- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చట్ట సభలేమో ఉన్నత వర్గాల వారికి.. స్థానిక రిజర్వేషన్‌తో బీసీలకా?
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కాదు 50% ఇచ్చినా మళ్లీ ఈయన గెలిచాక అయ్యా అంటూ రెడ్డి దగ్గరకే పోవాలి. అసెంబ్లీ, పార్లమెంట్ మొత్తం అగ్రవర్ణాలు ఆక్రమించుకొని బీసీలకు గ్రామ పంచాయతీ లెవెల్లో 42% ఇస్తే ఏంది 50% ఇస్తే ఏంది?

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కాదు 50% ఇచ్చినా మళ్లీ ఈయన గెలిచాక అయ్యా అంటూ రెడ్డి దగ్గరకే పోవాలి. అసెంబ్లీ, పార్లమెంట్ మొత్తం అగ్రవర్ణాలు ఆక్రమించుకొని బీసీలకు గ్రామ పంచాయతీ లెవెల్లో 42% ఇస్తే ఏంది 50% ఇస్తే ఏంది? 50% పైన ఉన్న బీసీలు గ్రామ పంచాయతీల్లో ఉండాలి, 10% కూడా లేని అగ్రవర్ణాలు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉండాలి. బీసీలు ఎప్పుడైతే రెడ్లకు, దొరలకు జై కొట్టడం, జోకడం ఆపి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే బీసీలు సామాజికంగా, రాజకీయంగా ముందుంటారు.
మా రెడ్డి దొర ఇంతా, మా రెడ్డి సాబ్ అంతా అని ఆకాశానికి ఎత్తడం ఆపి అసలు మా జనాభా ఎంత, మాకు రావలసిన వాటా ఎంత అని ఆలోచించి అడగడం మొదలు పెట్టండి. ఇప్పుడూ బీసీలకు ఇచ్చే 42% వాటాకు కూడా రెడ్డి దొరనే అడ్డు పడుతున్నాడు అని బీసీ సమాజం తెల్సుకోవాలి. జోకుడుతనం బంజేసుకోండి, ఆలోచించే తత్వం, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి. జోకుడు రాజ కీయాలు ఎప్పుడూ నిన్ను ఒకడి కింద బానిసగానే ఉంచుతాయి.
రాజ్యం, వాటా రెండూ కావాలిప్పుడు!
50% ఉన్న మనల్ని 10% లేని వాళ్లు తరాలుగా మనల్ని పాలించడం ఏంది? మనకు రాజ్యం కావాలి మనకు మన వాటా కావాలి అని చదువుకున్న వాడిగా ఎప్పుడైతే ఆలో చిస్తావో అప్పుడే అసలైన ఉద్యమం. మనకు కావాల్సింది చట్ట సభలో మన వాటా. అసెంబ్లీ, పార్లమెంట్‌లో మా వాటా ఎంత? అని ప్రశ్నించిన నాడు అసలైన బీసీ ఉద్యమం మొదలవుతుంది. బీసీల సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ స్థితుల్లో గత 77 ఏండ్లుగా ఆశించిన మార్పు జరగలేదు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశం తెరమీదికి వచ్చింది.
50% మించొద్దని చెబుతున్నా..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావడం దాదాపు అసంభవం. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం చెబుతోంది. 2019 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 26.19 శాతం, బీసీలకు 23 శాతం రిజర్వేషన్లను అమలు పరిచారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని తీర్మానించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీళ్లేదని చట్టం కరాఖండిగా చెబుతూ ఉంటే ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని బీసీలను మభ్య పెడుతున్నారు.
ఆర్డినెన్స్‌కు రాజ్యాంగం ఒప్పుకోదు..
నిజానికి ఈ ఆర్డినెన్స్ జారీ చేయడానికి కూడా రాజ్యాంగం ఒప్పుకోదు. ఎందుకంటే ఏదైనా అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నట్లయితే అదే అంశంపై గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీల్లేదని చట్టం చెబుతున్నది. ఇప్పటి వరకు ఒక్క తమిళనాడు మినహా ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు కావడం లేదు. ఇటీవల ఝార్ఖండ్ రాష్ట్రం పెంచడానికి ప్రయత్నిస్తే కూడా దానికి అనుమతి లభించలేదు. తమిళనాడులో రిజర్వేషన్లు షెడ్యూల్-9లో చేర్చారు కాబట్టి అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. షెడ్యూల్-9లో ఏదైనా అంశాన్ని చేర్చితే దానిపై కోర్టులు జోక్యం చేసుకోకూడదనే రక్షణ లభిస్తుంది.
చట్టసభలలో రిజర్వేషన్ల కోసం పోరాడదాం!
మన బీసీల వాటాల గురించి, హక్కుల గురించి మాట్లాడేందుకు మనవాళ్లు ఎవరు అక్కడ ఉండరు.. ఉన్నా కూడా అగ్రవర్ణాల దర్శకత్వంలో ఉంటారు. పార్లమెంట్ మొత్తం అగ్రవర్ణాలతో నిండి ఉంది కాబట్టి ఏ లెక్కలు లేకుండా ఏ చప్పుడు లేకుండా ఈడబ్ల్యూఎస్ 10% చట్టంగా చేసి వడ్డిస్తున్నారు. అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న ఓ నా బీసీల్లారా హేతుబద్దంగా ఆలోచించండి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంపుదల కోసం పోరాడే కన్నా అసలు బీసీలకు రిజర్వేషన్లే లేని చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎందుకు పోరాడకూడదు?
బీసీల మెదళ్లను లాగేసుకున్నారు...
బీసీలను పండగలు, సంప్రదాయాలు అంటూ మెదడు నిండా బ్రాహ్మణ భావజాలం నింపి మనకు రావాల్సిన హక్కులు, వాటాలు వాళ్లు తింటూ కనీసం ప్రశ్నించే ఆలోచన కూడా రాకుండా మనల్ని మన మెదడును వాళ్ల అధీనంలోకి తీసుకున్నారు. ఇది తరతరాల నుండి బీసీలను సామాజికంగా, రాజకీయంగా మోసం చేస్తూ వస్తున్న అగ్రవర్ణాల కుట్ర. బానిసత్వం సంకెళ్ల రూపంలోనే కాదు సంస్కృతి రూపంలో కూడా ఉంటుంది. అప్పుడు ఎప్పుడో జరిగిన 1931లో జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికీ 50% పైన ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఏ లెక్కల ఆధారంగా 10% కూడా లేని అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ అని 10% శాతం ఇస్తున్నారు?
బీసీల యుద్ధం ఎవరిమీద..?
శతాబ్ద కాలంగా (1931) కుల గణన చేయకపోవడం, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సరిగా అమలు కాకపోవడం, క్రిమిలేయర్ విధాన ఆర్థిక పరిమితి ఇలా అనేక అంశాలలో బీసిలకు జరుగుతున్న అన్యాయాలు ఎదురుకోవడానికి వారిని ఒక్క తాటిపైకి తెచ్చి బలంగా కూడగడుతున్నాయి. ఈరోజు ఉనికిలో ఉన్న అన్ని పార్టీలు బీసీ బంద్‌కు మద్దతు ఇచ్చాయి. మరి బీసీలు యుద్ధం చేయాల్సింది ఎవరి మీద, ఎవరు బీసీలకు శత్రువులు? అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అందరూ శాకాహారులే మరి కోడిని తిన్నది ఎవరు అన్నట్టు ఉంది.
-బసడ సంపత్ యాదవ్
70321 32593






