ప్రధాని మోడీ పొదుపు విజ్ఞప్తి వెనుక అసలు కారణం ఏమిటి?

by Ravi |   (  Updated:2026-05-15 02:38:45  IST  )

ప్రధాని మోడీ దేశ ప్రజలకు చేసిన పొదుపు విజ్ఞప్తి వెనుక ఉన్న ఆర్థిక కారణాలు ఏమిటి? డాలర్ నిల్వలు, బంగారం దిగుమతులు, రూపాయి విలువపై ప్రభావం వంటి అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసం

ప్రధాని మోడీ పొదుపు విజ్ఞప్తి వెనుక అసలు కారణం ఏమిటి?
X

‘‘ఏ కార్యక్రమం అయినా బంగారం కొనకండి. ఏడాది పాటు విదేశీ పర్యాటక యాత్రలు వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లండి. వంటనూనెలలు సైతం తక్కువగా వాడండి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తితో దేశ ప్రజలు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ప్రజలకు ఈ తరహా హెచ్చరిక కొత్త కావడంతో ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ఆందోళన పడుతున్నారు..

కరోనా సమయంలో మోడీ టీవీ ముందుకు వచ్చారంటేనే చాలు హడలిపోయేవారు.. ఇప్పుడు కూడా కాస్తో కూస్తో అలాంటి ఫీలింగే కలిగింది. అసలు ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి ఈ పొదుపు మంత్రం వెనుక ఉన్న మర్మం ఏంటి ఎన్నికలు అయ్యాకే ప్రకటించడం వెనుక అర్థం ఏమిటి ఈ అంశాలపై క్షుణ్ణంగా చర్చిద్దాం..

డిమాండ్ తగ్గితేనే.. డాలర్‌ నియంత్రణ

గడిచిన కొద్ది కాలంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వరకు అన్నీ కూడా ప్రపంచ సరఫరా గొలుసును అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటనూనెల వాడకం తగ్గించాలని.. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరుతోందంటే.. దాని వెనుక ఉన్న ప్రధాన శత్రువు ‘కరెన్సీ విలువ పతనం’ తో పాటు ‘విదేశీ మారక ద్రవ్య నిల్వల’ రక్షణ అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక దేశం విదేశాల నుంచి ఏదైనా వస్తువును కొనాలన్నా లేదా విదేశాలకు వెళ్లి ఖర్చు చేయాలన్నా అది డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎంత ఎక్కువ పెట్రోల్ వాడితే, ఎన్ని ఎక్కువ లీటర్ల వంటనూనెను దిగుమతి చేసుకుంటే, ఎంత ఎక్కువగా విదేశాల్లో డాలర్లు ఖర్చు చేస్తే.. మన దేశం దగ్గర ఉన్న డాలర్ల నిల్వలు అంతగా తగ్గిపోతాయి. డాలర్లు తగ్గే కొద్దీ అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడితే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ ద్రవ్యోల్బణ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికే, ప్రజల భాగస్వామ్యంతో ‘డిమాండ్’ ను తగ్గించి, తద్వారా దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహాన్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, మోడీ వ్యాఖ్యలు దేశ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని సూచిస్తాయని.. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్తారని ఇది దేశానికి తీవ్ర నష్టమన్న వాదనలు కూడా వస్తున్నాయి.

బంగారం.. దేశానికి భారమే!

బంగారం కొనుగోళ్లపై ప్రధాని చేసిన విజ్ఞప్తి వెనుక ఒక బలమైన ఆర్థిక వ్యూహం ఉంది. భారతీయులకు బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, అదొక సెంటిమెంట్, భద్రత. కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే బంగారం ఒక ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’. మనం కొనే ప్రతి గ్రాము బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల మన విదేశీ మారక ద్రవ్యం భారీగా తరలిపోతుంది. ఆ బంగారం బీరువాల్లో లాక్ అయి ఉంటుంది తప్ప, అది దేశ ఉత్పత్తి రంగంలోకి గానీ, మౌలిక సదుపాయాల కల్పనలోకి గానీ రాదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయంలో, ప్రజలు తమ నగదును నిరుపయోగంగా ఉండే బంగారంపై కాకుండా, దేశీయ పొదుపు పథకాల్లో లేదా మార్కెట్లో పెట్టుబడిగా పెడితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.

ఇది భయపెట్టడమే.. రఘురామ్ రాజన్

‘బంగారం కొనుగోళ్లు.. విదేశీ ప్రయాణాలను నియంత్రించడం వంటి అంశాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా నిశ్శబ్దంగా, మార్కెట్ శైలిలో నిర్వహించాలి. ప్రధాని స్థాయి వ్యక్తి నేరుగా ప్రజలకు పిలుపునివ్వడం వల్ల మార్కెట్లలో అనవసరమైన ఆందోళన మొదలవుతుంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉంది’ అని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఆయన వాదన ప్రకారం.. ప్రభుత్వం ఇలా నేరుగా ప్రజలను కోరడం అంటే ‘దేశం దగ్గర డాలర్లు అయిపోతున్నాయి’ అనే భ్రమను కలిగించే అవకాశం ఉన్నది. ఇది 2013 నాటి రూపాయి సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నదని అభిప్రాయపడ్డారు.

ముందు జాగ్రత్తలు అవసరమే.. వీకే విజయకుమార్

ముందస్తు జాగ్రత్తలు ఏ దేశానికైనా మంచిదేనని మోడీ కామెంట్ల నేపథ్యంలో జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ స్పందించారు. ‘ప్రస్తుతం పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లోటును (సీఏడీ) మేనేజ్ చేయడానికి ప్రధానమంత్రి చేసిన ఈ పిలుపు ఒక క్రైసిస్ మేనేజ్‌మెంట్ చర్యగా కనిపిస్తున్నది. ఇది స్వల్పకాలంలో వృద్ధిపై స్వల్ప ప్రభావం చూపినప్పటికీ.. రూపాయి విలువ మరింతగా పడిపోకుండా కాపాడటానికి ఇది అత్యవసరం’ అని పేర్కొన్నారు. ఈ విశ్లేషణ ప్రకారం, చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరువవుతున్న తరుణంలో, పెట్రోల్.. బంగారం వాడకాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం దేశానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర విషయం కానున్నది.

ఎన్నికలు ముగిసాకే చెప్పాలా?

ఇరాన్ యుద్ధం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ప్రభుత్వానికి ముందుగానే అంచనా ఉన్నదని.. అయినా, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను అప్రమత్తం చేయలేదన్న వాదనలు వస్తున్నాయి. వాటికి ఆధారంగా.. ఎన్నికలు ముగిసిన తర్వాత బెంగాల్ బయట జరిగిన తొలి సభలోనే మోడీ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వండని ప్రజలను వేడుకోవడం హెచ్చరికలు చేయడం ఫక్తు రాజకీయ లబ్ధి కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రజలు అడగకున్నా ఇస్తున్న ఉచిత పథకాలు రద్దు చేస్తే.. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమే ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story