- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్‌కు న్యాయం ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 1940 మంది గెస్ట్ లెక్చరర్లు ఆటో రెన్యువల్, నెలకు ₹50,000 కన్సాలిడేటెడ్ వేతనం, రిలొకేషన్ సౌకర్యం వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అధ్యాపకుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై విశ్లేషణాత్మక కథనం.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సేవలందిస్తున్న సుమారు 1940 మంది గెస్ట్ లెక్చరర్స్ పరిస్థితి ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీరిలో అత్యధికులు పీజీ, నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగినవారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యా రంగాన్ని ఎంచుకున్నప్పటికీ, వారి అర్హతలకు, అనుభవానికి, సేవలకు తగిన గుర్తింపు మాత్రం ఇప్పటికీ లభించడం లేదు.
మూడు న్యాయమైన డిమాండ్లు..
తరగతుల నిర్వహణ, పరీక్షల విధులు, అకడమిక్ ప్రణాళికలు, సెమినార్లు, విద్యార్థుల మార్గదర్శకత్వం వంటి బాధ్యతలను నిర్వహిస్తూ విద్యా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు గెస్ట్ లెక్చరర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఉద్యోగ భద్రత, వేతన భద్రత, సేవా నిబంధనల విషయంలో నిరంతర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. గెస్ట్ లెక్చరర్స్ ప్రధానంగా మూడు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. మొదటిది ఆటో రెన్యువల్, రెండవది గౌరవప్రదమైన కన్సాలిడేటెడ్ వేతనం, మూడవది రిలొకేషన్ సౌకర్యం. ఇవి ప్రత్యేక ప్రయోజనాల కోసం చేస్తున్న డిమాండ్లు కాకుండా కనీస ఉద్యోగ భద్రత, మానవీయ జీవన పరిస్థితుల కోసం చేస్తున్న విజ్ఞప్తులు మాత్రమే.
జీవన వ్యయాలకు సరిపోని వేతనాలతో..
ప్రస్తుతం డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు ఒక్కో పీరియడ్‌కు ₹390 చొప్పున పారితోషికం చెల్లిస్తున్నారు. నెలకు గరిష్టంగా 72 పీరియడ్లు నిర్వహించినప్పటికీ కేవలం ₹28,080 మాత్రమే అందుతోంది. పీహెచ్‌డీ, నెట్, సెట్ వంటి అత్యున్నత అర్హతలు కలిగిన అధ్యాపకులు నేడు పెరుగుతున్న జీవన వ్యయాలకు సరిపోని వేతనాలతో పనిచేయాల్సి వస్తోంది. కుటుంబ పోషణ, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, అద్దె భారం వంటి అనేక సమస్యల మధ్య వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అనేక మంది గెస్ట్ లెక్చరర్స్ తమ కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ అధిక ప్రయాణ వ్యయాలు, నివాస సమస్యలు, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత సాధించడానికి కష్టపడుతున్నారు.
శాంతియుత పోరుబాటలో గెస్ట్ లెక్చరర్స్..
గెస్ట్ లెక్చరర్స్ గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ గౌరవ మంత్రులను, ఉన్నత విద్యాశాఖ అధి కారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించారు. న్యాయం చేయాలని కోరారు. ఇటీవల యాదాద్రి నుండి హైదరాబాద్ గన్‌పార్క్ వరకు మహా పాదయాత్రను చేపట్టి మండుటెండలను సైతం లెక్కచేయకుండా కిలోమీటర్ల మేర నడుస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వినతులు, నిరసనలు, పాదయాత్రలు ప్రజల గళాన్ని వినిపించే సాధనాలు. అయినప్పటికీ గెస్ట్ లెక్చరర్స్ ఆవేదనకు ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించకపోవడం విచారకరం.
ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలి!
ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్‌కు నెలకు ₹50,000 గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి గణనీయమైన కాలం గడిచినా అమలుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గెస్ట్ లెక్చరర్స్ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. అధ్యాపకులు న్యాయస్థా నాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం ఏ విద్యా వ్యవస్థకూ గౌరవప్రదం కాదు.
అధ్యాపకుల సంక్షేమం అవశ్యం!
భవనాలు, డిజిటల్ మౌలిక వసతులు, కొత్త కోర్సులు మాత్రమే కాకుండా వాటిని అమలు చేసే అధ్యాపకుల సంక్షేమాన్ని కూడా సమానంగా పరిగణించాలి. అందువల్ల ప్రభుత్వం తక్షణమే ఆటో రెన్యువల్, నెలకు ₹50,000 కన్సా లిడేటెడ్ వేతనం, రిలొకేషన్ వంటి న్యాయబద్ధమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని ఎన్నికల హామీలను అమలు చేయాలి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో కనీసం 2025–26 విద్యా సంవత్సరంలో పని చేసిన గెస్ట్ లెక్చరర్స్‌ను 2026–27 విద్యా సంవత్సరానికి కొనసాగించి డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్‌కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
- జానపట్ల కిషోర్ రెడ్డి,
ఎంసీఏ (పీహెచ్‌డీ)
99890 61620






