టెక్స్‌టైల్‌లో కోటి ఉద్యోగాలేవి?

by Ravi |
టెక్స్‌టైల్‌లో కోటి ఉద్యోగాలేవి?
X

భారతదేశంలో ఉద్యోగాల కల్పన ఒక ప్రహసనం అయిపోయింది. 23 కోట్ల చదువుకున్న నిరుద్యోగులు దేశంలో ఉన్నారు. ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల భర్తీ ఉట్టిదే. అదో వట్టి హామీ ముచ్చటలా మారింది. ఉపాధి హామీలో సగం మందికి కూడా పని దొరకడం లేదు. దేశం నిరుద్యోగులతో కిటకిటలాడిపోతున్నది. ప్రభుత్వ ప్రకటనలు అన్నీ ప్రకటనలకే పరిమితం అయిపోయినాయి. కీలక పరిశ్రమలు అన్నీ ప్రభుత్వ విధానాల వల్ల నిర్వీర్యం అయిపోతున్నాయి. ఖాళీ ఉద్యోగాల భర్తీ కూడా పారదర్శకంగా లేదు. దేశంలో వ్యవసాయ క్షేత్రం అనంతరం టెక్స్టైల్ విభాగంలో అత్యధిక ఉద్యోగాలు ఉంటాయి. సుమారు 10 కోట్ల మంది ఉపాధికి సంబంధించిన విభాగం ఇది.

లెక్కలు చెప్పేవారే లేరు..

2014నుంచి పరిశీలిస్తే అయితే టెక్స్‌టైల్‌ బడ్జెట్ వేల కోట్లతో కేటాయిస్తున్నారు. దీని లాభం టెక్స్‌టైల్‌ మేనేజిమెంట్‌కే వస్తుందా లేక ఉద్యోగులకు వస్తుందా.. ఈ విభాగంలో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా.. ఉన్నవారు ఉపాధి ఎలా ఎందుకు కోల్పోయారు.. ప్రభుత్వం కొత్త ఉద్యోగాల కల్పన ప్రకటన చేసిన తర్వాత ఎంతమందిని భర్తీ చేసారనే డేటా మాత్రం ప్రకటించదు. డేటా అప్డేట్ చేయలేదని ఒకరు చేస్తున్నామని కొందరు.. అసలు డేటా లేదు.. చెప్పలేమని కొందరు మంత్రులు ప్రకటించడం విశేషం.

వ్యవసాయం తర్వాత భారీ ఉద్యోగ అవకాశాలు లభించే టెక్స్‌టైల్‌ విభాగం నిర్వీర్యం అవుతున్నది. 2016 నుంచి 2020 వరకు రూ.17వేల 822 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ రంగంపై బడ్జెట్ ఖర్చుకు సంబంధించి లెక్కలు అసలు చెప్పేవారు లేరు. కానీ చెప్పిన ఫిగర్లనే పదే పదే పాత లెక్కలు కొత్త కవర్లో పెట్టి చూపే మాదిరి చెప్పేస్తూ ఉంటారు. ఒకప్పుడు భారతదేశం నుంచి చైనా కాటన్ కొనుగోలు చేసేది.. ఇప్పుడు చైనా వియత్నాం నుంచి తీసుకుంటున్నది.. బాంగ్లాదేశ్‌లో టెక్స్‌టైల్‌ మన దేశం కన్నా మంచి స్థానంలో ఉంది. ప్రపంచ మార్కెట్‌లో కాటన్ రేట్లలో మన కాటన్ ధర15శాతం ఎక్కువ కావడం వల్ల మార్కెట్ పడి పోయిందంటారు. కెపాసిటీ రిడక్షన్ వల్ల 35 శాతం మైనస్‌లోనికి వచ్చాం. ప్రభుత్వ ప్యాకేజీలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో అంతుచిక్కని విషయం.

పాత లెక్కలే.. కొత్త కవర్లలో..

2016 జూన్ 22న ప్రభుత్వం 1.1కోట్ల ఉద్యోగాలు టెక్స్‌టైల్‌‌లో భర్తీ కానున్నాయని ప్రకటించింది. రూ. 10వేల 683 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. దీని ద్వారా 7.5లక్షల ఉద్యోగాల అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 2020 మార్చ్12న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ టెక్స్‌టైల్‌‌లో1.11కోట్ల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి 2016 జూన్ 22న కేంద్రం ప్రకటించిన వివరాలనే మంత్రి మరోసారి ప్రకటించారు. మంత్రి ఉద్యోగాల డేటా గతంలో లేదని తాము ఇప్పుడు డేటాను రెస్యూమ్ చేస్తున్నామన్నారు. 2016 లో ఒక కోటి రెండు లక్షల ఉద్యోగాలు.. రిపీట్ లో 1.11...కోట్ల ఉద్యోగాలు అయ్యాయి. మరో 10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి స్మృతి ఇరానీ గతంలో ఒక సారి ప్రకటించారు.. అసలు 2016 లో ప్రకటించిన 1.1కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైందో ఎవరూ చెప్పలేదు. 2020 లోనే మంత్రి ప్రకటన పాత లెక్కలు కొత్త కవర్లో పెట్టి సమర్పించిన మాదిరి ఉన్నాయి కదా..ఈ పరంపర 2023 వరకు కొనసాగడం కూడా నిజమే. కదా!. అది అక్షరాలా నిజం..టెక్స్‌టైల్‌ పరిశ్రమలో టెక్స్‌టైల్‌ యజమానులు.. సంఘాల స్టేట్మెంట్ ప్రకారం 50 లక్షల మందికి పైగా కరోనాకు ముందే ఉద్యోగాలు కోల్పోయారు.

డేటానే లేనప్పుడు ఎలా?

కొన్ని రాష్ట్రాల్లో అధిక విద్యుత్ చార్జీల కారణంగా.. కాటన్ ధరలు 15 శాతం ఇతర దేశాల కన్నా ఎక్కువ ఉండడం వల్ల స్పిన్నింగ్ మిల్లులు నడవలేని పరిస్థితి ఏర్పడింది. 35 శాతం టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ నిర్వీర్యం అయింది. 2019 ఆగస్టులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో తమ సంకట పరిస్థితిని వివరిస్తూ ఆగస్టులో టెక్స్‌టైల్‌ వర్గాలు పెద్ద ప్రకటన జారీ చేశారు. అందులో నష్టాలను వివరించారు. 30 నుంచి 35 శాతం ఉత్పత్తి నిలిపి వేశారు. పత్తి ఉత్పత్తి ఎక్కువ జరుగుతున్నప్పటికీ కొనుగోళ్లు ప్రభుత్వ విధానాలు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉంది. టెక్స్‌టైల్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి హెడ్ లైన్ ఆటలా మారింది.. అందుకే ఎక్కడికక్కడ మంత్రుల, అధికారుల ప్రకటనకు పొంతన కనబడటం లేదు.. ప్రధాని నరేంద్ర మోదీ లాల్ ఖిలా నుంచి చేసిన ఉపన్యాసంలో ప్రతిసారి చెప్పిందే చెప్పినట్లు.. మంత్రులు కూడా అదే చేస్తున్నారు.. బడ్జెట్ గురించి చెప్పే వారు ఖర్చు గురించి చెప్పడం లేదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని లెక్కలు చెప్పే వారు ఆ ఏడాది లేదా తొమ్మిది ఏండ్లలో ఎన్ని భర్తీలు జరిగాయో లెక్కలు చెప్పడం లేదు. ఈ మొత్తంగా పరిస్థితిని, ప్యాకేజీల ప్రకటనను... డేటానే లేనప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి?

-ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్..విశ్లేషకులు

99518 65223

Advertisement

Next Story

Most Viewed