సినిమా రంగానికి మంచిరోజులెప్పుడు?

by Ravi |   (  Updated:2024-12-29 01:16:00  IST  )

ఔషధ, ఐటీ రంగాల మాదిరిగా చిత్ర పరిశ్రమకు కూడా అన్ని విధాలుగా హామీ ఉంటామని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బాలీవుడ్

సినిమా రంగానికి మంచిరోజులెప్పుడు?
X

ఔషధ, ఐటీ రంగాల మాదిరిగా చిత్ర పరిశ్రమకు కూడా అన్ని విధాలుగా హామీ ఉంటామని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బాలీవుడ్, హాలీవుడ్ నిర్మాతలకు కూడా ఇక్కడ షూటింగ్‌లు చేసుకునేలా హైదరాబాద్ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నదే తమ ఆకాంక్షగా ప్రకటించింది. మరో ముందడుగు వేసి త్వరలో భారీ సదస్సు నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. పుష్ప -2 సినిమా వివాదంతో తలెత్తిన సమస్యను పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. అసలు సమస్య ఏమంటే?

సినీ పరిశ్రమ/ చిత్ర పరిశ్రమ అని పేర్కొంటున్నది నిజంగా పరిశ్రమమేనా? దీనికి పరిశ్రమ లక్షణాలు ఉన్నాయా? దీనిలోని కార్మిక చట్టాలు అమలవుతాయా? వేతన స్థిరీకరణ ఉంటుందా? ఉద్యోగ భద్రత ఉందా? ఆర్టిస్టుల (హీరో, హీరోయిన్, విలన్) రెమ్యునరేషన్ ఎంత? గేయ రచయిత, మాటల రచయిత, ఫొటోగ్రఫీ, మేకప్‌మెన్, నేపథ్య గాయకులు, కాస్ట్యూమ్ డిజైనర్, డ్యాన్సులలో పాల్గొనే కళాకారుల రెమ్యునరేషన్ ఎంత? వీటి మధ్య వ్యత్యాసం ఎంత? నిర్మాతకు మిగిలేది ఎంత? ఇలా ఎన్నో ప్రశ్నలు.. భూ సంస్కరణ అమలు జరపాల్సిన చోట కోట్ల రూపాయల విలువ చేసే భూములు ప్రోత్సాహం కింద రాయితీలిచ్చి సినీ స్టూడియోలకు ఎలా కేటాయిస్తారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ ఏమైనట్టు? యాస భాషా సంస్కృతుల రక్షణ పోరాటం ఎటు పోయినట్టు? అభ్యుదయవాదం? ఉద్యమ, త్యాగాల చరిత్ర ఏది? తెలంగాణలో అంతరించిపోతున్న కళారూపాల ప్రదర్శనకు గుర్తింపేదీ? పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒరిగిందేమిటి? పాలకులకు తెలంగాణ ఆకాంక్షలు తెలియవా? మరిచిపోయారా? గుర్తుకు రావా? మీడియాకు పట్టదా? అన్న ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి.

తెలుగు సినిమా స్వర్ణయుగం ఎక్కడ?

సినిమా రంగానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శ్యామ్ బెనగల్, బి. నరసింగరావు లాంటి వారు తెలంగాణకు చెందినవారే. పండితులను, పామరులను పరవశింపచేసిన అతి గొప్ప ప్రజా గాయకుడు గద్దర్ వంటి ఎందరో గాయకులకు నెలవైన నేల ఈ తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని, ఉద్యమరూపాన్ని తెరకెక్కించిన ఎన్. శంకర్ వంటి ఎందరో సినీ ప్రముఖులు పుట్టి పెరిగిన నేల ఇది. భూమికోసం, మా భూమి, రంగుల కల, జై బోలో తెలంగాణ, వంటి సినిమాలు ఈ ప్రాంత ప్రజల జీవన సౌరభాలను వెదజల్లాయి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భూస్వాముల దౌర్జన్యాలను, రజాకార్ల రాక్షసత్వాన్ని, పేద ప్రజల తిరుగుబాటును, పీడత ప్రజల కష్టాలను, గ్రామీణ సంస్కృతిని, హైదరాబాద్ నగర ప్రాశస్త్యతను, పల్లె సుద్దులు, బుర్రకథలు, భాగవతులను, అడవి బిడ్డల నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ఘట్టాలు సినిమాల్లో ఉండేవి. వరకట్న వ్యతిరేక, స్త్రీలపై జరిగే దౌర్జన్యాలకు వ్యతిరేక, విద్యాలయాలలో జరిగే ర్యాగింగ్‌కు వ్యతిరేక, నిరుద్యోగ సమస్యను ప్రతిబింబించే, రైతు- కార్మికుల కష్టాలను వివరించే, పారిశ్రామిక, పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను ప్రతిబింబించే నాటికలు తర్వాత సినిమాల్లో దర్శనమిచ్చేవి. అత్యంత ప్రజాదరణ పొందిన కళా రూపంగా సినిమా అభివృద్ధి చెందింది. అందుకే దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవులు చైతన్యాన్ని పెంపొందించే గేయ రచన చేసేవారు. మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి వంటి నటులు, దర్శకులు విప్లవాత్మక సినిమాలు తీశారు.

పుష్పకు డబుల్ ప్రమోషన్.. అవసరమా?

కానీ ఇటీవల విడుదలైన సినిమాలు హింస, హీరోయిజం, ప్రేమోన్మాదం ప్రేరణగా ఉండటంతో యువత పెడదారి పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత వివాదాస్పదంగా ఉన్న తెలుగు సినిమాల్లో పుష్ప ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్, ఐటమ్ సాంగ్, పోలీసు, పొలిటీషియన్ల కాంబినేషన్‌తో వచ్చింది. అభిమానుల విపరీత పోకడలతో, డబ్బు దండుకోవడమే ప్రధానంగా బెనిఫిట్ షో ఏర్పాటు చేయడంతో థియేటర్ దగ్గర రసాభాస మొదలైంది. దీనికి తోడు హీరో థియేటర్‌కు వస్తున్నాడనే ప్రచారంతో కిక్కిరిసిన ప్రేక్షకుల ఒత్తిడి పెరిగి తొక్కిసలాట జరిగింది. ఫలితంగా తల్లి మరణించగా, కొడుకు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్నాడు. ఈ అంశాలకు తోడు రాజకీయ పార్టీలు రంగ ప్రవేశం చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఈ ఘర్షణను అసెంబ్లీలో ప్రస్తావించడంతో అనివార్యంగా సినీ ప్రముఖులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. టి.ఫ్.‌డి.సి బాధితులకు రెండు కోట్ల పరిహారం చెల్లించడంతోపాటు, ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటామని ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామన్నాయి.

తెలంగాణ సినిమాపై చర్చే లేదు..

అయితే, ప్రముఖ హీరోల సినిమాల విడుదల సమయంలో తొక్కిసలాట సాధారణమైనా, సంధ్య థియేటర్ ఘటన ప్రాచుర్యం పొందింది. ఎలాంటి సామాజిక ప్రయోజనం లేని పుష్ప-2 సినిమాకు ప్రచారం చేకూరింది. కనీసం ఈ సందర్భంలో కూడా తెలంగాణ సినిమా గురించి చర్చ లేకపోవడం విషాదకరం. తెలంగాణాలోని కవులు - కళాకారులను, దర్శక- నిర్మాతలను, చిన్న సినిమా రంగాన్ని ఆదరించాలి. చిత్రకారులను, చరిత్రకారులను, రచయితలను గౌరవించి తెలంగాణా వైభవాన్ని చాటే కథలను వెలుగులోకి తెచ్చేలా కృషి చేయాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతయినా ప్రాంతీయ సంస్కృతి - సంప్రదాయాలు, వేష -భాష- మాట్లాడే యాస, ఆచార- వ్యవహారాలు,కట్టుబాట్లు, ప్రజల జీవన విధానం, ఉద్యమ చరిత్రలను ప్రతిబింబించే సినిమాలకు ఊతమిస్తే బాగుంటుంది. తెలంగాణ సంస్కృతి, పోరాటలు, చరిత్ర ఇతివత్తంగా సినిమా తెరకెక్కించాల్సిన ఆవశ్యకత నేటి సమాజంపైన ఉన్నది. ఇప్పటికయినా తెలంగాణా పాలకులు ఈ ప్రాంతానికి తమ త్యాగా లతో వన్నె తెచ్చిన వారిని గుర్తించి, ప్రోత్సహించడం ఎంతైనా సముచితమని గుర్తెరగాలి. అప్పుడే తెలంగాణ / తెలుగు సినిమా రంగానికి జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ సృష్టించడం సాధ్యమవుతుంది.

- రమణా చారి

99898 63039

Next Story