ఉన్నది ఉన్నట్టు: ఏది ఉచితం ఏది సంక్షేమం?మోదీ వాఖ్య వెనుక మర్మమేమిటి?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: ఏది ఉచితం ఏది సంక్షేమం?మోదీ వాఖ్య వెనుక మర్మమేమిటి?
X

ప్రపంచంలో చోటు చేసుకున్న అనేక తిరుగుబాట్లకు ఆర్థిక అసమానతలే కారణం. ధనికుల సంపద పోగుపడుతూ ఉన్నది. పేదలు కడు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. అభివృద్ధికి దూరమవుతున్నామనే భావన పెరుగుతున్నది. చెమట, నెత్తురు నుంచి సృష్టించిన సమాజ సంపదలో వారి వాటాగా అందుకోవడం పేదల హక్కు. శ్రమకు తగిన ఫలితం, పంటలు పండించిన కష్టానికి దక్కని గిట్టుబాటు ధర.. ఇలాంటివి కొనసాగినంతకాలం సంక్షేమాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. 'ఉచితం' పేరుతో కోతలు పెట్టడం సంక్షేమ బాధ్యత నుంచి తప్పుకోవడమే. పేదలకు పనిచేయకుండానే ఊరికే వస్తున్నాయనేది అసంబద్ధ లాజిక్.

బ్బులు ఎవరికీ ఊరికే రావు' ఈ స్టేట్‌మెంట్ తెలుగు ప్రజలకు చిరపరిచితం. ఒక జువెల్లరీ దుకాణం యజమాని టీవీ యాడ్‌లలో చెప్పిన ఈ మాటలు గుర్తుండే ఉంటాయి. ప్రభుత్వానికి కూడా డబ్బులు ఊరికే రావు. పాలకుల జేబులలో పుడుతున్నవీ కావు. ప్రజలు పన్నులు, సెస్‌ల రూపంలో కడుతున్నవే. ప్రధాని మోడీ ఇటీవల 'ఉచితాలు ఈ దేశ అభివృద్ధికి ప్రమాదకరం' అని వ్యాఖ్యానించారు. ప్రధాని చెబుతున్న ఉచితాలను ప్రజలు డిమాండ్ చేశారా? లేక ప్రభుత్వమే ఇస్తున్నదా? అసలు 'ఉచితం' అంటే ప్రధాని మనసులో ఉన్నదేంటి? రాయితీలు, సంక్షేమానికి ఉన్న సంబంధమేంటి? ఇది తేలిపోతే ప్రధాని మాటలలోని మర్మం అర్థమవుతుంది.

ప్రధాని ఈ మధ్య చేసిన ఈ కామెంట్ రాజకీయ పార్టీలలో పెద్ద దుమారాన్నే లేపింది. అట్టడుగు వర్గాల ప్రజలలో సరికొత్త ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే సబ్సిడీలు చాపకింద నీరులా మాయమవుతున్నాయి. వంట గ్యాస్ బిల్లు చూస్తే ఈ మాయ ఏ స్థాయిలో ఉన్నదో తెలిసిపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. సర్కారు నియత్రించలేకపోయింది. తాజాగా పాలు, పెరుగు లాంటి కనీస అవసరాలపైనా జీఎస్టీ విధించింది. సర్కారు ఆలోచన ఎలా ఉన్నదో అర్థమవుతున్నది. 'ఉచితం' పేరుతో ఇకపైన సంక్షేమానికి కోతలు అనివార్యమనే భావన కలుగుతున్నది. సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) అనేది పాలకుల చిలక పలుకు మాత్రమే.

విపక్షాల ఆగ్రహం

ప్రధాని చేసిన 'ఉచితం' కామెంట్‌పై టీఆర్ఎస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలాంటివి ఇప్పటికే ఫైర్ అయ్యాయి. సంక్షేమ పథకాలను 'ఉచితం' పేరుతో అడ్డుకునే కుట్రే అంటూ ప్రధాని తీరును విమర్శించాయి. నిజానికి 'ఉచితం' పేరుతో ప్రజాధనం దుర్వినియోగమవుతూ ఉంటే నియంత్రించాల్సిందే. అంతకంటే ముందు అది వృథా ఖర్చేనా? కాదా? అనేది తేలాల్సి ఉంటుంది. ఉచితానికి, సంక్షేమానికి ఉన్న సంబంధాన్ని కూడా తేల్చాలి. సమాజంలో ఆర్థిక అసమానతలు కొనసాగినంత కాలం సంక్షేమ పథకాలు కొనసాగక తప్పదు. ఈ అంతరాన్ని తొలగించలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 'ఉచితం' ఫిలాసఫీని తెరపైకి తేవడం అసమంజసం.

గతంలో ఇన్‌కం టాక్స్ కట్టేవారు మాత్రమే 'టాక్స్ పేయర్లు' అనే సాధారణ అభిప్రాయం ఉండేది. ఇప్పుడు దేశంలోని ప్రతీ ఒక్కరూ టాక్స్ పేయరే. అనేక వస్తువుల మీద జీఎస్టీ వేసినప్పుడు దాన్ని కొంటున్నవారంతా ప్రభుత్వ ఖజానాకు సంపదను పోగు చేస్తున్నవారే. వీరంతా సంపద సృష్టికర్తలే. ఆ సంపదే సంక్షేమ పథకాలకు ఆర్థిక వనరు. అందుకే సంపద పంపిణీలో పేదలకు వాటా ఉంటుంది. ధనిక-పేద ఆర్థిక అసమానతలను బ్యాలెన్స్ చేయడానికి యాభై ఏళ్ల క్రితమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' నినాదం తెచ్చారు. సంపదలో కొంత భాగాన్ని పేదలకు ఒక వాటాగానే ఇవ్వాలని భావించారు. అలా దక్కడం న్యాయమనీ విశ్వసించారు. అయినా పేదరికం పోలేదు.

దేని మీదా స్పష్టత లేదు

ప్రస్తుత ప్రధాని కూడా 'గరీబ్ కల్యాణ్ యోజన' పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రధాని దృష్టిలో ఏది ఉచితం? ఏది సంక్షేమం? అనేది తేటతెల్లమైతే సగం వివాదం పరిష్కారం అవుతుంది. సంక్షేమానికి, ఉచితాలకు మధ్య తేడాపై చాలా మంది కేంద్ర మంత్రులకూ స్పష్టత లేదు. మిడిల్ క్లాస్ ప్రజలలోనూ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. రైతుబంధు లేనప్పుడు వ్యవసాయం చేయలేదా? కల్యాణలక్ష్మి ఇవ్వకముందు పెళ్లిళ్లు కాలేదా? ఇలాంటి వాదనలు అందులో భాగమే. అల్పాదాయంతో ఉన్న రైతులకు రైతుబంధు అవసరమే. కానీ వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములకూ ఇవ్వడంలో అర్థమే లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సంపన్నులూ వైట్ రేషన్ కార్డు సౌకర్యంతో అనుభవిస్తున్నారు. ఈ లొసుగులతో ప్రజాధనం దుర్వినియోగమవుతున్నది. వీటిని అరికట్టడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి.

ఆ మాటకొస్తే చట్టసభలకు ఎన్నికవుతున్న వారిలో కోటీశ్వరులే అధికం. అయినా వారికి ప్రభుత్వాలు రాయితీలు ఎందుకిస్తున్నట్లు? పార్లమెంటు క్యాంటీన్‌లో ఫుడ్ సబ్సిడీ మొదలు రైలు, విమాన ప్రయాణాలలో రాయితీలు, ఉచితంగా వైద్యం, వారి అధికారిక బంగళాలకు ఉచితంగా విద్యుత్, వంటగ్యాస్, వాటర్.. లాంటివన్నీ ఎందుకు సమకూర్చుతున్నది? ఒక్కసారి ఎన్నికైతేనే జీవితాంతం పింఛను సౌకర్యాలు ఎందుకు అందుస్తున్నది? ఇవేవీ ప్రభుత్వాల దృష్టిలో వృథా కాదా? కనీస సౌకర్యాలకు నోచుకోలేని పేదలకు సబ్సిడీలు, రాయితీలు, సంక్షేమం అందించడం మాత్రం ఆర్థిక అరాచకత్వం, అభివృద్ధికి ఆటంకంగా కనిపిస్తున్నదా?

అది ప్రభుత్వాల బాధ్యత

ప్రజల మౌలిక అవసరాలను తీర్చడం సంక్షేమం. ఇది ప్రభుత్వాల బాధ్యత. పేదల సంక్షేమ పథకాలపై 'ఉచితం' పేరుతో అభ్యంతరం వ్యక్తం చేసే వ్యక్తులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారికి మాఫీ చేయడంపై మాట్లాడాలి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి పెట్టుబడులను ఉపసంహరించుకుని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు తక్కువ ధరకు ధారాదత్తం చేయడంపై వివరణ ఇవ్వాలి. ప్రజాధనంతో విచ్చలవిడిగా విదేశీ పర్యటనలు, విమాన ప్రయాణాలు చేయడంపై జవాబు చెప్పాలి. ప్రజాధనం లో చేసిన ప్రతీ పైసా ఖర్చును ప్రజలకు వివరించాలి. జవాబుదారీతనంతో వ్యవహరించాలి.

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక హామీలు గుప్పిస్తుంటాయి. తమిళనాట ఉచితంగా కలర్ టీవీ, మిక్సీ, గ్రైండర్, లాప్‌టాప్, మొబైల్ టాబ్ లాంటివి చూశాం. తాజాగా యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ప్రతీ నెలా ఆర్థిక సాయం, స్కూటీలు, ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్, ఉచిత తాగునీరు హామీలిచ్చాయి. ఓట్ల కోసం, అధికారంలోకి రావడం కోసమే ఇవన్నీ. ప్రజల ఆర్థిక పరిస్థితులు ఎంతటి దయనీయంగా ఉన్నాయో ఈ ధోరణి అద్దం పడుతున్నది. అడగకుండానే ఓటు బ్యాంకు కోసం హామీలు గుప్పించి ప్రజలపైకి నెట్టడం దురదృష్టకరం.

పార్టీలకు కావలసింది అదే

ఇంతకాలమైనా పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నది కఠోర సత్యం. వారు పేదరికంలో కొనసాగడమే పార్టీలకు కావాల్సింది. అలా ఉన్నంతకాలం వారు అందుకునేవారు, పార్టీలు ఇచ్చేవిగా కొనసాగుతాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో హామీలతో ప్రజలను భ్రమలలో ముంచుతుంటాయి. స్కూటీలు, టీవీలు ఈ కోవలోనివే. ఇలాంటి హామీలను ఖండించాల్సిందే. నిజానికి ప్రజలు ఇలాంటి హామీలను ఎన్నడూ అడగలేదు. డిమాండ్ చేయలేదు. పార్టీలు వాటి రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారంలోకి రావడం కోసం కురిపిస్తున్న వరాలే ఇవి.

ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. 'ఉచితం' పేరుతో ఆంక్షలు విధించడం బాధ్యతారాహిత్యం. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రభుత్వాలు వాటిని సంక్షేమం కోసం ఖర్చు చేయవలసిందే. ఏది ఉచితం? ఏది సంక్షేమం? అనేది తేలితే వాటి పట్ల పాలకులు వైఖరి స్పష్టమైతే,అవి ఎవరి పక్షం వహిస్తున్నాయో అర్థమవుతుంది. సమాజంలోని అన్ని వర్గాల పట్ల పాలకులకు స్పష్టమైన దృష్టికోణం ఉండాలి. సంపదను పెంచడమెలాగో క్లారిటీ ఉండాలి. దాన్ని ప్రజలకు హేతుబద్ధంగా పంచడంపైనా నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. అది సమర్థవంతంగా జరిగినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధ్యం.

పస లేని వాదనలు

ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని, దేశం దివాలా తీస్తున్నదనే సిద్ధాంతాన్ని పాలకులు తెరపైకి తెస్తున్నారు. సంక్షేమం, ఉచితాలు అవసరమేలేని పరిస్థితులను సాకారం చేయలేకపోవడం పాలకుల చేతకానితనం. నిజానికి సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన పని లేనప్పుడు కూలీల మొదలు ఉద్యోగుల వరకు ఆయా స్థాయిలలో సృష్టించిన సంపద ఎవరికోసం? అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నది ప్రజలకు అందనప్పుడు దానితో ప్రయోజనమేంటి?సంపద సృష్టిలో పేదల శ్రమను గుర్తించనప్పుడు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఆ ప్రభుత్వాలకు విలువెక్కడిది?

పేదల సంక్షేమానికి చేస్తున్న ఖర్చు వృధా అనేదే పాలకుల భావన అయితే ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతదారులు, బ్యాంకులను ముంచిన వారికి మాఫీ చేయడం ఎందుకోసం? ఈ ప్రభుత్వాలు ప్రజలపక్షమా లేక బ్యాంకులను లూటీచేసిన వారి పక్షమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పేదోళ్ల కడుపు కొట్టి పెద్దోళ్ల బొజ్జలు నింపడమే ప్రభుత్వాల విధానమా? అనేది కూడా చర్చనీయాంశం. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వివిధ సెక్షన్ల ప్రజల అభివృద్ధికి, జీవనోపాధికి, సంక్షేమానికి ప్రభుత్వాలు దోహదపడకపోతే ఆ బాధ్యత ఎవరిది? ఆర్థిక అసమానతలు పెరిగితే సమాజంలో అశాంతి ఏ స్థాయిలో పెల్లుబుకుతుందో తాజాగా శ్రీలంక సంక్షోభమే ఉదాహరణ.

అది వారి హక్కు

ప్రపంచంలో చోటు చేసుకున్న అనేక తిరుగుబాట్లకు ఆర్థిక అసమానతలే కారణం. ధనికుల సంపద పోగుపడుతూ ఉన్నది. పేదలు కడు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. అభివృద్ధికి దూరమవుతున్నామనే భావన పెరుగుతున్నది. చెమట, నెత్తురు నుంచి సృష్టించిన సమాజ సంపదలో వారి వాటాగా అందుకోవడం పేదల హక్కు. శ్రమకు తగిన ఫలితం, పంటలు పండించిన కష్టానికి దక్కని గిట్టుబాటు ధర.. ఇలాంటివి కొనసాగినంత కాలం సంక్షేమాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. 'ఉచితం' పేరుతో కోతలు పెట్టడం సంక్షేమ బాధ్యత నుంచి తప్పుకోవడమే. పేదలకు పనిచేయకుండానే ఊరికే వస్తున్నాయనేది అసంబద్ధ లాజిక్.

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story