డీఏల మంజూరు ఇంకెప్పుడో!?

by Bhoopathi Nagaiah |

పెరిగే ధరల కనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకోసారి కరువు భత్యం (డీఏ) ప్రకటిస్తారు.

డీఏల మంజూరు ఇంకెప్పుడో!?
X

పెరిగే ధరల కనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకోసారి కరువు భత్యం (డీఏ) ప్రకటిస్తారు. పీఆర్సీలు ఆలస్యమైనా వారిని ఆదుకునేది డీఏ మాత్రమే. జనవరి వినియోగదారుల ధరల సూచీ ప్రాతిపదికగా మార్చిలో, జులై ధరల సూచీ ప్రకారం సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా డీఏలు ప్రకటిస్తోంది. కోవిడ్ సమయంలో మినహా గత నాలుగు దశాబ్దాల్లో డీఏ మంజూరులో కేంద్రం ఆలస్యం చేసిన దాఖలాల్లేవు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తున్నాయి.

రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఎప్పుడు మంజూరు చేయాలనే విషయంపై నిర్దిష్టమైన పాలసీ లేదు. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీఏ ప్రకటించడం ఒక కానుకగా, పాలకుల దయగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే నాటికి బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు డీఏలు పెండింగులో పెట్టి అధికారం నుంచి దిగిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో మరో నాలుగు డీఏ కిస్తులు బకాయిపడ్డాయి. జులై 2023, జనవరి 2024 నుంచి 3.64 శాతం చొప్పున, జులై 2024 నుంచి 2.73 శాతం, జనవరి 2025 నుంచి 1.82 శాతం, జులై 2025 నుంచి 2.73 శాతం డీఏ మంజూరు చేయాల్సి ఉంది.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలా?

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే పెండింగులో ఉన్న మూడు డీఏలను తక్షణం చెల్లిస్తామనీ, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డీఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా చెల్లిస్తామనీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్లో ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే ఆచరణలో మాత్రం పూర్తిగా ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంబించింది. దాంతో విసిగిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నమ్మి వారికి ఓటు వేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో కొత్త పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు.

ఇన్ని డీఏల పెండింగు ఎన్నడూ లేదు

కనీసం డీఏలనైనా సకాలంలో మంజూరు చేస్తే ఉద్యోగులకు కొంత ఊరట దక్కేది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదు డీఏలు పెండింగులో ఉండగా, జనవరి 2026 నుంచి మరో డీఏ వాయిదా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇన్ని డీఏలు పెండింగులో పెట్టలేదు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్‌గా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్న రేవంత్‌రెడ్డి సర్కారు డీఏలను సైతం సకాలంలో ప్రకటిస్తే బాగుండేది. ఈ చర్యతో ఉద్యోగులు, పెన్షనర్లను ఆదుకోవడమే కాకుండా, ఎన్నికల్లో ఇచ్చిన ఒక ప్రధాన హామీని నెరవేర్చినట్టూ అవుతుంది.

వేతనంలో అంతర్భాగం డీఏ...

ఉద్యోగులకు డీఏ పెంపు అనేది పాలకులు దాతృత్వంతో ఇచ్చే అదనపు మొత్తం కాదు. అది వేతనంలో అంతర్భాగం. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు. నిధుల కొరత పేరు చెప్పి డీఏలు ఆపడానికి వీల్లేదని పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల కేసులో ఈ ఏడాది మే 16న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేయడానికి వీలులేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధత, ప్రేమను చూపించడానికి డీఏలు విడుదల చేయడం ఒక సానుకూల సంకేతంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే భావనతో ఉద్యోగులు రెండేళ్లు ఓపిక పట్టిన విషయం మరచిపోకూడదు. ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూనే ఉంది. ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా అంతే ప్రాధాన్యత గల అంశంగా చూడాలి. డీఏల మంజూరుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల జెఏసి వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం. క్యాబినెట్ సబ్-కమిటీతో జెఏసి చాలాసార్లు చర్చలు జరిపినప్పటికీ సానుకూల నిర్ణయం వెలువడకపోవడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

సీఎం చొరవ చూపాలి

పెరిగే ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడే ఉద్యోగులకు డీఏ సకాలంలో ప్రకటించడమే కాస్త ఊరట. కేంద్రం ప్రకటించిన నెలలోపు డీఏ మంజూరు చేసే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు ప్రకటించాలి. ఈ పాలసీ అమలు చేస్తే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కలను నెరవేర్చినట్టు అవుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్ధిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలి. రాష్ట్ర పరిపాలనను ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టడం వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఐదు పెండింగ్ డీఏలను ప్రకటించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, ఉద్యోగులపై ప్రభుత్వ ప్రేమను ప్రతిబింబించే చిహ్నంగా కూడా నిలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా, ఉద్యోగులు, పెన్షనర్లలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి సర్కారు విశ్వసనీయతను సైతం ఇనుమడింపజేస్తుంది.

-మానేటి ప్రతాపరెడ్డి,

టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు,

98484 81028

Next Story