పెద్దలపై.. పిల్లలు తిరగబడుతున్నారంటే కారణం ఏంటి?

by Ravi |   (  Updated:2025-10-22 01:00:27  IST  )

ప్రపంచం నలుమూలలా వినిపించిన ఘాటైన ప్రశ్న... నేటి బాల్యం కేవలం గౌరవాన్ని కోల్పోలేదని, సరైన మార్గదర్శకత్వం కోరుతోందని నిరూపించింది.

పెద్దలపై.. పిల్లలు తిరగబడుతున్నారంటే కారణం ఏంటి?
X

ప్రపంచం నలుమూలలా వినిపించిన ఘాటైన ప్రశ్న... నేటి బాల్యం కేవలం గౌరవాన్ని కోల్పోలేదని, సరైన మార్గదర్శకత్వం కోరుతోందని నిరూపించింది. పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చిన ఒక చిన్నారి గ్రేటా ధన్‌బర్గ్, ప్రపంచ నాయకుల వేదికపై నిలబడి ‘మీరు నా బాల్యాన్ని, కలలను దొంగిలించారు’ అని నిందించడం, మన పెద్దల బాధ్యతారాహిత్యంపై చేసిన యుద్ధ ప్రకటనగా భావించవచ్చు.

ప్రేమను, మార్గదర్శకత్వాన్ని పిల్లల ఆయుధాలుగా మార్చేటువంటి ఉత్తేజకరమైన పెంపకమే మన పిల్లలను రేపటి ఉత్తమ నాయకులుగా ఎదిగిస్తుంది.

తిరగబడటం కూడా తప్పేనా?

నిజానికి, కొత్తతరాలను ఇలా 'నిందించే వైఖరి' క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల క్రితం నాటి గ్రీక్ కవి హెసియడ్ రచనల నుండే ఉంది. ఆయన కాలం నుండి సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి మహనీయుల వరకు, ప్రతి తరం పెద్దలూ యువతపై వినయం లేదనే నింద మోపుతూనే వచ్చారు. అయితే ఈ తరం పిల్లలు తిరగబడటం వెనుక, కేవలం క్రమశిక్షణ లేకపోవడం అనే సాకు మాత్రమే లేదు. మన పెంపక విధానాలలో, బాలల హక్కుల గురించి ఉన్న అవగాహన లోపమే ప్రధాన హేతువు. అసలు సమస్య పెద్ద తరంలో పెట్టుకుని పిల్లలపైనే నిందలు వేస్తే ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి.

పెద్దల అధికారాన్ని ఆనాడే ప్రశ్నించారు..

పిల్లల తిరుగుబాటకు సంబంధించి చరిత్ర చెబుతున్న సాక్ష్యం కూడా పరిశీలిద్దాం. ప్రాచీన గ్రీకు మేధావుల విశ్లేషణలను ఆధునిక న్యాయ శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. సోక్రటీస్ కాలంలో పెద్దల అధికారాన్ని ప్రశ్నించడం మొదలైతే, నేడు మన పిల్లలు తమ న్యాయపరమైన హక్కుల గురించి నిలదీస్తున్నారు. అరిస్టాటిల్ తన 'నీతి శాస్త్రం'లో యువతలో అస్థిరత్వం ఉంటుందని చెప్పినట్లే, మనమూ వారిని అస్థిరంగా చూడకుండా, స్థిరమైన దారిని చూపించాలి. ఇక్కడే న్యాయపరమైన అంశం కీలకం. మన దేశ రాజ్యాంగం ప్రకారం, ప్రతి బిడ్డకు గౌరవంతో జీవించే హక్కు ఉంది. శిక్ష ద్వారా వారిలో భయాన్ని పెంచడం అనేది బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం తీవ్ర ఉల్లంఘన అవుతుంది. శారీరక దండన అనేది గౌరవాన్ని నేర్పదు. అది కేవలం హింసను ప్రేరేపిస్తుంది.

సమస్యకు మూలం మన పెంపకం తీరే..

పిల్లలలో అహంకారం, మొరటుతనం పెరగడానికి కారణాలు మన పెద్దల తప్పు ఆలోచనలు, తప్పు పెంపక శైలులే. నేడు చాలా కుటుంబాలలో ఒకే బిడ్డపై అధిక దృష్టి కేంద్రీకృతమై, నియమాలు లేకపోవడం వలన, పిల్లలు తమ కోరికలను సాధించాల్సిన లక్ష్యాలుగా పెద్దలు భావిస్తున్నారు. దీని ఫలితంగా, తమకు 'అన్నీ లభించాల్సిందే' అనే ప్రమాదకరమైన ఆలోచనకు పిల్లలు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు ఆర్థిక ఒత్తిడిలో మునిగి, పిల్లల మానసిక, భావోద్వేగ అవసరాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యపూరితమైన పెంపకం కిందకు వస్తుంది. ఇది బాలల భద్రత, మానసిక ఆరోగ్య హక్కులను ఉల్లంఘిస్తుంది. మనం మన పిల్లలను సామాజిక నిబంధనలకు భయపడేలా కాకుండా, బాధ్యతాయుతమైన నిర్ణయా లు తీసుకునేలా వారిని ప్రేరేపించాలి.

ఒక్కటే మార్గం...

పిల్లలలో అహంకారాన్ని తగ్గించి, వినయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉన్న ఏకైక న్యాయబద్ధమైన, ఉత్తమ మార్గం అధికారిక పెంపకమే. (నియంత్రణతో కూడిన వాత్సల్యం). ఇది పెంపక శైలులలోని ఉత్తమమైన సమతుల్యత. తల్లిదండ్రులు తమ పిల్లలతో అపారమైన ప్రేమ, ఆప్యాయత ప్రదర్శిస్తూనే, వారికి స్పష్టమైన నిబంధనలు చూపించాలి. తప్పు చేస్తే దాని ఫలితం ఏమిటో తార్కికంగా, సానుభూతితో వివరించాలి. శిక్షించడం కన్నా, పర్యవసానం ఎలా ఉంటుందన్నది నేర్పించడం ముఖ్యం. ఈ సమతుల్య పెంపకం ద్వారా పెరిగే పిల్లలు ఉన్నతమైన స్వీయ-నియంత్రణ, సామాజిక నైపుణ్యాలు, నిజమైన వినయాన్ని పెంపొందించుకుని, బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారు.

మార్పు మనతోనే మొదలవ్వాలి!

మన పిల్లల భవిష్యత్తును దొంగిలించే నాయకులుగా, కుటుంబ పెద్దలుగా మనం ఉండకూడదు. పెంపకంలో న్యాయబద్ధతను, గౌరవాన్ని అమలు చేయాలి. శిక్షను ఆయుధంగా ఉపయోగించడం ఆపి, ప్రేమను, మార్గదర్శ కత్వాన్ని వారి ఆయుధాలుగా మలచాలి. మన పెంపకం కేవలం విధేయతను మాత్రమే కాకుండా, సమస్యలను పరిష్కరించే, సమాజాన్ని మార్చే శక్తిని వారికి అందించాలి. ఈ ఉత్తేజిత పెంపకానికి చెందిన విప్లవం ద్వారానే, మన పిల్లలు రేపటి ప్రపంచానికి బాధ్యతాయుతమైన, వినయం కలిగిన నాయకులుగా ఎదగగలుగుతారు. మార్పు మన నుండే ఆరంభం కావాలి!

-ఫిరోజ్ ఖాన్,

96404 66464

Next Story