హైందవ శంఖారావంపై ఆక్రోశం దేనికి!

by Ravi |   (  Updated:2025-01-16 01:15:27  IST  )

హిందువుల ఆచారాలను, హిందువుల గ్రంథాలను, హిందువుల దేవి దేవతలను దునుమాడే

హైందవ శంఖారావంపై ఆక్రోశం దేనికి!
X

హిందువుల ఆచారాలను, హిందువుల గ్రంథాలను, హిందువుల దేవి దేవతలను దునుమాడే స్వాతంత్రం తమకున్నదని కొందరు భావిస్తే, తన మతాన్ని ఇలా అవమానపరచడం తప్పు అని నినదించే హక్కు అనంత శ్రీరామ్‌కు లేదా? అని సాధారణ హిందువు వేసే ప్రశ్న! ఇస్లాం అనుసరించే ప్రజలు మెజారిటీగా ఉన్న దేశాలలో ఇస్లాం మతం గురించి విమర్శలు చేస్తే బ్రతకలేరు. ఇక క్రైస్తవ దేశాలలో ఇంతకంటే భిన్నంగా పరిస్థితి ఉండదు. ఇక కమ్యూనిస్టు పాలన ఉండే దేశాలలో కమ్యూనిస్టు నాయకులను, కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టు ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఏమి జరుగుతుందో చైనాలో ఉయ్ఘర్ ముస్లిం తెగ ప్రజలను అడిగితే తెలుస్తుంది. మరి హిందుత్వానికి సంబంధించిన విషయాలలో ఇలాంటి పెడ ధోరణి అవసరమా? ఈ విషయంలో హిందువులు రెచ్చిపోతే, సమాజంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తవా? అనంత శ్రీరామ్ ను అందుకు బాధ్యుడిగా చేయలేము కదా? సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమా పేరుతో హిందూ సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలను హనం చేసిన విషయం ప్రస్తావించడంపై కొందరు దళిత ముసుగు వేసుకుని విపరీతమైన ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హిందుత్వ విషయంలో న్యూట్రల్‌గా ఉన్న హిందువులకు సైతం కోపాన్ని తెప్పిస్తోంది.

జనవరి 5న విజయవాడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన హైందవ శంఖారావంపై కొందరు హిందూ వ్యతిరేకులు ఆగ్రహాన్ని , ఆక్రోశాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంపై వారికి కోపం రావడానికి కారణం లేకపోలేదు. సాధారణంగా ఈ దేశంలో ఇస్లామిక్ సమాజం ఒక ఆర్గనైజ్డ్ సొసైటీ. క్రైస్తవ సమాజం కూడా ఇందుకు భిన్నమైనదేమీ కాదు. మత ఆచారాలకు సంబంధించి ఈ రెండు కమ్యూనిటీలు ఎంతో పట్టుదలతో, సిస్టమేటిక్‌గా ప్రభుత్వాలను తమ గుప్పెట్లో ఉంచుకుంటాయి. ఇక హిందువులు అని పిలవబడే వాళ్ళు కులాల వారీగా, వర్గాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా విడిపోయి, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, తమ మత సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, దేవీ దేవతలను అనవసరంగా, అసందర్భంగా వెక్కిరించే వారి పంచన చేరి ఉంటారనేది లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ వ్యతిరేకుల అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ, లక్షల సంఖ్యలో హిందువులు తమ సొంత డబ్బుతో హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనడం, ట్రాఫిక్ విషయంలో పోలీసులతో కలిసి, సహకరించుకోవడం, సభాస్థలిలో క్రమశిక్షణను పాటించడం, భోజనాల దగ్గర క్యూ పద్ధతిని తూచా తప్పకుండా ఫాలో కావడం, మండుటెండను సైతం లెక్కచేయకుండా, వక్తలు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించడం వంటి విషయాలు హిందూ వ్యతిరేకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి అంటే అతిశయోక్తి కాదేమో!

హైందవ శంఖారావం అసలు లక్ష్యం

వాస్తవంగా ఈ కార్యక్రమం లక్ష్యం ప్రభుత్వ స్వాధీనంలోని దేవాలయాలను ప్రభుత్వ కబంధహస్తాల నుండి విముక్తి చేసి, వాటి నిర్వహణ హిందూ ట్రస్టీల ద్వారా చేపట్టడమే. క్రైస్తవులు, ముస్లింలు తమ మత సంస్థల ఆస్తిపాస్తులను వారే నిర్వహించుకుంటారు. వీటి విషయంలో ప్రభుత్వం వేలు పెట్టడానికి ఆ రెండు సమాజాలు అంగీకరించవు. ఈ తరహాలో హిందూ దేవాలయాలను హిందువులే నిర్వహించుకోవాలి అని హిందువులు కోరుకోవడంలో, ఈ విషయంపై సమావేశం కావడంలో, ఎలాంటి శాసన వ్యతిరేకత లేదు. ఇక వక్తలు ముఖ్యంగా చిన్న జీయర్ స్వామి, కమలానంద భారతి, విరజానంద స్వామి మాట్లాడిన మాటల్లో ఇతర మతాల వారిని దూషించినట్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు వేలెత్తి చూపడానికి ఎటువంటి దాఖలాలు లేవు. ఇక సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమా పేరుతో హిందూ సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలను హననం చేసిన విషయం ప్రస్తావించడంపై కొందరు దళిత ముసుగు వేసుకుని విపరీతమైన ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హిందుత్వ విషయంలో న్యూట్రల్‌గా ఉన్న హిందువులకు సైతం కోపాన్ని తెప్పిస్తుంది.

దేవాలయాలు పునరావాస కేంద్రాలా?

దేవాలయాలు ప్రభుత్వ స్వాధీనంలో ఉండడం వల్ల అవి రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారడం, హిందువులు దేవుడి మీద భక్తితో దేవుడికి సమర్పించిన నిధులను దోపిడీ చేయడానికి, అధర్మ కార్యక్రమాలు చేపట్టడానికి అవి కేంద్రాలుగా మారిన విషయంపై సాధారణ హిందువు ఆక్రోశంతో ఉన్నాడు. ఈ ఆక్రోశం ప్రభావమే హైందవ శంఖారావంలో స్థాయి కలిగిన, దృఢ నిశ్చయం, పట్టుదల కలిగిన హిందువుల ఆగమనానికి ప్రముఖ కారణమైందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ కార్యక్రమంలో అనేకమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. వారందరూ ధర్మ పరాయణులై, చిత్తశుద్ధితో హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున హిందువులను కలిపే ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉండదేమో! ఇక చివరగా లౌకిక రాజ్యాంగం అమలు చేస్తున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులకు ఒక మతానికి సంబంధించిన ఆస్తులపై ప్రభుత్వం పెత్తనం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం అనే ఆలోచన రాకపోవడమే అంతు పట్టని విషయం. ఈ విషయంలో రాజకీయ నాయకులు తటస్థంగా ఉంటే, హిందువులు మరింతగా సంఘటితం అవుతారనేది అక్షర సత్యం.

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Next Story