రోహిణి కమిషన్ రిపోర్ట్ ఏమైంది సార్?

by Ravi |   (  Updated:2025-02-20 00:45:45  IST  )

భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆయన మనో ఫలకంపై బొమ్మ కట్టిన బీసీల పునర్ వర్గీకరణ నినాదం

రోహిణి కమిషన్ రిపోర్ట్ ఏమైంది సార్?
X

భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆయన మనో ఫలకంపై బొమ్మ కట్టిన బీసీల పునర్ వర్గీకరణ నినాదం ఆచరణకు నోచుకోక కాగితాలకే పరిమితం అయ్యింది. మొక్కుబడిగా ఏర్పాటు అయిన రోహిణి కమిషన్ రిపోర్ట్ అనేక పర్యాయాలు వాయిదా పడుతూ తన రిపోర్టు ఇచ్చినప్పటికీ కేంద్రం మాత్రం ఈ రిపోర్ట్‌పై చట్టబద్ధమైన నిర్ణయాలను తీసుకోవడంలో వెనుకంజ వేస్తోంది. నరేంద్ర మోడీ స్వయంగా ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టని మోడీ ప్రభుత్వం మాదిగ ఉప కులాల వర్గీకరణపై మొసలి కన్నీరు కార్చడం శోచనీయం.

1979లో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలలో 27% సీట్లు ఓబీసీలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే ఈ రిజర్వేషన్లలో సింహభాగం కులంలోని ఆధిపత్య వర్గాలపై కేంద్రీకృతమై ఉందనే భావనతో ఓబీసీలల్లో ఉప వర్గీకరణను ప్రతిపాదించారు. ఇందుకోసం వెనుకబడిన తరగతుల వర్గంలో చేర్చబడిన కులాలు.. లేదా ఆ వర్గాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల అసమాన పంపిణీ పరిధిని పరిశీలించడం, ఇతర వెనుకబడిన తరగతులలో ఉప-వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో యంత్రాంగం, ప్రమా ణాలు, నిబంధనలు, పరిమితులను రూపొందించడం కోసం కేంద్రం జస్టిస్ రోహిణి కమిషన్ 2017, అక్టోబర్ 2న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జీ. రోహిణి ఈ కమిషన్‌కు చైర్ పర్సన్‌గా నియమింపపడ్డారు. మొత్తం ఇందులో నలుగురు సభ్యులు ఉన్నారు.

కమిషన్ రిపోర్టును అటకెక్కించి..

జాతీయ స్థాయిలో ఎంబీసీ ఓటు బ్యాంకు ద్వారా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి ఎంబీసీల పట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉందొ తేటతెల్లం అయ్యింది. బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు తమ ఖాతాలో వేసుకుంటుందంటే అందుకు ఎంబీసీల ఓటు బ్యాంకే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఉత్తరాది రాష్ట్రంలో బీసీలలోని యాదవ, కూర్మ, గుజ్జర్ ఇతర బీసీ వర్గాలు ఇప్పటికీ స్వీయ రాజకీయ అస్తిత్వంతో ముందుకు సాగుతున్నాయి. మిగిలిన ఎంబీసీ సంచార కులాలను ఆర్గనైజ్ చేయడంలో బీజేపీ సాధించింది. దీంతో అత్యంత అట్టహాసంగా రోహిణి కమిషన్ ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం కమిషన్ రిపోర్ట్‌ను మాత్రం అటకెక్కించింది. కమిషన్ కాలపరిమితిని అనేక సార్లు పొడిగిస్తూ వచ్చింది. పొడిగింపుపై అనేక విమర్శలు రావడంతో ఎట్టకేలకు కమిషన్ రిపోర్ట్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపి తదుపరి కార్యాచరణకు పునుకోకపోవడంతో బీసీల పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. అవకాశవాద ఎత్తుగడలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.

- దొమ్మాట వెంకటేష్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

98480 57274

Next Story