భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యానికి కారణాలేంటి?

by Ravi |   (  Updated:2025-09-18 00:45:58  IST  )

నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, భారత విదేశాంగ విధానాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తానని ప్రకటించారు.

భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యానికి కారణాలేంటి?
X

నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, భారత విదేశాంగ విధానాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తానని ప్రకటించారు. నెయిబర్‌ హుడ్ ఫస్ట్ నుంచి ఆక్ట్ ఈస్ట్ వరకు, విశ్వగురుగా భారతదేశాన్ని చూపించాలని ఆయన ఆకాంక్ష. కానీ, గత 11 సంవత్సరాలలో పొరుగు దేశాలతో సంబంధాలు, చైనా- పాకిస్తా‌న్‌లతో వివాదాలు, ప్రపంచ శక్తులతో సమన్వయం వంటి అంశాలలో ఎన్నో తప్పులు జరిగాయి.

నైబర్‌హుడ్ ఫస్ట్.. ఎక్కడ?

ముందుగా, పొరుగు దేశాల విధానాన్ని పరిశీలిస్తే, మోడీ ప్రభుత్వం నెయిబర్‌హుడ్ ఫస్ట్ అని ప్రకటించినా, అది వాస్తవంలో వైఫల్యాన్నే చవిచూసింది. నేపాల్‌లో రాజ్యాంగ సవరణల విషయంలో భారత్ జోక్యం చేసుకోవటం వల్ల ఆ దేశంతో మన సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్‌లో భారత వ్యతిరేక భావనలను పెంచి పోషించింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవటం కూడా దేశానికి పెద్ద దెబ్బ. హసీనా భారత్ మిత్రురాలు కావటం వల్ల గతంలో కంటే సంబంధాలు మెరుగు పడ్డాయి కానీ, ఆమె పతనం తర్వాత ఆమెకు భారత్‌లో తలదాల్చుకొనే వసతులు, రక్షణ కల్పించటం, బంగ్లాదేశ్ ప్రజల్లో తాత్కాలిక ప్రభుత్వంలోనూ భారత వ్యతిరేకత మరింత పెరిగింది. ఇక మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలలో భారత్ ప్రభావం చైనా ఆధి పత్యానికి తలవంచాల్సి వచ్చింది.

చైనాతో బంధాలు కటీఫ్!

చైనాతో సంబంధాలు మోడీ విధానపు అతి పెద్ద వైఫల్యం. 2020 గాల్వాన్ సంఘటన తర్వాత సరిహద్దు వివాదాలు పరిష్కారం కాలేదు. మోదీ ప్రభుత్వం చైనా దూకుడును తక్కువగా అంచనా వేసింది, ఫలితంగా భారత్ భూభాగాలు కోల్పోయింది. పాకిస్థాన్‌తో సంబంధాలు మరింత దిగజారాయి. 2025లో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది కానీ, అమెరికా మధ్యవర్తిత్వంతో సీజ్‌ఫైర్ జరిగింది. ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనలు భారత్‌ను ప్రపంచ వ్యాప్తంగా అవమాన పరిచిందని విశ్లేషకుల వ్యాఖ్య.

అమెరికాతో దెబ్బతిన్న బంధాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికాతో సంబంధాలు కూడా ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. ట్రంప్ అధ్యక్షత్వంలో 50 శాతం టారిఫ్‌లు విధించటం మోడీ డిప్లమసీ వైఫల్యం. రష్యాతో భారత్ సంబంధాలు కూడా గతంలో కంటే భిన్నంగా మారాయి. ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ తటస్థత వల్ల రష్యా కూడా తన వైఖరిని స్థానాన్ని మార్చుకుంది. రష్యా-పాకిస్థాన్ మధ్య $2.8 బిలియన్ ఒప్పందం భారత్‌కు పెద్ద దెబ్బ. అమెరికా ప్రాపకం కోసం ఇజ్రాయెల్‌కు భారత్ బేషరతుగా మద్దతు ఇవ్వటం వల్ల సాంప్రదాయకంగా అరబ్ దేశాలు వంటి మిత్ర దేశాలు కూడా భారత్‌కు దూరమయ్యాయి.

హగ్ డిప్లమసీ.. నో గెయిన్

ప్రపంచ వేదికలపై భారత్ స్థానం ఇప్పటికీ మెరుగుపడలేదు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం, ఎన్‌.ఎస్‌.జీ. సభ్యత్వం వంటివి ఏవీ భారత్ సాధించలేకపోయింది. సీఏఏ వంటి చట్టాలు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తా‌న్ సంబంధాలను మరింత లోతుగా దెబ్బతీశాయి. మొత్తంగా, మోడీ విదేశాంగ విధానం వ్యక్తిగత డిప్ల మసీపై ఆధారపడి, సంస్థాగత బలాన్ని నిర్లక్ష్యం చేసింది. హగ్స్, ఫ్రెండ్‌షిప్ క్లెయిమ్స్ విదేశాంగ విధానానికి నిర్వచనం కాదని విమర్శించారు. భవిష్యత్తులో భారత్ తన విదేశాంగ విధానాన్ని ప్రపంచ పరిస్థితులకు, పోకడలకు అనుగుణంగా మార్చుకుని, సమ్మిళితత్వం, బలమైన ఆర్థిక సంబంధాలు, రక్షణ సామర్థ్యం ద్వారా పెంచుకోవాలి. లేకుంటే, ఈ లోపాలు దేశాన్ని మరింత ఒంటరిని చేస్తాయి.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story