ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే..?

by Ravi |   (  Updated:2025-05-21 00:45:50  IST  )

రాజకీయ, మతపరమైన లేదా సైద్ధాంతిక లక్ష్యాల కోసం జనాభాను లేదా ప్రభుత్వాన్ని బెదిరించడానికి హింసను సృష్టించడం ఉగ్రవాదం.

ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే..?
X

రాజకీయ, మతపరమైన లేదా సైద్ధాంతిక లక్ష్యాల కోసం జనాభాను లేదా ప్రభుత్వాన్ని బెదిరించడానికి హింసను సృష్టించడం ఉగ్రవాదం. ప్రస్తుతం ఇది మన దేశ భద్రతకు సవాల్ విసురుతోంది. ప్రజల ఆర్థిక, సామాజిక జీవనాన్ని దెబ్బతీస్తూ దేశాభివృద్ధికి విఘాతంగా మారుతుంది. 1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దిననోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ శాంతి కోసం అహింస సందేశాన్ని ప్రజలకు అవగతమయ్యేలా చేయడం, యువత పెడదోవ పట్టకుండా చేయడం వంటివి ఈ దినోత్సవం ముఖ్యోద్దేశాలు.. ఈ రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వేలాదిమంది సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. వారికి నివాళులు అర్పిస్తారు.

ఉగ్రవాద మూలాలను వెతకాలి..

ఇప్పటికే భారతదేశంపై పలుమార్లు ఉగ్రదాడి జరిగింది. చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. కానీ గత కొంతకాలం నుంచి మనదేశం వివిధ దేశాలతో కొనసాగిస్తున్న దౌత్య సంబంధాల నేపథ్యంలో ఉగ్రదాడి తగ్గిన సంగతి తెలిసిందే. కానీ ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 28మంది అమాయక భారతీయులు నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద ముప్పు తొలగిపోయిందన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం మరొకసారి భారతదేశాన్ని భయోందోళనలకు గురి చేసింది. దీనికి భారతదేశం ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతిదాడి చేసినప్పటికీ.. మొత్తం ఉగ్రవాదం నశిస్తే తప్ప మనదేశంపై ఉగ్రవాద దాడులు ఆగవేమో అనే సందేహం కలుగుతుంది. ప్రధానంగా మన దేశ సరిహద్దు దేశాలకు మధ్య ఉన్న రాష్ట్రాలకు ఉగ్రవాదం ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలతో మనకు ప్రమాదం ఉంది. ఉగ్రవాద ప్రభావంపై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) విడుదల గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో భారత్ 14వ స్థానంలో ఉంది. అందుకే భారతదేశం సరిహద్దు దేశాలతో ఉన్న బార్డర్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. ఉగ్రవాదం అంతం చేయడానికి ఆధునిక సాంకేతికను వాడాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై నిఘా పెట్టాలి. ఉగ్రవాద మూలాలను వెతికి ఉగ్రవాదాన్ని అరికట్టాలి.

అంతర్గత సమస్యలను పరిష్కరించాలి!

మరోవైపు భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి చాప కింద నీరులా కొనసాగుతున్న సామాజిక వివక్ష వలన అంతర్గత సంఘర్షణలు పెరుగుతున్నాయి. దీంతో వామపక్ష తీవ్రవాదం పెరిగిపోయింది. అలాగే కులం పేరుతో విభజించి అవకాశాలు అందకుండా చేస్తే వారు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కొన్ని వర్గాల వారికే అందించకుండా అందరికీ అవకాశం కల్పించాలి. ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల భారతదేశంలో అంతర్గత, బహిర్గత ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం. దేశంలోని అంతర్గత కలహాలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు ప్రధాన కారణాలు అన్వేషించి పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉన్నాయి. అలాగే బహిర్గత ఉగ్రవాదాన్ని నిలువరించాలంటే ప్రపంచ దేశాలతో స్నేహపూరిత దౌత్య సంబంధాలను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మతోన్మాదాన్ని నివారించాలి. కులం పేరుతో కొనసాగుతున్న అణచివేతను తగ్గించాలి.

(నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం)

ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే..?

79895 79428

Next Story