- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఏసీఎస్ పదవుల కోసం పోటీ.. ఎమ్మెల్యేలకు సవాలుగా మారిన ఎంపిక
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు నియమిస్తుండటంతో అధికార కాంగ్రెస్‌నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు నియమిస్తుండటంతో అధికార కాంగ్రెస్‌నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేల చుట్టూ స్థానిక నేతలు చక్కర్లు కొడుతున్నారు. ఆ పదవి రావాలంటే ఖచ్చితంగా సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. లేకుంటే వారికి ఈ పదవి వరించే ప్రాప్తి లేదు. ఈసారి నియమించే పదవులకు ఆరు నెలల గడువు ఉండటంతో చాలా వరకు పాత వారికే అవకాశం ఇస్తున్నారు. తరువాత చేపట్టే పదవులు 2 సంవత్సరాలకు ఉండటంతో కొందరు ఇప్పటి నుంచే భూములు పట్టాలు చేసుకుంటున్నారు. తరువాత ప్రభుత్వం సభ్యులుగా చేరేందుకు నోటిఫికేషన్ఇస్తే సభ్యత్వం తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
908 సహకార సంఘాలు
రాష్ట్రంలో 908 ప్రాథమిక సహకార సంఘాల ఉండగా వాటిలో 34,86,422 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. గత ఐదారేళ్ల నుంచి ఈ సంఘాల్లో సభ్యత్వాల జాడ లేదు. రాజకీయ నాయకులు కూడా వాటిపై పెద్ద ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం నామినేటెడ్విధానం తీసుకురావడంతో పీఏసీఎస్‌లకు ఆదరణ పెరిగింది. ప్రత్యక్షంగా రాజకీయాల్లో పోటీ చేయని వారంతా సహకార సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు క్యూ కట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు భూములు కలిగిన రైతులు 73 లక్షలు ఉంటే ప్రస్తుతం సహకార సంఘాల్లో సగం మంది ఉన్నారు. ఒక వేళ సభ్యులుగా చేరేందుకు నోటిఫికేషన్వస్తే మరో 15 లక్షల మంది చేరవచ్చని సహకార శాఖ అంచనా వేస్తోంది. కొత్తగా చేరి వారికి రూ. 10 వేల సభ్యత్వం పెడితే ప్రభుత్వానికి మరింత ఆదాయం రావచ్చని అభిప్రాయపడుతుంది. ఆ శాఖ అధికారులు ఈ నెలాఖరులో కొన్ని సంఘాలకు కమిటీ నియమించాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి సిఫారుసు లేఖ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 110 సంఘాలకు అభ్యర్థుల పేర్లు రాగా వాటిని స్క్రూట్నీ చేస్తున్నారు. వీలైనంత త్వరగా చైర్మన్లను ప్రకటించాలని మంత్రి తుమ్మల ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్రక్రియలో మునిగిపోయారు.
ఒక చైర్మన్..12 మంది సభ్యులు
రాష్ట్ర వ్యాప్తంగా 908 సంఘాలు ఉండగా ఒక సంఘానికి ఒక చైర్మన్‌తో పాటు 12 మంది సభ్యులతో కొలువు దీరేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నామినేటెడ్ద్వారా 11,778 మంది అధికార పార్టీ నేతలకు రాజకీయ ఉపాధి లభించనుంది. పాలకవర్గంలో ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ, ఇద్దరు బీసీ జనరల్, ఒక ఓసీ మహిళ, మరో ఏడుగురు జనరల్సభ్యులు ఉంటారు. పదవుల్లో నియమితులయ్యే వారు ఆయా సంఘాల్లో సభ్యులై ఉండాలి. గతంలో రుణాలు తీసుకుని చెల్లించకుంటే అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ రాజ్ సంఘాల్లో, ఇప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు. రెండు నెలలకితం 131 కొత్త సంఘాలు ఏర్పాటుకు జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపగా, వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే వారి దశల వారీగా ఏర్పాటు కానున్నాయి. ముందుగా పాత సంఘాలకు పాలకవర్గం ఏర్పాటు చేసి కొత్త వాటికి రెండో విడుత నియమించున్నారు.
అభ్యర్ధుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్
పీఏసీఎస్సంఘాలకు పాలకవర్గం అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారింది. నామినేటెడ్విధానం కావడంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ ఉన్నప్పడు పెద్దగా అటు వైపు ఎవరు మొగ్గు చూపేవారు కాదు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని, ఆర్దికంగా వెనకబడిన వారంతా పీఏసీఎస్‌ల్లో పదవులు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు పార్టీ కోసం వారు చేసిన సేవలు, ఆర్థికంగా నష్టపోయి పరిస్థితులను వివరిస్తూ ఈసారి ఎలాగైనా కట్టబెట్టాలని కోరతున్నారు. ప్రస్తుతం నియమించే కమిటీ పదవీకాలం ఆరు నెలలే ఉండటంతో మొన్నటివరకు పాలకవర్గంలో ఉన్న వారినే కొనసాగించేందుకు ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్తవారికి ఆరు నెలల తరువాత నియమించే కమిటీలో స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కొత్త కమిటీలతో మరిన్ని సేవలు
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గం కొలువు దీరితే రైతులకు మెరుగైన సేవలందుతాయి. సమయానికి వ్యవసాయ రుణాలు ఇవ్వటంతోపాటు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్ల వేగవంతం అవుతుంది. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్ట్‌గేజ్ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణకు రుణాలు, పశుపోషణకు రుణాలు, బంగారంపై రుణాలు అందుతాయి. పీఎసీఎస్‌ల ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో రైతులు ప్రాథమిక సహకారం సంఘాల్లో కొనుగోలు పెరుగుతుంది. యూరియా 80శాతం మేర సొసైటీల నుంచే రైతులకు అందుతోంది. పీఏసీఎస్ కేంద్రాలు ఏటా 5వేల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జీలుగ విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. ఈ ఖరీఫ్సీజన్లో రైతులకు ఇబ్బందులు రాకుండా త్వరగా పాలకవర్గం నియమించేందుకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలు పంపిన పేర్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలన చేస్తున్నారు.






