- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ విద్య అభివృద్ధికి ఏమి చేద్దాం.. ?!
దశాబ్దకాలంలో గత ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ఇబ్బడిముబ్బడిగా గురుకులాలను ఏర్పాటు చేసింది.

దశాబ్దకాలంలో గత ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ఇబ్బడిముబ్బడిగా గురుకులాలను ఏర్పాటు చేసింది. అయితే అద్దె భవనాల్లో ఏర్పాటైన ఆ గురుకులాల్లో అరకొర సౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం సాధారణ పాఠశాలల అభివృద్ధిని పక్కనపెట్టి, రాజకీయ లబ్ది ఆశించి, ప్రచారం కోసం కొత్త పాఠశాలలు ప్రారంభిస్తున్నాయి. విద్యాభివృద్ధి అంటే ఉన్న విద్యాసంస్థలను అభివృద్ధి చేసుకోవడం. కానీ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడంతో విద్య అభివృద్ధి కాకపోగా పరోక్షంగా నష్టాన్ని కలిగిస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని పాఠశాల విద్య గత కొన్ని దశాబ్దాలుగా ప్రజల విశ్వాసం పొందలేక, మూతపడుతున్న బడుల సంఖ్య సంవత్సరం వారీగా పెరుగుతూనే ఉంది. మూతబడిన బడులను తెరిపించాలనే ఆలోచన గానీ, ప్రణాళిక గాని ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రజలు కూడా తమ గ్రామంలో దశాబ్దాల క్రితం ప్రారంభించిన బడి మూతబడితే పట్టించుకోని పరిస్థితి ఉంది. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు తమ పిల్లలను గ్రామాల నుండి వాహనాల ద్వారా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు.
అమల్లోకి వచ్చి 75 ఏళ్లయినా..
1948లో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందంపై సంతకం చేసిన 90 దేశాల్లో మన దేశం ఒకటి. ఈ ఒప్పందంలోని 28 వ ఆర్టికల్ అందరికీ విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్తుంది. 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం అందరికీ విద్యను అందిస్తాననే హామీని 45వ ఆర్టికల్ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చింది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయినా దీనిని అమలు చేయలేదు. కోర్టు ఆదేశాల మేరకు 2009 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన విద్యా హక్కు కూడా ఉల్లంఘించబడుతుంది. కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారా అందరికీ ఉచిత విద్య అందించాలి. అందుకు జీడీపీలో ఆరు శాతం నిధులను, కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో 10% నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులను విద్యారంగానికి కేటాయించాలి. కానీ కేటాయించలేదు.
విద్యా కమిషన్ సిఫారసులు..
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం స్థితి గతులను పరిశీలించడానికి విద్యా కమిషన్‌ను నియమించింది.. ఈ కమిషన్ చేసిన సిఫారసులలో మొదటిది ప్రతి మండలంలో ఎంపిక చేసిన 3 ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థుల సంఖ్య 1500-1800 వరకు ఉండాలి. ఇది నర్సరీ నుండి ఇంటర్ స్థాయి వరకు ఉండాలి. ఇందుకు 4-5 ఎకరాల స్థలం అవసరం. బడ్జెట్ 12 కోట్లు. రెండోది ప్రతి మండలంలో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ (TFS) ఏర్పాటు చేయాలి. ఇందులో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, 1,2 తరగతుల వరకు ఉండాలి. ఇందుకు కనీసం ఎకరన్నర స్థలం అవసరం. బడ్జెట్ 3.5 కోట్లు. అంటే దశల వారీగా 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని 632 మండలాల్లో TPS, TFSలు ఏర్పాటుకు అయ్యే ఖర్చు 31,600 కోట్లు. మూడోది డ్వాక్రా గ్రూపు మహిళలకు బస్సులు కొనడానికి రుణాలు ఇచ్చి ఇవే బస్సులను ఈ TPS,TFSలకు విద్యార్థుల రవాణాకు ఉపయోగించాలని సిఫారసులను చేశారు.
ఉపాధ్యాయ శిక్షణ..
రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ శిక్షణా కళా శాలలు నాలుగు, జిల్లా స్థాయిలో డైట్ కళాశాలలు పది ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రొఫెసర్, అధ్యాపక, లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉపాధ్యాయుల శిక్షణ నామ మాత్రమైంది. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాలు మారడంతో ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ శిక్షణా కళా శాలలు పెరిగిపోయాయి. వీటిలో కూడా శిక్షణ నాసిరకంగా ఉండడంతో ఉపాధ్యాయులలో వృత్తి పరమైన నాణ్యత తగ్గిపోయింది. అందుకే శిక్షణా కళాశాలలను పటిష్టం చేయాలి.
ప్రభుత్వ కర్తవ్యాలు..
బాల బాలికలు అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించడానికి పాఠశాల విద్యను పటిష్టమైన ఏకరూప విధానాలతో అమలు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలోని ఖాళీలన్నింటిని శాశ్వత ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసి పటిష్టం చేయాలి. పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేస్తూ అన్ని ప్రభుత్వ/జిల్లా పరిషత్/మండల పరిషత్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ పాఠశాలలు, యాజమాన్యాలలోని గురుకులాలు, మోడల్, కేజీబీవీ పాఠశాలలను విద్యాశాఖ పరిధిలోనే పర్యవేక్షణ జరిగేలా చూడాలి. పాఠ శాలల్లోని ఖాళీ పోస్టులన్నీ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే భర్తీ అయ్యేలా నియామకాలు, పదోన్నతులు, బదిలీలు నిర్వహించే శాశ్వత విధానాన్ని రూపొందించాలి.
బోధనేతర పనులు అప్పగించకుండా..
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించి సంవత్సరకాలం అంతా మార్పులు లేకుండా అమలు చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా బోధన పైననే కేంద్రీ కరించే వాతావరణాన్ని సృష్టించాలి. యాప్‌లతో రిపోర్టులు, సర్వేల బాధ్యత లేకుండా విద్యాపాలన ఉండాలి. పర్యవేక్షణ అధికారులైన ఎంఈఓ, డిప్యూటీ విద్యాధికారులకు కూడా పర్యవేక్షణేతర పనులు ఉండకూడదు. పాఠశాలలన్నింటికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పాఠశాలల అభివృద్ధికి శాశ్వత విధానాన్ని రూపొందించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం నిబంధనల మేరకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఇతర వసతులు ఉండేలా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం ద్వారా వాటిని అదుపు చేయాలి.
- కె. వేణుగోపాల్,
98665 14577






