మండలి ఎన్నికల్లో ఓటర్ల కర్తవ్యం ఏమిటి?

by Ravi |   (  Updated:2025-02-23 01:15:46  IST  )

ప్రస్తుతం విధాన నిర్ణయాలన్నీ ఏకపక్షంగా, విద్యా వ్యవస్థ సంక్షేమానికి విఘాతం కలిగేలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్

మండలి ఎన్నికల్లో ఓటర్ల కర్తవ్యం ఏమిటి?
X

ప్రస్తుతం విధాన నిర్ణయాలన్నీ ఏకపక్షంగా, విద్యా వ్యవస్థ సంక్షేమానికి విఘాతం కలిగేలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ద్వారా ఒరిగేది ఏమీ లేదనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర శాసనమండలికి ఎన్నికలు ఈ నెల 27న జరుగుతున్నాయి.. ఈ ఎన్నికల్లో ఎన్నికైన వీరు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అణిగిమణిగి ఉండే ఎమ్మెల్సీలు కాకుండా నిష్పక్షపాతంగా విద్యావ్యవస్ధ బాగుకు గొంతెత్తే ఎమ్మెల్సీలు కావాలి. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు - ఏ పాటి వాడో చూడు - ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు - ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు - పెట్టుకునే టోపీ కాదు - పెట్టిన టోపీ చూడు.... అన్న కాళోజీ మాటలను ఓటేసే ముందు గుర్తు చేసుకుందాం.

శాసనమండలిని పెద్దల సభ అని కూడా అంటారు. ఈ ఎన్నికలకు సాధారణ ఎన్నికల వలె కాకుండా ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాల శాసనసభల ఆమోదం పొందితే ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి అనుమతితో శాసన మండలిని ఏర్పాటు చేయవచ్చు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952లో మొదట శాసన మండలి ఏర్పడింది. ఆ తర్వాత 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ శాసన మండలి ఏర్పాటు సంప్రదాయాన్ని కొనసాగించారు. దీనిని 1985లో నాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో పునరుద్ధరించింది. అప్పటి నుండి నేటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా శాసనమండలి కొనసాగుతోంది.

పెద్దల సభపై గురుతర బాధ్యత!

పెద్దల సభకు ఎన్నికయ్యే పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం సభ్యుల పైన ఒక గురుతర బాధ్యతను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అదేమిటంటే ఎంత మంచి ప్రభుత్వమైనా నిర్ణయాలను చేస్తున్నప్పుడు తన రాజకీయ ప్రయోజనాలను కూడా చూసుకుంటూ ఉంటుంది. అందువల్ల సహజంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవ కాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో పెద్దల సభ జోక్యం చేసుకుని అటువంటి నిర్ణయాలను మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు సహజంగానే ఈ పని చేయలేరు. అందువల్ల ఈ పెద్దల సభకు ఎన్నికయ్యే వారు రాజకీయాలకు అతీతంగా, ప్రజల పక్షాన నికరంగా నిలబడి, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించి, సరి చేయగలిగే స్థాయి కలిగి ఉండాలి. అటువంటి అనుభవం, తెగువ, దార్శనికత ప్రదర్శించేవారు ఈ సభకు ఎన్నికైతే అది పెద్దల సభకు గౌరవం దక్కించినట్లు లెక్క.

సమస్యలపై నోరెత్తనివారు పోటీలో...

ఈ నేపథ్యంలో సమకాలీన సమాజంలో విద్యారంగ, ఉపాధ్యాయ, ఉద్యోగ, అధ్యాపక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం మండలికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలుసా? ఆ విధానాలు మారకుండా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరేనా? విద్యారంగ సంబంధ మౌలిక సమస్యలపై అవగాహన లేనివారు కూడా అర్థ బలం, రాజకీయ అండతో ఓటర్ల బలహీనతలను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. విద్యారంగానికి సంబంధించిన మౌలిక అంశాలపై ఏనాడూ నోరెత్తని వారు రంగంలోనికి వస్తున్నారు. ఇక కొఠారి కమిషన్ నుండి జాతీయ విద్యా విధానం-2020 వరకు, విద్యకు ఆరు శాతం నిధులివ్వాలని చేసిన ప్రతిపాదన ఇప్పటికీ నెరవేరలేదు. కేంద్ర బడ్జెట్‌లో విద్యకు 128,650 కోట్ల కేటాయింపు గత బడ్జెట్ కంటే 6.2 శాతం అధికమని చెప్పుకోవడానికి సరిపోతుంది. కానీ, అది జీడీపీలో 0.41 శాతమే. అలాగే 19,000 కోట్ల నుండి 21,000 కోట్లకు తెలంగాణ రాష్ట్ర విద్యా బడ్జెట్ పెరిగినట్టు కనబడినా అది మొత్తం బడ్జెట్ లో 7.3 శాతం, జీడిపీ పరంగా 1.29 శాతం మాత్రమే. అధికార పార్టీ ఎన్నికల ప్రణాళికలో 15 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయిస్తానని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు.

నిధుల తగ్గింపుపై మాట్లాడరేం?

ఈ పరిస్థితుల్లో తను ప్రాతినిధ్యం వహించే పార్టీ పదేళ్లుగా విద్యారంగానికి నిధులు తగ్గిస్తున్నప్పటికీ కిమ్మనని వ్యక్తి రాష్ట్రంలో విద్యారంగానికి కేటాయిం చే బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరం! ఎమ్మెల్సీగా గెలిపిస్తే పీఆర్‌సీ, డిఏల కోసం కొట్లాడుతా, గురుకుల టీచర్ల సమస్యలు తీర్చే బాధ్యత నాదే, కేజీబీవీ టీచర్లకు రెగ్యులర్ స్కేల్ ఇప్పిస్తా, టీచర్ల సమస్యలన్నీ తనకు తెలుసంటూ, సమస్యలకు సరైన బడ్జెట్ లేకపోవడమే కారణమని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు చాలినంత చేయకుండా విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెప్పే కార్పొరేట్ అభ్యర్థులు, ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు, కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు వారి వారి సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యల గురించి, హక్కుల గురించి మాట్లాడని వారు, వారి హక్కులను అణిచి వేసిన వారు, వారికి ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి, శ్రమదోపిడి చేస్తున్న వారు కూడా దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా సమస్యల పరిష్కారం చేస్తామని వస్తున్నారు.

టీచర్ ఎమ్మెల్సీల పాత్ర కీలకం

విద్యా విధాన నిర్ణయాల్లో టీచర్ ఎమ్మెల్సీల పాత్ర కీలకమైనది. విద్యావ్యవస్ధ‌కు సంబంధించిన నాయకుల అభిప్రాయాలను పరిగణిస్తూ వారి సహకారంతో జరిగే విధాన నిర్ణయాల సార్థకత చాలా బాగుంటుంది. 1984కు ముందు ఉద్యమ అభ్యర్థులుగా గెలిచి వచ్చిన ఎమ్మెల్సీలు సందర్భంగా సమైక్య ఉపాధ్యాయ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచే వారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కొరకు ప్రతి పక్షాలు అధికంగార పక్షంలోని ప్రజాస్వామ్య సహకారాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు. అధికార పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారు కాదు. తిరిగి ఆ పరిస్థితులు రావాలంటే ఉద్యమ స్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధత, పార్టీల కండువాలు కప్పుకోకుండా తనను ఎంపిక చేసిన వర్గాల ప్రయోజనాల కోసమే పాటుపడే త్యాగనిరతి గల అభ్యర్థులను గెలిపించి, శాసనమండలికి పంపాలి.

అయితే, ప్రస్తుతం విధాన నిర్ణయాలన్నీ ఏకపక్షంగా, విద్యా వ్యవస్థ సంక్షేమానికి విఘాతం కలిగేలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ద్వారా ఒరిగేది ఏమీ లేదనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అణిగిమణిగి ఉండే ఎమ్మెల్సీలు కాకుండా నిష్పక్షపాతంగా విద్యావ్యవస్థ బాగుకు గొంతెత్తే ఎమ్మెల్సీలు కావాలి.

-కె. వేణుగోపాల్,

పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్,

98665 14577

Next Story