- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులు ఏమి అడిగారు.. ప్రభుత్వం ఏమిస్తోంది?
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, టీజీఎల్ఐసీ రుణాలు, రిటైర్మెంట్ ప్రయోజనాల పెండింగ్ అంశాలపై ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రభుత్వం స్పందన, ఉద్యోగ సంఘాల పాత్రపై విశ్లేషణ.

ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా తమకు రావాల్సిన వివిధ రకాల బెనిఫిట్స్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతర్గతంగా బహిర్గతంగా తమ నిరసనను సున్నితంగా తెలియజేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడంలో ఏదో ఒక రకమైన కారణాలు చెబుతూ దాటవేస్తూ వస్తుంది.
సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా అలానే పెండింగులో ఉంటున్నాయి. ఉద్యోగుల సమస్యల చిట్టా గుట్టలుగా రోజు రోజుకు పెరిగి పోతుంది. ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ కాలాన్ని సాగదిస్తుంది తప్ప ఏ ఒక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆసక్తి చూపడం లేదు.
ఏళ్ల తరబడి వేచి ఉండటం ఏం న్యాయం?
ఉద్యోగులు తమ నెల జీతాన్ని పొందుతున్నారు.. తప్ప మరి ఏ ఇతర బెనిఫిట్స్ రావాలన్నా వాటి కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పైరవీలు కూడా చేసుకొని మూల్యం చెల్లించుకుంటున్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అయితే మరి దయనీయం. వారు చివరికి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది.
పెరిగిన అంతరం..
ప్రభుత్వం సమయానుకూలంగా ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేరకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అంతరం పెరిగింది. తెలంగాణలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పెరుగుతున్న అంతరం అనేది ప్రధానంగా ఆర్థిక సంక్షోభాలు, పాలనాపరమైన సంస్కరణలు, ఉద్యోగుల డిమాండ్ల నెరవే రికలో జాప్యం కారణంగా ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వోద్యోగులు రోజుకు అదనంగా ఒక గంట పాటు ఎక్కువ పనిచేయాలని ప్రభుత్వాధినేత చేసిన అభ్యర్థనపై ఉద్యోగ వర్గాల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఇదో కొత్త రకమైన ఊరడింపు..
ఉద్యోగులు ఏది అడిగితే అదే ఇవ్వాలి గాని, ఇంకేదో ఇస్తామంటూ ముందుకు రావటం ఉద్యోగుల్లోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా తమకు రావాల్సిన పీఆర్సీ, డీఏ, మెడికల్ బిల్స్, జీపీఎఫ్ లోన్స్, టీజీఎల్ఐసీ లోన్స్ వంటి ప్రధానమైన ఆర్థిక అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచితే, ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం, బీమా పథకం అంటూ వారి మూల వేతనంలో ఒకటి పాయింట్ ఐదు శాతం కట్ చేసుకుని ఆరోగ్య పథకం కార్డు ద్వారా మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. ఇదేమి గతంలోని మెడికల్ రీయింబర్స్మెంట్ కంటే పెద్ద ప్రయోజనం చేకూరేదేమి కాదు.
రిటైర్డ్ ఉద్యోగి మూలవేతనంలోనూ కట్..
సంపూర్ణ ఆరోగ్యంగా జీవించి పదవీ విరమణ చేసిన ఉద్యోగి నుండి కూడా అనివార్యంగా తన మూల వేతనం నుండి జీతాన్ని కట్ చేయడం అనేది సరైనది కాదు. ఉద్యోగులు ఇప్పుడు పొందుతున్న ప్రయోజనాల కన్నా గతంలో పొందిన ప్రయోజనాలే మెరుగని చెప్పక తప్పదు. ప్రభుత్వం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే వారి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్లను వెంటనే పరి ష్కరించాలి. ఉద్యోగులకు ఇవ్వవలసిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించి బకాయిలను విడతల వారీగా కాకుండా ఒకేసారి చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.
వేల కోట్ల రూపాయల బకాయి చెల్లించేనా?
ఉద్యోగ సంఘాల నాయకుల స్వార్థ ప్రయోజనాల వలన సగటు ఉద్యోగి తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగుల సమస్యల పట్ల వారికి సరైన అవగాహన లేకపోవడం లక్షలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పడి ఉంది. ఒక్కో ఉద్యోగికి లక్షలాది రూపాయలు బకాయి పడి ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల సమతుల్యత లేక పోవడంతో, గతంలో డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. బకాయిల కోసం ఉద్యోగులు నిరసనలు తెలపడం, ప్రభుత్వం వాటిని దశల వారీగా విడుదల చేయడం జరిగింది.
సంఘాలపై పోతున్న నమ్మకం..
ఏండ్లు గడిచిపోతున్నప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో సంఘాలు, సంఘ నాయకత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను ఇష్టం వచ్చిన ప్పుడు మాత్రమే పరిష్కరిస్తాయి తప్ప ఉద్యోగ సంఘాల పోరాటాల వల్ల కాదు అని తేలిపోయింది. ఈ పరిణామాల వలన ఉద్యోగులు తమ సంఘాలను నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ సంఘాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అవసరం ఒకటైతే, నిర్ణయం మరొకటా?
ప్రభుత్వం, ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వడానికి సిద్ధపడాలి కానీ ప్రభుత్వమే తానే సొంతంగా ప్రతి పాదనలు తయారు చేసుకొని ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏదో చేస్తున్నామని చెప్పడం అనేది సరైనది కాదు. సమస్య, వారి అవసరం ఒకటి ఉంటే ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? చెప్పుకోవడానికి నోటి మాటలు తప్ప ప్రయోజనం శూన్యం. ఉద్యోగుల అవ సరాలు వారి సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసు కున్నప్పుడు మాత్రమే ఉద్యోగుల అవసరాలు తీరుతాయి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు వేరు కాదు. ప్రభుత్వ విధానాలను సమర్ధవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి విజయాలు సాధించి పెట్టేది ఉద్యోగులే అన్న విషయాన్ని గుర్తించాలి.
-నాగుల వేణు యాదవ్
అసిస్టెంట్ ప్రొఫెసర్
97010 57225






