- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్త్ కార్డులు ఎప్పుడొస్తాయి.. ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు ముగింపు ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రకటించిన ఈహెచ్‌ఎస్ హెల్త్ కార్డుల అమలులో కొనసాగుతున్న జాప్యం, కాంట్రిబ్యూషన్ కోతలు, నగదు రహిత వైద్యం హామీలు, ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు అంశాలపై విశ్లేషణ.

2023 నుంచి నిరీక్షించాల్సిన పరిస్థితి ప్రతిసారి చర్చలు జరపడం, ఇస్తామనడం తప్ప గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు ఎలాంటి పురోగతి లేదు. హెల్త్ కార్డులు మాత్రం నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో తప్ప ఎక్కడా ఉద్యోగులకు ఉచిత వైద్యం అందడం లేదు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో నగదు రహిత వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే కార్డులను అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయ నందున 2025 మే నెలలో, సెప్టెంబర్ 1న ఉద్యోగ పెన్షనర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అప్పుడు వారంలో హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పింది.
జూన్ 2న హెల్త్ కార్డులిస్తామని..
సరిగ్గా వారం గడిచాక ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తీరా కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈ.హెచ్.ఎస్. స్కీమ్‌పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంటామన్నారు. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ చర్చల్లోనూ హెల్త్‌కార్డులిస్తామన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో హెల్త్‌కార్డులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. మే రెండో తేదీన స్వయంగా ముఖ్యమంత్రి ఉద్యోగ జేఏసీతో చర్చలు జరిపి నగదు రహిత వైద్యాన్ని జూన్ 1 నుండి అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చి జూన్ 2 నుంచి హెల్త్ కార్డులిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ జేఏసీతో చర్చలు జరిపారు.
కట్ చేసిన అమౌంటు కనిపించలేదు..
ఇదే అంశంపై జూన్ 1న సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చివరికి జూన్ 2 నుండి అమలు చేస్తానన్న గడువు కూడా ముగిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇంత వరకు కార్డులు మాత్రం రాలేదు. చర్చలు జరిపి పది రోజులు దాటినా ఇప్పటివరకు ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు. నగదు రహిత కార్డులకు సంబంధించి విధి విధానాలు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఖరారు చేయలేదు. కానీ మే నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్ నుండి 1.5 శాతం కాంట్రిబ్యూషన్ హెల్త్ కార్డుల కొరకు ఉద్యోగ, పెన్షనర్ల అనుమతి లేకుండా అమౌంట్ కట్ చేశారు. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షనర్ల నుండి కట్ చేసిన మొత్తం అమౌంట్ 528 కోట్లు అవుతుంది. కానీ ప్రభుత్వం కూడా అంతే అమౌంట్ అనగా 528 కోట్లు ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్‌కు సంబంధించిన అకౌంట్‌లో జమ చేయాలి. కానీ ఆ విధంగా జరగలేదు. పెన్షనర్ల నుండి కట్ చేసిన అమౌంట్ పే స్లిప్‌లో కనిపించడం లేదు. ఆ అమౌంట్ పే స్లిప్‌లో ఎందుకు చూపించడం లేదు?
మంత్రులకూ, ఐఏఎస్‌లకూ రాజభోగాలు..
తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర రాజకీయ నాయకులకు, ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద అధికారులకు మిగతా అధికారులకు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, అవసరమైతే విదేశాలలో కానీ కార్పొరేట్ వైద్యం చేయిం చుకునే అవకాశం మీరు కల్పించుకుంటున్న విధంగా ఉద్యోగులను, పెన్షనర్లను ప్రభుత్వం ఎందుకు చూడడం లేదు? గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్గం, ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపి ఈ నెలలోనే ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్‌ను వెంటనే ఏర్పాటు చేసి, నగదు రహిత వైద్యానికి సంబంధించిన విధి విధానాలు వెంటనే ఖరారు చేసి, డిజిటల్ కార్డులను ఇప్పించి ఈ నెల నుండే అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యం అందించే విధంగా ఈ.హెచ్.ఎస్. కార్డులను విడుదల చేయాలని లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
-కందుకూరి దేవదాసు
రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్
99499 37745






