కేజీబీవీ టీచర్ల కష్టాలు తీరేదెన్నడు!?

by Ravi |   (  Updated:2026-04-22 01:00:21  IST  )

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సమాన వేతనం కోసం వారి పోరాటంపై విశ్లేషణాత్మక కథనం.

కేజీబీవీ టీచర్ల కష్టాలు తీరేదెన్నడు!?
X

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) 2004–05లో కేంద్ర పథకంగా ప్రారంభమై, రాష్ట్రంలో 2005 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించడం వీటి లక్ష్యం. 75% సీట్లు ఈ వర్గాలకే కేటాయిస్తారు. మధ్యలో చదువు మానేసిన బాలికలను తిరిగి విద్యలోకి తీసుకురావడం, ఉచిత హాస్టల్, ఆహారం, యూనిఫాం, పుస్తకాలు అందించడం, బాల్య వివాహాలను నిరోధించడం, వృత్తి నైపుణ్యాలు నేర్పడం వంటి సేవలు ఇస్తాయి. అయితే, నిరుపేద, అణగారిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న కేజీబీవీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఇన్నీఅన్నీ కావు...

రాష్ట్ర‌వ్యాప్తంగా 495 కేజీబీవీలు ఉన్నాయి.. వీటిలో దాదాపు 9500 మంది కేటగిరీ టీచర్లు పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా కేజీబీవీల్లో సేవలు అందిస్తున్న టీచర్లకు నేటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం శోచనీయం. ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నా ఎస్ఓలు, టీచర్ల సేవలను ప్రభుత్వం కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే కొనసాగించడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఎస్ఓలకు నెలకు రూ.32,500, సీఆర్‌టీలకు రూ.26,000, పీజీసీఆర్‌టీలకు రూ.29,900, పీఈటీలకు రూ.15,600, అకౌంటెంట్లకు, ఏఎన్ఎంలకు రూ.14,300 చొప్పున మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు.

సెలవులు తక్కువ, ఆపై ఆంక్షలు!

ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కేజీబీవీ టీచర్లు అనుభవిస్తున్న వివక్ష వర్ణనాతీతం. వీరు నిరంతరం ఒత్తిడి, అడ్డగోలు నిబంధనల నడుమ నలిగిపోతున్నారు. పగలు బోధన, రాత్రి పహారా వెరసి వారి జీవితం ఒక అలుపెరగని పోరాటంగా మారింది. ఉదయం 9 గంటలకు పాఠశాలకు హాజరయ్యే టీచర్లకు, ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటే వారి కష్టాలు వర్ణ నాతీతం. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 వరకు వారు విధుల్లోనే కొనసాగాల్సి ఉంటుంది. దాదాపు 27 గంటల పాటు విరామం లేకుండా పని చేయడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర శారీరక, మానసిక అలసటకు గురవుతున్నారు. సరైన నిద్ర, విశ్రాంతి లేక చిన్న వయసులోనే బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు వారిని వెంటాడుతున్నాయి.. వీరికి ప్రమాదాలు జరిగినా, అనారోగ్యం పాలైనా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వరు.. ఏడాదికి 20 క్యాజువల్ లీవ్స్ ఉన్నప్పటికీ, వాటి వినియోగంపై పెట్టిన నిబంధనలు విడ్డూరంగా ఉన్నాయి. నెలకు రెండు సెలవులకు మించి వాడకూడదనే ఆంక్షలు, ఒక నెలలో వాడుకోని సెలవులను తర్వాతి నెలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం లేదు. రోజుకు 8 పీరియడ్ల బోధనతో పాటు రికార్డుల నిర్వహణ, హాస్టల్, మెస్ పర్యవేక్షణ వంటి బహుముఖ బాధ్యతలతో కేజీబీవీ టీచర్లు సతమతమవుతున్నారు..

అన్నింటా వివక్షే!

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌రెడ్డి సర్కారు ఇరవై ఎనిమిది నెలలుగా రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. కేజీబీవీ టీచర్లు మాత్రం ప్రతి నెలా వేతనాల కోసం నిరీక్షించాల్సిందే. ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకి ఇస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కేజీబీవీ టీచర్లకు లేదు.. దురదృష్టవశాత్తు, కేజీబీవీ టీచర్ చనిపోతే కుటుంబానికి కనీసం కారుణ్య నియామకం పథకం కూడా వర్తించదు. వారసులకు ఉద్యోగం ఇవ్వరు.. కుటుంబం రోడ్డున పడాల్సిందే. విధి నిర్వహణలో దొర్లే చిన్న తప్పులకే ఉద్యోగం నుంచి తొలగించ డం వంటి తీవ్ర శిక్షలు విధిస్తు‌న్నారు. వేరే గత్యంతరం లేక పంటి బిగువున బాధలను భరిస్తూ భవిష్యత్తులో తమకు మంచి రోజులు రాకపోతాయా? అనే ఒకే ఒక ఆశతో కుటుంబాల కోసం ఉద్యోగంలో కొనసాగుతున్నారు.

మినిమం టైం స్కేల్ ఇవ్వాలి!

కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లను ప్రిన్సిపల్స్‌గా, పీజీసీఆర్టీలను జూనియర్ లెక్చరర్స్‌గా, సీఆర్టీలను స్కూల్ అసిస్టెంట్స్‌గా గుర్తించి వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయడానికి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం అనే సహజ న్యాయసూత్రాలను అమలు చేస్తూ, వీరికి వెంటనే మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. ఏళ్ల తరబడి ఒకే పోస్టులో మగ్గిపోతున్న వీరికి పదోన్నతులు కల్పించేలా సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలి. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్, కారుణ్య నియామక పథకాలకు అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. బాలికా విద్యే నవ సమాజ నిర్మాణానికి పునాది అని చెప్పే ప్రభుత్వం, ఆ విద్యను అందిస్తున్న మహిళా టీచర్లను విస్మరించకూడదు.. కేజీబీవీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుభూతితో పరిశీలించి సత్వరం పరిష్కరించాలి.

-మానేటి ప్రతాపరెడ్డి,

రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, TRTF

9848481028

Next Story