జమ్మికుంటలో దర్జాగా అక్రమ నిర్మాణాలు!

by Jakkula.Mamatha |

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జమ్మికుంటలో దర్జాగా అక్రమ నిర్మాణాలు!
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా సెటర్లు వేసి నిర్మాణం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు..

పట్టణ కేంద్రంలో పలువురు ఇంటి యజమానులు మున్సిపాలిటీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి మూడు, నాలుగు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. సెట్‌బ్యాక్ లేకుండా, పార్కింగ్ స్థలం వదలకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నా.. మున్సిపల్ అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

స్థానిక నాయకులు, అధికారులు యజమానితో కుమ్మక్కు..

పట్టణంలో రోజూ తిరిగే మున్సిపల్ సిబ్బందికి ఈ భారీ నిర్మాణాలు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. G+3 పర్మిషన్‌తో G+4,5 కడుతుంటే నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపాలిటీకి టౌన్ ప్లానింగ్ అధికారి ఇన్‌చార్జిగా ఉన్నారని, పూర్తిస్థాయి అధికారి లేకపోవడం వల్లే పర్యవేక్షణ కొరవడిందనే వాదన బలంగా వినిపిస్తోంది.కొందరు అధికారులు, స్థానిక నాయకులు ఇంటి యజమానులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే అనుమానాలను పట్టణవాసులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

నిబంధనలకు విరుద్ధంగా G+4,5 కడితే, అదనపు అంతస్తులకు బిల్డింగ్ పర్మిషన్ ఫీజు, డెవలప్‌మెంట్ ఛార్జీలు, ఇంపాక్ట్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించరు. దీనివల్ల మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయ నష్టం వాటిల్లుతోంది. సెట్‌బ్యాక్ లేని నాణ్యతా ప్రమాణాలు పాటించని భవనాల వల్ల అగ్నిప్రమాదాలు జరిగితే ఫైర్ ఇంజిన్ వెళ్లే పరిస్థితి ఉండదు. ఒక ఇంటి స్థలంలో 4 ఫ్యామిలీలు ఉంటే డ్రైనేజీ, మంచినీరు, పార్కింగ్ సమస్యలు తీవ్రమవుతాయి. ఇది పట్టణ ప్రణాళికనే దెబ్బతీస్తుంది.

అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి..

ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలి. అక్రమ అంతస్తులను కూల్చివేయడంతో పాటు, అనుమతి లేని నిర్మాణాలకు భారీ జరిమానాలు విధించాలి. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ విభాగంలో పూర్తిస్థాయి అధికారిని నియమించాలి అప్పుడే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని పట్టణ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నారు.

Next Story