- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి భరోసా ఏది?
ఏ రాష్ట్రమైన, ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే అత్యున్నత విలువ లతో కూడిన ప్రాంతంగా విలసిల్లాలంటే, ఆ ప్రాంతంలోని ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చారిత్రక సత్యం, అయితే మన రాష్ట్రంలోని ఉన్నత విద్యను పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్నత విద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఏ రాష్ట్రమైన, ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే అత్యున్నత విలువ లతో కూడిన ప్రాంతంగా విలసిల్లాలంటే, ఆ ప్రాంతంలోని ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చారిత్రక సత్యం, అయితే మన రాష్ట్రంలోని ఉన్నత విద్యను పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్నత విద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త యూనివర్సిటీలు, కొత్త కోర్సులు, న్యాక్ ర్యాంకింగ్స్, డిజిటలైజేషన్, పరిశోధనలపై దృష్టి.. ఇలా ప్రభుత్వాలు తరచూ ఉన్నత విద్య అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి. ఆ మాటలు ఆచరణలో సాధ్యం కావడానికి విద్యాభివృద్ధిలో నిత్యం వెనుక నుండి పనిచేస్తూ వ్యవస్థను నడిపించే నాన్ టీచింగ్ సిబ్బంది పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారయ్యింది.
బోధనేతర సిబ్బంది బతకొద్దా?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 యూనివర్సిటీల్లో, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు, తెలుగు యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ, ఆచార్య ఎన్.జి. రంగా యూనివర్సిటీ, కాళోజి అగ్రికల్చరల్ యూనివర్సిటీ మొదలగు వాటిల్లో సుమారు 5 నుండి 6వేల మంది పై చిలుకు బోధనేతర సిబ్బంది నాన్‌టీచింగ్(అవుట్‌సోర్సింగ్) ఉద్యోగులు పనిచే స్తున్నారు. వీరిలో చాలా మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్ విధానంలో పనిచేస్తున్నారు. యూనివర్సిటీ పరిపాలన, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సర్టిఫికెట్లు, లైబ్రరీలు, ల్యాబ్‌లు, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక విభాగాలన్నింటినీ నడిపిస్తున్నవారు వీరే. అయినా సరే, వీరి జీవన భద్రతపై ప్రభుత్వానికి ఎందుకు శ్రద్ధ లేదు?
ఏడేళ్లుగా వేతనాలు పెరగలే..
గత ఏడేళ్లుగా వీరి వేతనాల్లో ఎలాంటి గణనీయమైన సవరణ లేదు. చాలాచోట్ల సకాలంలో జీతాలు కూడా అందడం లేదు. ఒకవైపు ధరలు పెరుగుతుంటే, మరోవైపు స్థిర ఆదాయం లేక కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వహించాలన్నది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. యూనివర్సిటీల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా, వారికి లభించే ప్రయో జనాలు మాత్రం నాన్‌టీచింగ్ సిబ్బందికి దక్కడం లేదు. ‘సమాన పనికి సమాన వేతనం’ అన్న సూత్రం వీరి విషయంలో ఎందుకు అమలు కావడం లేదు?
విద్యలో నాణ్యత ఎలా?
ప్రభుత్వం తరచూ విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచాలంటూ ప్రక టనలు చేస్తోంది. న్యాక్ ర్యాంకులు మెరుగుపడాలంటే అకడమిక్ స్టాఫ్‌తో పాటు పరిపాలనా వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. కానీ ఆ వ్యవస్థను నడిపించే సిబ్బందే అసంతృప్తితో ఉంటే, నాణ్యత ఎలా పెరుగుతుంది? ఉద్యోగ భద్రత లేని సిబ్బందితో సమర్థవంతమైన పరిపాలన సాధ్యమా ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెప్పుకునే గొప్పలు ఎండమావులు కాక ఏమవుతావుతాయి? నాన్‌టీచింగ్ సిబ్బంది డిమాండ్లు కొత్తవేమీ కాదు. రెగ్యులరైజేషన్, వేతన సవరణ, సామాజిక భద్రత, ప్రమోషన్లు వంటి అంశాలు ఎన్నో ఎండ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం మారినా, హామీలు ఇచ్చినా, ఫైళ్లు కదలడం లేదు. ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమా? లేక ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడమా?
పాలనావిభాగంపైనే చిన్న చూపా?
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొవాల్సిన సమయం ఆసన్నమైంది. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బందికి న్యాయం చేయకుండా ఉన్నత విద్య అభివృద్ధి గురించి మాట్లాడటం నిష్ప్ర యోజనం. కేవలం మాటలకే పరిమితం కాకుండా, వాస్తవిక పరిస్థితులు అర్ధం చేసుకొని ప్రభుత్వం, బోధనేతర సిబ్బంది పడుతున్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో ఉన్న అన్నిరకాల బోధనేతర సిబ్బందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలబడాలని ఆశపడుతున్నారు..
-డి.సంధ్య
శాతవాహన యూనివర్సిటీ
95530 75440






