మత్స్యకారుల వెతలు తీరేదెన్నడు?

by Disha edit |
మత్స్యకారుల వెతలు తీరేదెన్నడు?
X



ఉత్తరాంధ్రలో వేట గిట్టుబాటు కాక, మూతిమీద మీసం కూడా మొలవకముందే 30 వేలమందికి పైగా మత్స్యకార యువకులు వలసల వలలో చిక్కుకుంటున్నారు. పొట్టకూటి కోసం పశ్చిమబెంగాల్‌, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యాలు, జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్లు లేకపోవడమే ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలసలకు ప్రధాన కారణం. గత ముప్పై ఏళ్లుగా జెట్టీ కట్టిస్తున్నామని మత్స్యకారులకు చాలామంది నాయకులు మాటిచ్చారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏకంగా మంచిళ్లపేటలో జెట్టీ కాదు ఫిషింగ్‌ హార్బరే నిర్మిస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించింది. కానీ, ఇప్పటివరకూ జెట్టీ రాలేదు, మట్టీ రాలేదు. మత్స్యకారుల జీవితాలతో రాజకీయాలు చేయడం శోచనీయం. రాష్ట్ర తీర ప్రాంతంలో సుమారు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో తమ ప్రభుత్వం మెరైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మిస్తోందని, దీంతో వలసలను శాశ్వతంగా నివారిస్తామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మాటలతోనే మూడున్నరేళ్లు కరగదీసింది. హార్బర్లు అంటూ ఆర్భాటాలకు పోతున్న ప్రభుత్వాలకు వలసల గురించి, వారి గోసలు ఎన్నడు వినబడుతుంది ముఖ్యమంత్రి జగన్‌ సహా మంత్రులు, అధికార పక్ష నాయకులు అంతా ఉత్తరాంధ్ర మత్స్యకార గ్రామాల్లో తిరిగితే వారి సమస్యలు తెలుస్తాయి. ఉత్తరాంధ్ర మత్స్యకార బిడ్డల మనసు మారేలోపే జెట్టీ కల నెరవేర్చాలి.

లేవారు మారుతున్నా...దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర మత్స్యకారుల వెతలు మాత్రం తీరడం లేదు. ఇక్కడ వేట గిట్టుబాటు కాక, మూతిమీద మీసం కూడా మొలవకముందే మత్స్యకార యువకులు వలసల వలలో చిక్కుకుంటున్నారు. పొట్టకూటి కోసం పశ్చిమబెంగాల్‌, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఒంట్లో సత్తువున్నంత కాలం అష్టకష్టాలు పడుతూ వలసల ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇలా వలస వెళ్లినవారిలో కొంతమంది వేటలో దారి తప్పి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక నేవీలకు చిక్కి జైళ్లలో మగ్గుతున్నారు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యాలు, జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్లు లేకపోవడమే ఉత్తరాంధ్ర మత్స్యకారుల వలసలకు ప్రధాన కారణం. వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోన్న ప్రభుత్వాలదే ఈ పాపం.

దేశంలోనే గుజరాత్‌ తర్వాత అత్యంత పొడవైన తీర ప్రాంతమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. అందులోనూ శ్రీకాకుళం జిల్లాకి 193 కిలోమీటర్ల పొడవైన తీరం ఉంది. ఈ జిల్లాలోని 154 గ్రామాల్లో చేపల వేటతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు సుమారు 60 వేల మంది ఉంటారు. స్థానికంగా మార్కెట్లు, జెట్టీలూ, ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించకపోవడం వల్ల ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, రణస్థలం తీర మండలాల్లోని మత్స్యకార గ్రామాల నుంచి 30 వేలకుపైగా మంది పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. వీరిలో ఎక్కువగా యువకులే ఉంటారు. ఇక్కడ మిగిలిన ముప్పై, నలభై వేల మంది మత్స్యకారుల్లో అధికంగా నడి వయస్కులు, మహిళలే ఉంటారు. వీరు తమ పడవల్ని, వలల్ని, పాకల్ని గాల్లో దీపాల్లా పెట్టుకొని భయంతో బతుకులెళ్లదీస్తున్నారు.

కనీస సౌకర్యాలు లేవు

జెట్టీలతో పాటు చేపలను నిల్వ చేసుకునేందుకు కోల్ట్‌ స్టొరేజీలు, చేపలను ఎండ బెట్టుకునేందుకు ప్లాట్‌ఫామ్‌‌లు, గిట్టుబాటు ధర అందించే మార్కెట్లు కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కడా కనిపించవు. గత ముప్పై ఏళ్లుగా జెట్టీ కట్టిస్తున్నామని మత్స్యకారులకు చాలామంది నాయకులు మాటిచ్చారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం, డి. మత్స్యలేశం, రాళ్లపేట, కవిటి మండలం ఇద్దివానిపాలెం, సోంపేట మండలం బారువా కొత్తూరు, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్లపేటలో జెట్టీలు కట్టిస్తామని 2014 నుంచి ఊరిస్తున్నారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏకంగా మంచిళ్లపేటలో జెట్టీ కాదు ఫిషింగ్‌ హార్బరే నిర్మిస్తామని, బుడుగట్లపాలెం వద్ద కూడా ఇంకో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించింది. విజయనగరం చింతపల్లి, విశాఖపట్న భీమిలితో పాటు రాజయ్యపేట వద్ద ఫ్లోటింగ్‌ జెట్టి నిర్మాణం చేపడుతున్నామని వైసీపీ మాట్లాడటమే కానీ, పనులు ముందుకు సాగుతున్నట్లు ఎక్కడా కనపడదు. రాష్ట్రంలోని తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక జెట్టీతో పాటు 9 హార్బర్లను నిర్మిస్తామని, వీటి పనులు ప్రారంభించడానికి సీఎం సిగ్నల్‌ ఇచ్చారని కాలయాపన చేయడం కూడా వైసీపీ నాయకులకే చెల్లింది. ఇప్పటి వరకూ జెట్టీ రాలేదు, మట్టీ రాలేదు. మత్స్యకారుల జీవితాలతో రాజకీయాలు చేయడం శోచనీయం.

మాటలే కోటలు

ఒక ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 350 నుంచి 450 కోట్ల రూపాయిలు ఖర్చవుతుందని, ఇలా చూసినప్పుడు రాష్ట్ర తీర ప్రాంతంలో సుమారు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో తమ ప్రభుత్వం మెరైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మిస్తోందని, దీంతో వలసలను శాశ్వతంగా నివారిస్తామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మాటలతోనే మూడున్నరేళ్లు కరగదీసింది. ఫిషింగ్‌ హార్బర్‌ కి వెచ్చించే నిధుల్లో సగం ఖర్చు చేసినా తీరంలో పది మినీ జెట్టీలు నిర్మించవచ్చు. ఈ లెక్కనే గుజరాత్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కనీసం 20 నుంచి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ నిర్మించాయి. ఇదే పని మన ప్రభుత్వానికి ఎందుకు చేతకావడం లేదు? ఇది కాదా వివక్ష? మిమ్మల్ని గెలిపించింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికా లేక దోపిడీ చేయడానికా? స్థానిక నాయకులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని ఉత్తరాంధ్ర గడ్డ కోసం గొంతు విప్పాలి. లేదంటే, జెట్టీలు నిర్మిస్తే తమ బతుకులు మారతాయని నమ్మకంతో ఎదురు చూస్తున్న మత్స్యకార యువత మిమ్మల్ని క్షమించబోదని గుర్తెరగాలి.

కాటేస్తున్న కాలుష్యం..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో 340 కిమీల పొడవైన తీరప్రాంతంపై మత్స్యకారుల జీవనం ఆధారపడి ఉంది. ''మహా విశాఖ నగరం'' ఒకప్పుడు మత్స్యకార గ్రామం. అలాంటి తీరంలో ఇప్పుడు పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాలతో సముద్ర జలాలు కలుషితమైపోతున్నాయి. నాటుపడవల్లో సముద్రంలోకి వెళ్లడం ప్రాణాలతో చెలగాటంగా ఉంది. నీతి ఆయోగ్‌ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆర్థికంగా వెనకబడిన జిల్లాలుగా గుర్తించింది. అయినా, ఈ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 19 గ్రామాల పరిధిలో 27 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా సుమారు లక్ష మంది మంది ఇక్కడ మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్ర తీరంలో వెలసిన ఫ్యాక్టరీలు, చమురు గ్యాస్‌ నిక్షేపాల ద్వారా రసాయన కాలుష్యాలు వల్ల గత కొన్నేళ్లుగా సముద్రతీరంలో మత్స్య సంపద క్షీణించిపోతోంది.

సముద్రంలోకి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళితేగానీ కొద్దో గొప్పో చేపలు చిక్కడం లేదు. తీరంలో జెట్టీలు లేకపోవడం వల్ల అంతదూరం వెళ్లిన సంప్రదాయ మత్స్యకారులు ప్రమాదాల్లో, వైపరీత్యాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. భీమిలిలో చేపల జట్టీలు నిర్మిస్తే విశాఖ మాదిరి ఇక్కడి నుంచే మెకనైజ్డ్‌ బోట్లను నడిపించుకునే అవకాశం కలుగుతుంది. కానీ, ఈ సదుపాయం లేకపోవడంతో అటు విజయనగరం జిల్లా తోటపల్లి ముక్కాం, కొండ్రాజు పాలెం, తిప్పలవలస, చేపల చింతపల్లి ప్రాంతాల మత్స్యకారులతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల మత్స్యకారులు, విశాఖ చుట్టూ ఉన్న మత్స్యకార గ్రామాల వారు విశాఖ హార్బర్‌కు వెళ్లక తప్పడం లేదు. పైగా, దొరికిన వాటిని స్థానికంగా అమ్ముకునే వెసులుబాటు లేక వచ్చిన ధరకే దళారులకు అమ్ముకొని మత్స్యకారులు నష్టపోతున్నారు.

జెట్టీలు ఉంటే...

సముద్ర తీరంలో జెట్టీలు ఉంటే మత్స్యకారుల జీవితాలు వలలో చిక్కుకునే పరిస్థితి రాదు. జెట్టీ ఉంటే మత్స్యకారులు వలస వెళ్లాల్సిన అవసరమే ఉండదు. జెట్టీ అలల ఆటుపోట్లను అడ్డుకుంటుంది. అలజడి ఉండదు కాబట్టి, అక్కడ పెట్టుకునే పడవలు, బోట్లకు రక్షణ ఏర్పడుతుంది. వేట తర్వాత తమ సామాగ్రిని కూడా అక్కడే దాచుకోవచ్చు. జెట్టీల నుంచి బోట్లు, సంప్రదాయ పడవలు, మినీ స్టీమర్ల ద్వారా రాత్రి పగలు తేడా అని లేకుండా ఏ సమయంలోనైనా వేటకు వెళ్లొచ్చు. సముద్రంలో తుఫాన్లు, ఇతర వైపరీత్యాలు, వేటపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు జెట్టీ ఉంటే వేగంగా తీరం చేరుకోవచ్చు. జెట్టీ లేకపోతే అలలు ఆటుపోట్ల వల్ల వేటకి వెళ్లిన పడవలు తిరగబడి, చనిపోయిన ఘటనలెన్నో తీరప్రాంతంలో ఉన్నాయి. జెట్టీ ఉంటే అలాంటి పరిస్థితి రాదు. వానొచ్చినా, తుఫానొచ్చినా మత్స్యకారులు తమ పడవలన్నింటినీ జెట్టీ దగ్గరే కట్టేసుకొవచ్చు. జెట్టీ ఉంటే మత్స్య సంపదకు రవాణా అనుకూలంగా మారుతుంది. దాంతో వ్యాపారులు చేపల కొనుగోలుకు నేరుగా మత్స్యకారుల గ్రామాలకే వస్తారు. వారు వస్తే కోల్డ్‌ స్టోరేజ్‌లు వస్తాయి. తద్వారా మత్స్యకారులు మెరుగైన ఆదాయం పొందుతారు. గ్రామాలు బాగుపడతాయి. వలసలు తగ్గుతాయి. అందుకే కనీసం మినీ జెట్టీలైనా కట్టమని మత్స్యకారులు వేడుకుంటున్నారు. అయినా హార్బర్లు అంటూ ఆర్భాటాలకు పోతున్న ప్రభుత్వాలకు వలసల గురించి, వారి గోసలు ఎన్నడు వినబడుతుంది

ఈ భరోసా సరిపోదు.

జెట్టీలు లేక.. వేట గిట్టుబాటుకాక వినాయక చవితి తరువాత ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తారు. సుమారు 8 నెలలు అక్కడే ఉండి వేట సాగిస్తారు. ఏప్రిల్‌, జూన్‌ మధ్య సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో చేపలవేటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. కాబట్టి, ఏప్రిల్‌లో మత్స్యకారులంతా సొంతూళ్లకు చేరుకుంటారు. ఈ నిషేధ సమయంలో వై.ఎస్‌.ఆర్‌ మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ 10 వేలతో రెండు మూడు నెలలు వారి కుటుంబం గడవలేని పరిస్థితి. ఇతర పథకాలు పొందుతున్న వారికి మినహాయింపుల ఆంక్షల పేరిట ఈ భరోసా లబ్ధిదారుల సంఖ్యను కూడా ప్రభుత్వం క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. మత్స్యకార గ్రామాల్లో యువతకు ఉపాధితో పాటు కనీస వసతులైన రోడ్లు, తాగునీటి సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ముఖ్యమంత్రి జగన్‌ సహా మంత్రులు, అధికార పక్ష నాయకులు అంతా ఉత్తరాంధ్ర మత్స్యకార గ్రామాల్లో తిరిగితే వారి సమస్యలు తెలుస్తాయి. ఈ ఏప్రిల్‌లో కనీసం ఒక్కసారి మా ఉత్తరాంధ్ర మత్స్యకార గ్రామాలల్లో పర్యటించాలి... ఎన్నో ఏళ్లుగా వారిని ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్న మీ మాటలకు, చేష్టలకు ఆత్మ సాక్షిగా స్వస్తి పలకాలి. ఉత్తరాంధ్ర మత్స్యకార బిడ్డల మనసు మారేలోపే జెట్టీ కల నెరవేర్చాలి.

- కొణతాల రామకృష్ణ

మాజీ ఎంపీ,కన్వీనర్‌,

ఉత్తరాంధ్ర చర్చా వేదిక

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story

Most Viewed