ఇదీ సంగతి: అధికారం కోసమేనా రాజకీయ పార్టీల బతుకు?

by Disha edit |
ఇదీ సంగతి: అధికారం కోసమేనా రాజకీయ పార్టీల బతుకు?
X

ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారి అవసరాలు ఏమిటి? ఉచితంగా ఎవరు ఇస్తున్నారు? ఏం ఇస్తున్నారు? ఆ డబ్బు ఎవరిది? అధికారం కోసం పార్టీ నిధులు వేల కోట్లు వసూలు చేస్తున్నది. ఈ నిధుల ఎలక్టోరల్ బాండ్లకు ఐటీ ఎందుకు లేదు? పీఎం కేర్ ఫండ్ లెక్కలు ఎందుకు చెప్పరు? ఇలాంటి అన్ని ప్రశ్నలకు జవాబులు అవసరమే. ఇది ప్రజాస్వామ్య దేశం,75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న తరుణం. అందుకే అన్ని ప్రశ్నలకు జవాబు కావాలి. ఉచితం సముచితమా? కాదా? దీనికి సమాధానం కావాలి. 'దేశం ఏమైపోతే మాకేంది? దేశం ప్రజలు ఏమైపోతే మాకేంది? మా అధికారం శాశ్వతం. మేము చెప్పిందే చరిత్ర, మాకు తెలిసిందే అందరికీ తెలియాలి. సత్తా ఒక్కటే మా లక్ష్యం' అనుకునేవారి నుంచి దేశాన్ని బుద్ధిజీవులే కాపాడుకోవాలి.

దేశంలో ప్రస్తుతం ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు బతుకుతున్నాయి. ఎన్నికలు, తద్వారా అధికారం ఒక్కటే లక్ష్యం అయిపోయింది. ఇందుకోసం తాము ఏమైనా చేస్తామనే పరిస్థితి దేశంలో ఉంది. నిన్నటి దాకా అమృతకాలం గడిచింది. ఇక 2047 దాకా 'మేక్ ఇన్ ఇండియా' కాలం. మరో పాతిక సంవత్సరాలు అధికారం కోసం ఈ నినాదం చాలు. 'నమామి గంగే' అదే, మన గంగా నది శుద్ధికి సమయం కావాలి కదా? అన్నింటికీ 'తానా అంటే తందానా' అంటూ, నెహ్రూ కన్నా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీకి ఎక్కువ మార్కులు వేసి నంబర్ వన్ ర్యాంకులు ప్రకటించి సంబురపడిపోడానికి జాతీయ టీవీ చానళ్లు ఉండనే ఉన్నాయి. ఇంకేమి కావాలి? పేద ప్రజలకు కల్పించే సౌకర్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నది.

ఉచిత రేషన్, కిసాన్ సమ్మాన్ యోజన ఇలా కేంద్రం తెచ్చిన ఎన్నో పథకాలతో పాటు ఉచితంగా మహిళలకు, విద్యార్థులకు బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, వైద్యం, విద్య, లాప్‌ట్యాప్, స్మార్ట్ ఫోన్, సైకిళ్లు, ఇలా రాష్ట్రాలు తెచ్చినవి చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాల మీద ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశారు. 'కొందరు రెవిడీలను పంచి, ఆ కల్చర్‌తో ఎన్నికలలో లబ్ధి పొందుదామని చూస్తున్నారని' అన్నారు. రెవిడి అంటే అచ్చ తెలుగులో లేమిడి. బెల్లం, నువ్వులతో తయారు చేసేది. నిజానికి 137 కోట్ల భారతదేశంలో 2014 నుంచి 2022 వరకు దేశం నుంచి పరారు అయిన, ఇంకా దేశంలోనే ఉన్న కార్పొరేట్‌లకు రూ.12.40 లక్షల కోట్ల బ్యాంక్ రుణాలను కేంద్రం మాఫీ చేసింది. వారికి టాక్స్‌ను తగ్గించింది. మరో రూ. రెండు లక్షల కోట్లు వెసలుబాటు ఇచ్చి ప్రభుత్వానికి నష్టం కలిగించింది. రూ. ఐదు లక్షల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ జరిగింది.

అవి మనకు కనిపించవు

ఇలా దివాళా తీసిన బ్యాంకు రికార్డులు మాత్రము మనకు కనిపించవు. ఆ పేజీలు మాత్రం లేవు. షార్ప్‌నర్, పెన్సిల్, పెరుగు, పాలు తినే ప్రతీ సామాన్యుడి వస్తువు మీద జీ‌ఎస్‌టీ వేసారు. ధరలు ఆకాశాన్ని అంటాయి. నల్ల ధనం వెలికి తీసి, ప్రతీ ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని, ఐటీ కడుతున్న ఉద్యోగుల ఖాతాలలో బహుమతిగా కొంత అమౌంట్ వేస్తామని పీఎం నరేంద్ర మోదీ చెప్పింది రెవిడి లాంటి హామీనే కదా! అసలు ఉచితం సమస్య దేని కోసం వచ్చింది? 137 కోట్ల జనాభా గల దేశంలో వృద్ధులకు రైలు ప్రయాణంలో కొంత రాయితీ కల్పించడం, పెన్షన్ ఇవ్వడం భారమే అంటున్నది కేంద్రం. ఇందులోనూ కోతలే ఉంటున్నాయి.

సమస్త ప్రజల నుంచి పన్నులు, జీ‌ఎస్‌టీ వసూలు చేసి కార్పొరేట్‌లకు భారీగా రుణ మాఫీలు, టాక్స్ చెల్లింపులలో రాయితీలు ఇవ్వడం ఏమిటి? ఉచిత వ్యాక్సిన్, రేషన్ అంటూ పీఎం నరేంద్ర మోదీ పెద్ద పెద్ద హోర్డింగ్‌ల సంగతి ఏందీ? పాలకులు సమాధానం ఇవ్వాలి. ఉచితం వద్దే వద్దు, మరి నిరుద్యోగులందరికి కనీసం ఉపాధి చూపించండి చాలు. కష్టపడి కనీస ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితులను కల్పించండి. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా? ఇవ్వండి. మీరు ఇచ్చిన హామీ నిజమే అయితే అమలు చేయండి. ఉచితంగా రేషన్ కాదు, ఉద్యోగం కావాలి. జీవించే హక్కు కావాలి. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉపాధి కోసం, ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఖర్చు చేస్తున్నారు. ఉచితం విషయంలో వాదనలు ప్రతివాదనలు ఎలా ఉన్నా, దేశంలో రాజకీయ పార్టీలు అధికారం కోసమే బతుకుతాయి. చస్తాయి.

దేనిమీదా చిత్తశుద్ధి లేదు

పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, ఆకలి, ఆదాయం పెంపు, పెరుగుతున్న ధరలు, అప్పులు, దేశ ఆర్థిక పరిస్థితి, ఉత్పాదన మీద శ్రద్ధ లేదు. ప్రత్యర్థి పార్టీని ఎలా దెబ్బ తీయాలి? విపక్షాల ప్రభుత్వాలను ఎలా కూల్చాలి? ఎలా జైలులో పెట్టాలి? ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లకు కొనాలి? అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న అతని రేటు ఎంత? అంతా ఇదే. అంతా పొలిటికల్ షాపింగ్. ఇటీవల ఈ షాపింగ్ మహారాష్ట్ర నుంచి ఊపు అందుకున్నది. రాజకీయాలు దేశంలో పూర్తి అపవిత్రంగా మారాయి. డబ్బు ప్రధానం అయిపోయింది. పార్టీ టిక్కెట్ అయినా అడుగుతున్న వ్యక్తి ఆర్థిక పరిస్థితి మీదే ఆధారపడి ఉంటున్నది. ఆయా పార్టీల ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు కూడ అలాగే ఉంటున్నాయి. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు.

ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారి అవసరాలు ఏమిటి? ఉచితంగా ఎవరు ఇస్తున్నారు? ఏం ఇస్తున్నారు? ఆ డబ్బు ఎవరిది? అధికారం కోసం పార్టీ నిధులు వేల కోట్లు వసూలు చేస్తున్నది. ఈ నిధుల ఎలక్టోరల్ బాండ్లకు ఐటీ ఎందుకు లేదు? పీఎం కేర్ ఫండ్ లెక్కలు ఎందుకు చెప్పరు? ఇలాంటి అన్ని ప్రశ్నలకు జవాబులు అవసరమే. ఇది ప్రజాస్వామ్య దేశం,75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న తరుణం. అందుకే అన్ని ప్రశ్నలకు జవాబు కావాలి. ఉచితం సముచితమా? కాదా? దీనికి సమాధానం కావాలి. 'దేశం ఏమైపోతే మాకేంది? దేశం ప్రజలు ఏమైపోతే మాకేంది? మా అధికారం శాశ్వతం. మేము చెప్పిందే చరిత్ర, మాకు తెలిసిందే అందరికీ తెలియాలి. సత్తా ఒక్కటే మా లక్ష్యం' అనుకునేవారి నుంచి దేశాన్ని బుద్ధిజీవులే కాపాడుకోవాలి

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

9951865223


Next Story

Most Viewed