగకపోతే అమ్మ కూడా పెట్టదు’ అన్నట్లుగా గుర్తింపు ఉన్నవారికే లబ్ధి చేరే ప్రమాదం ఉంది.
సామాజిక జనగణనతో అసమానత్వం!
సామాజికంగా జనగణన సమానత్వానికి అద్దం. డేటా లేకపోతే న్యాయం ఉండదు. బీసీ గణన లేకుండా రిజర్వేషన్లు, విద్యా సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు అసంపూర్ణంగా మిగిలి పోతాయి. అసంఘటిత రంగంలో పెద్ద భాగం బీసీలదే అయినా విధానాల్లో ప్రతిఫలించకపోతే అది ఎవరి బాధ్యత? ‘లెక్క తెలిస్తేనే లాభం తెలుస్తుంది’ అన్నట్లుగా ముందుగా పూర్తి సమాచారం అవసరం. బీసీల గణన లేకుండా సమగ్ర అభివృద్ధి ఎలా సాధ్యం? నిజమైన సంఖ్య తెలియకుండా సామాజిక న్యాయం ఎలా అందుతుంది? జనగణనలో ఇచ్చే సమాచారం సంక్షేమంపై ప్రభావం చూపదని ప్రభుత్వం చెబుతోంది. అయితే అదే ధైర్యంతో బీసీ గణనను కూడా చేర్చాలి. ప్రజలు భయం లేకుండా వివరాలు ఇవ్వాలి. ప్రభుత్వం పారదర్శకంగా గణన చేయాలి.
పరిష్కారం స్పష్టమే..!
జనగణనలో బీసీ/ఓబీసీ కోసం ప్రత్యేక కాలమ్ ఉండాలి. డిజిటల్ విధానంలో సులభంగా గుర్తించే ప్రశ్నలు ఉండాలి. సేకరించిన డేటాను విశ్లేషించి రాష్ట్రాల వారీగా అవసరాల ప్రకారం పథకాలు రూపొందించాలి. “మనసుపెట్టి చేసిన పనికే ఫలితం” అన్నట్లుగా నిబద్ధత అవసరం. జనగణనను రాజకీయ అజెండాగా మార్చొద్దు. దేశానికి హానికరం. బీసీలను విస్మరించొద్దు. అది సామాజిక న్యాయానికి ద్రోహం. సమగ్ర, పారదర్శక జనగణన ద్వారానే సమాన అభివృద్ధి సాధ్యం. బీసీ జనాభా గణన చేర్చడం న్యాయబద్ధమైన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు తాజా జనగణనలో తన వంతు బాధ్యతగా పాల్గొనాలి.
- దుండ్ర కుమారస్వామి,
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,
99599 12341






