- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితేనేం..? ఆదాయ అసమానతలు ఉన్నప్పుడు
జీడీపీ, తలసరి ఆదాయ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలుస్తాయి తప్ప సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని

జీడీపీ, తలసరి ఆదాయ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలుస్తాయి తప్ప సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని, మానవాభి వృద్ధిని కొలవవు.. అవి ఆర్థిక వ్యవస్థ చేసే ఉత్పత్తుల గురించి చెబుతాయే తప్ప వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతారని కీలక విషయాన్ని పట్టించుకోవు.. జీడీపీ పరంగా భారత్ మరో మైలురాయిని చేరుకోవడం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం నిస్సందేహంగా గుర్తించదగ్గ విజయమే.. కానీ పెరిగిన జీడీపీని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం ఎంతో తెలుసా?
ఈ తలసరి ఆదాయాన్ని అందరూ సమానంగా ఎలా పొందుతారు? పరిమాణంలో ఆర్థిక వ్యవస్థ పెద్దదైనప్పటికీ 127 దేశాలతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచికలో భారత స్థానం దిగువనే 105వ స్థానంలో ఉంది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లలు దాదాపు 35 శాతం పైగా ఎదుగుదల లోపంతో బాధపడు తున్నారు. అప్పుడు యంగ్ ఇండియా పరిస్థితి ఏమిటి?
పడిపోయిన వ్యవసాయం వాటా..
ప్రస్తుతం 19 కోట్లకు పైగా భారతీయుల్లో పోషక ఆహార లోపం ఉంది. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి కూడా చాలా మటుకు పట్టణ సేవా రంగం ఆధారితమైంది. 45 శాతం మంది భారతీయులకు వ్యవసాయం ఉపాధి కనిపిస్తున్నప్పటికీ జీడీపీలో వ్యవసాయ రంగ వాటా కేవలం 15 శాతమే.. అందువలన వ్యవసాయదారుల ఆదాయాలు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. 55 శాతం రైతు కుటుంబాలు అప్పుల బాధతో ఉన్నాయని 2021-22లో నాబార్డ్ తెలియజేసింది.
పేదరికం లెక్కలు.. సరైనవేనా?
ఇటీవల 2023-24లో తెలియజేసిన గృహ వినియోగ సర్వే ప్రకారం దేశంలో దిగువన ఉన్న 10 శాతం జనాభా దినసరి వ్యయం ఒక వ్యక్తి చేసేది 50-100 రూపాయల మధ్యలో ఉంది. దేశంలో 10 శాతం జనాభా అంటే 14 కోట్ల మంది. ఇలా 10 శాతం జనాభాకు 100 రూపాయల లోపే దినసరి వేతనం ఉంది. విద్యా, వైద్య, ఆహార, గృహ వసతులు ఏ మాత్రం పొందలేరని తెలుస్తున్నది. ఇలా 10 శాతం జనాభా కడు పేదరికంలో ఉంటే నీతి అయోగ్ ప్రకారం పేదరికం దేశంలో ఐదు శాతం మాత్రమే ఉన్నదని చెప్పడం ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సూచికను పరిగణనలోకి తీసు కుంటే 195 దేశాలలో భారత్ 66వ స్థానంలో ఉంది. దేశంలో ఆరోగ్య సదుపాయాల రీత్యా 167 దేశాలలో మన దేశం స్థానం 111. ఫిట్నెస్ రిపోర్ట్ ప్రకారం 167 దేశాల్లో 112 స్థానం మనది. మన జనాభాలో 44 శాతం మాత్రమే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు.
ఆదాయ అసమానతలు జాస్తి!
వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ప్రకారం గత పాతికేళ్లలో ఆదాయ అసమానతలు పెరుగుతూ వచ్చాయి. 40 శాతం దేశ సంపద ఒక శాతం దేశ కుబేరుల స్వాధీనంలో ఉంది. దిగువ 50 శాతం ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం మూడు శాతం మాత్రమే. గ్రామీణ పేదలు అసంఘటిత కార్మికులు దేశంలో అల్లాడిపోతుంటే జీడీపీ వృత్తిరీత్యా దేశం మెరిసిపోతుందని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతున్నదని పాలకులు ప్రగల్భాలు పలకటం ఎందుకు? సామాజిక న్యాయం లేని ఆర్థిక అభివృద్ధి వలన ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే ఏమి, ఎవరికి లాభం?
యువత శాతం వరమే కానీ..
భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.4 శాతం మాత్రమే ఉన్నా జనాభా పరంగా మాత్రం అధికంగా 17.5 శాతం ఉన్నందునే నిరుద్యోగం పేదరికం ఉన్నాయని కొందరి వాదన. అయితే మన జనాభా ఆర్థిక వ్యవస్థకు నిధిగా ఉన్నది. దేశంలో 68 శాతం జనాభాకు 15 నుండి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్నందున, శ్రామిక శక్తి ఎక్కువగా ఉన్న దేశం కూడా మనదే.. 142 కోట్ల జనాభాలో 54% కంటే ఎక్కువమంది 25 సంవత్సరాల లోపల వారే. కేవలం ఏడు శాతం జనాభా మాత్రమే 65 సంవత్సరాల పైబడిన వారు.. మన జనాభా ఎక్కువ శ్రామిక శక్తి కలిగి ఉన్నందువల్ల వారికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే నిరుద్యోగిత, పేదరికం, ఆదాయ అసమానతలు ఉండవు..
నాలుగవ ఆర్థిక వ్యవస్థ ఎవరిది?
ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేక సుమారు 35.42 మిలియన్ల మంది విదేశాల్లో రకరకాల పనులు చేసుకుంటున్నారు. యూఏఈలో 35.54 లక్షల మంది సౌదీ అరేబియాలో 22.19 లక్షలు కువైట్‌లో 8.29 లక్షల మంది ఖతార్‌లో ఎనిమిది లక్షల మంది ఒమెన్‌లో 5.3 లక్షల మంది కార్మికులు గా ఆ దేశాల అభివృద్ధికి సహాయపడుతున్నారు. అమెరికాలో ఐదు మిలియన్ భారతీయులు ఆ దేశ జనాభాలో 1.5 శాతం గా ఉన్నారు.. మన వారు కట్టే పన్నులు అమెరికా పన్నుల ఆదాయంలో ఐదు శాతంగా ఉన్నాయి. అక్కడ పనిచేసే డాక్టర్ల లో 10 శాతం మనవారే.. అక్కడ 70 శాతం వివిధ కళా శాలలో ఉన్నత అధ్యాపకులు మనవారే.. 60 శాతం వరకు హోటల్స్ నడుపుతుంది మనవారే.. మనదేశంలో ఉపాధి అవకాశాలు లేకనే కదా. మానవ వనరులు విదేశాలకు ఉపయోగ పడుతుంటే ఈ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరిది?
డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
anugondanaidu @yaho.co.in






