గత విమాన ప్రమాదాల నుండి మనమేం నేర్చుకోమా?

by Ravi |   (  Updated:2025-06-20 00:45:22  IST  )

అహ్మదాబాద్‌లో జరిగింది ఒక విమాన ప్రమాదం మాత్రమే కాదు. దేశ విమానయాన వ్యవస్థలో స్థిరపడిన నిర్లక్ష్యపు సంస్కృతి

గత విమాన ప్రమాదాల నుండి మనమేం నేర్చుకోమా?
X

అహ్మదాబాద్‌లో జరిగింది ఒక విమాన ప్రమాదం మాత్రమే కాదు. దేశ విమానయాన వ్యవస్థలో స్థిరపడిన నిర్లక్ష్యపు సంస్కృతి, నిర్వహణ లోపాలకు అసలైన రూపం. ఈ ప్రమాదానికి గల నిర్దిష్ట కారణాల పరిశీలన కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.. అత్యవసర పరి స్థితుల్లో స్పందించాల్సిన విధానాల్లో ఆలస్యం, సాంకేతిక లోపాల గుర్తింపులో అశ్రద్ధ, ఇవన్నీ ఈ ఘటనను మరింత సంక్లిష్టంగా మార్చాయి.

శోకాన్ని పంచుకుంటే సరిపోతుందా?

ప్రతి ప్రమాదానంతరం దర్యాప్తు జరుగుతుంది. నివే దికలు వస్తాయి. కొంతకాలం అందరం కలిసి శోకాన్ని పంచుకుంటాం. కొన్ని పరామర్శలు, కొన్ని పరిహారాలు ప్రకటించబడతాయి. కానీ మూల కారణాలపై శాశ్వత చర్యలు తీసుకున్నట్లు మాత్రం కనిపించదు.. అదే ఇప్పటి ఈ ఘటననూ మరో దుర్ఘటనల క్రమంలో చేర్చింది. విమానాల నిర్వహణలో పారదర్శకత కొరవడటం, ప్రయాణికుల భద్రతకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, పైలట్ల శిక్షణా వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలు తిరిగి తిరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సంస్థల మధ్య సమన్వయ లోపం, విమాన రవాణా రంగంలో ఎక్కువ మందిని కలిపి తీసుకువెళ్లే సామర్థ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య.

ఇంత ఘోరం జరిగినా.. మళ్లీ అదే ప్రశ్న

ఇంతటి ఘోర సంఘటన తర్వాతా కూడా మరలా అదే ప్రశ్న తలెత్తుతోంది. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఏర్పడే దర్యాప్తు కమిటీలు, వాటి నివేదికలు, కాలగతిలో కలిసిపోయి చరిత్రగా మిగిలిపోతున్నాయి. ఇదంతా ఒక వ్యవస్థీకృత నిర్లక్ష్యానికి చిరునామా అంటే అతిశయోక్తి కాబోదు.. ఇంతకుముందు మంగళూరు, కొజికోడ్ ప్రమాదాల దర్యాప్తుల్లో కొన్ని కీలక అంశాలపై నివేదికలు వచ్చినా, అవి అమలైనట్లు గానీ, వాటి ఆధారంగా లోపాలను సరి దిద్దుకున్నట్లుగాని కనిపించకపోవడం బాధాకరం..

రాజీలేని బాధ్యత ఎక్కడ?

భారతదేశం ప్రస్తుతం గగనతల రవాణాలో కూడా గణనీయంగా దూసుకుపోతోంది. రోజూ వేలాది ప్రయాణికులు విమానాలను నమ్ముకొని తమ ప్రాణాలను విమానయాన సంస్థలకు అప్పగిస్తున్నారు.. కనుక వారి భద్రత పట్ల ప్రభుత్వాలకు, సంస్థలకు రాజీలేని బాధ్యత ఉండాలి. ప్రయా ణికుల సంఖ్య పెరగడం అభివృద్ధి సూచిక కావచ్చు. కానీ, వారి రక్షణ, ఆ వేగానికి అనుగుణంగా ATC వ్యవస్థలు, విమానాశ్రయ వేదికలు, పైలట్ల శిక్షణ ప్రమాణాలు, అత్య వసర ప్రతిస్పందన వ్యవస్థలు అభివృద్ధి చెందకపోతే, ఈ అభివృద్ధి విమాన ప్రయాణాన్ని మృత్యు కూపంగా మార్చే ప్రమాదం ఉంటుంది .

భద్రతను గాలికి వదిలేస్తే..

ఈ ప్రమాదం మనకు మళ్లీ ఒక గుణపాఠం నేర్పుతోంది. కానీ గత అనుభవాలతో వ్యవస్థలు గుణపాఠాలను నేర్చుకునే పరిస్థితుల్లో లేవు. బాధ్యతను నెత్తిన వేసుకోవడమే కాదు, వ్యవస్థలో తక్షణ మార్పుకు తెరలేపే సంకల్పం కూడా తీసుకోవాలి. విమానాలు ఆకాశంలో ఎగరాల్సిందే.. కానీ భూమిపై ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేయకూడదు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ సంతాప ప్రకటనలు, పరామర్శలు, పరిహారాలు, కన్నీటి గాథలు, విచారకర వార్తలే కాకుండా, భద్రతాపరమైన విధానాల్లో నిజమైన, నిర్మాణాత్మకమైన మార్పు రావాలి. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వర్తిస్తూ, భద్రతకు కొత్త నిర్వచనాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Next Story