గ్రూప్ -2 ఫలితాలు ప్రకటించరా?

by Ravi |   (  Updated:2025-09-12 00:45:58  IST  )

రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో గ్రూప్- 2 అత్యంత కీలకం. ఒక్క పరీక్షతో ఉన్నత భవిష్యత్తు కోసం లక్షల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి కుస్తీ పడుతుంటారు.

గ్రూప్ -2 ఫలితాలు ప్రకటించరా?
X

రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో గ్రూప్- 2 అత్యంత కీలకం. ఒక్క పరీక్షతో ఉన్నత భవిష్యత్తు కోసం లక్షల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి కుస్తీ పడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ గ్రూప్- 2 అభ్యర్థులు కూడా ఏళ్ల తరబడి శ్రమించి పరీక్షలు రాసినప్పటికి ఫలితాల కోసం కూడా నెలల తరబడి వేచి చూడాల్సి రావడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది.

ఈ ఆలస్యానికి ముఖ్య కారణం గ్రూప్- 2 తుది జాబి తా రూపొందించడానికి అవసరం అయిన మెరిట్ కమ్ స్పోర్ట్స్ అభ్యర్థుల తుది జాబితా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికా ర సంస్థ (SAAP) నుంచి ఏపీపీఎస్సీకి రావాల్సి ఉంది.

ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం..

గ్రూప్2 మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 4‌న విడుదల కాగా ఏప్రిల్ నెలలోనే స్పోర్ట్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఆ తర్వాత అవి శాప్ కి ఏ తేదీన ఏపీపీఎస్సీ వారు పంపారు అనేది తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా కోరినప్పటికీ శాప్ వారి నుంచి ఇప్పటి వరకు సమాచారం రాలేదు. ఏది ఏమైనా చివరికి నష్టపోతుంది ఒక అభ్యర్థి మాత్రమే. జీవో 74 ప్రకారం స్పోర్ట్స్ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన తర్వాత ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ యొక్క ఆమోదం పొందిన తర్వాత ఆ జాబితా ఏపీపీఎస్సీ వారికి చేరుతుంది. అప్పుడు ఫలితాల తయారీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఏపీపీఎస్సీ వారు గ్రూప్ -2 ఫలితాల వెల్లడికి సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ జాబితా రావడం ఆలస్యం అవుతోంది. దీంతో నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి.

ఎండీ బదిలీతో మళ్లీ అంతరాయం..

ఉన్నత స్థాయి కమిటీలో కన్వీనర్‌గా వ్యవహరించే శాప్ ఎండీ ఇటీవల జరిగిన అధికారుల బదిలీల్లో బదిలీ అయ్యారు. నూతన ఎండీ వచ్చేవరకు ఈ ప్రక్రియ‌కు అంతరాయం తప్పదు. ఈ నెల నాలుగవ తారీఖున అభ్యర్థుల ధ్రువ పత్రాలు పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి కమిటీకి పంపిస్తాం అని శాప్ వారు పత్రికా ప్రకటన ఇచ్చారు. నూతన ఎండీ ఈ ప్రక్రియను వేగవంతం చేసి కన్వీనర్ హోదాలో ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం పొంది ఆ జాబితాను త్వరితగతిన ఏపీపీఎస్సీ వారికి పంపాల్సిందిగా మా అభ్యర్ధన. ఇక నుంచి జరగబోయే అన్నీ నియామకాలు నూతన క్రీడా విధానం ప్రకారం జరగనున్నాయి. ఈ నూతన విధానంలో ముఖ్యమైన విషయం ఉన్నత స్థాయి కమిటీకి గడువు విధానం పొందుపరిచారు. ముందస్తు గడువు విధించడం వలన ప్రక్రియ ఆలస్యం కాకుండా అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది. కానీ ఈ గడువు విధానం ప్రస్తుత జీవో 74లో పాటించలేదు. దీని వలన శాప్‌లో జరుతున్న ఆలస్యానికి జవాబుదారీతనం లేకుండా పోయింది.

డీఎస్సీ రికార్డ్ వేగం

పదహారు వేల పోస్టులతో వచ్చిన మెగా నోటిఫికేషన్‌లో ఉన్న క్రీడా అభ్యర్థుల ఎంపిక కూడా రికార్డ్ వేగంలో పూర్తయింది. ఇదే వేగం గ్రూప్ 1, 2 లో కూడా ఉండాలని ఆశించినప్పటికీ మాకు నిరాశే ఎదురువుతుంది. దీనికి మరొక కారణం శాప్‌లో సరిపడా సిబ్బంది లేకపోవడం. ప్రక్రియ పూర్తైనప్పటికి ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం పొందడం గగనంగా మారింది. డీఎస్సీకి లేని అడ్డంకులు గ్రూప్ 1,2 కి ఎందుకు వస్తున్నాయో భగవంతునికే ఎరుక.

విద్యామంత్రికి వ్యతిరేకంగా అదృశ్య శక్తులు..

యువత భావోద్వేగాలతో ముడిపడి ఉన్న జాబ్ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌కి చెడ్డ పేరు వచ్చేలా నియామకాలను అడ్డుకోడానికి, అవినీతి మరకలు అంటించడానికి కొన్ని అదృశ్య శక్తులు పని చేస్తున్నాయి. నియామకం ఆగిపోతే ఒక ప్రచారం, నియామకం ముందుకు వెళ్తే పోస్టులు అమ్ముడుపోయాయి కాబట్టి పూర్తి చేస్తున్నారు అని కొందరు పనిగట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాల వల్ల నిఖార్సయిన అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. నారా లోకేష్ పర్యవేక్షణలో మెగా డీఎస్సీ వలె గ్రూప్ 1, 2కి కూడా శుభం కార్డు వేస్తారు అని చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రతీ అభ్యర్థి నమ్మకం పెట్టుకున్నారు.

- జి.వి.సాయికుమార్ గుంత,

93911 42989

Next Story