- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాతో చేరితే మంచిదేమో.. సరదా వ్యాఖ్యేనా?
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘నాతో చేరితే మంచిది’ వ్యాఖ్య తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఆసక్తి, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్-బీజేపీ పోటీపై విశ్లేషణ.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా హైదరాబాద్ పర్యటించిన సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ‘నాతో చేరితే మంచిదేమో’ అని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సహజంగానే చర్చకు దారి తీసింది. చూసేవారికి అది సరదా వ్యాఖ్యలా అని పించవచ్చు. కానీ భారత రాజకీయాల్లో మాటల వెనుక అర్థాలు, సంకేతాలు, వ్యూహాలు వేరుగా ఉంటాయి..
ముఖ్యంగా నరేంద్ర మోడీ వంటి నాయకుడు బహిరంగ వేదికపై చేసే ప్రతి వ్యాఖ్య రాజకీయ ప్రయోజనాల కోణంలోనూ పరిశీలించబడుతుంది. అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే. ఇది కేవలం హాస్య చమత్కారమా? లేక తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఆలోచనలకు సంబంధించిన సంకేతమా? అనే విధమైన చర్చకు దారి తీసింది.
గుజరాత్‌కు ఇచ్చింది మీకూ ఇస్తాను.. కానీ
హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ వేదికపై రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో ‘మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు ఇచ్చిన మద్దతు మాదిరిగానే తెలంగాణకు కూడా సహకరించాలి’ అని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ‘తెలంగాణ మోడల్ అభివృద్ధి’ గురించి కూడా మాట్లాడారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీకి చెందిన ప్రధానిని బహిరంగంగా ప్రశంసిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోరడం రాజకీయంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చింది. దానికి మోదీ ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. ‘గుజరాత్‌కు ఇచ్చింది మీకూ ఇస్తాను.. కానీ అప్పుడు మీ రాష్ట్రానికి ఇప్పుడున్న దానికంటే తక్కువే వస్తుంది. అందుకే మీరు నాతో చేరితే మంచిది’ అని నవ్వుతూ అన్నారు. పైకి ఇది సరదా వ్యాఖ్యలా కనిపించినా, దానిలో చమత్కారంగా కనిపించే రాజకీయ చాతుర్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆకర్ష్ మంత్రం!
ఎందుకంటే బీజేపీ రాజకీయ వ్యూహాన్ని గమనిస్తే, ప్రాంతీయ లేదా కాంగ్రెస్ నాయకత్వంలో బలంగా ఎదుగుతున్న నేతలను తమ వైపు తిప్పుకోవడం కొత్త విషయం కాదు. హిమంత బిశ్వ శర్మ నుంచి జ్యోతిరాదిత్య సింధియా వరకు అనేక ఉదాహరణలున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లో భవిష్యత్ ఉన్న నేతలను గుర్తించి, వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ తమ రాజకీయ విస్తరణకు ఉపయోగిం చుకోవడం బీజేపీ అమలు చేస్తున్న విజయవంతమైన వ్యూహం. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు ప్రధాన బలం రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే సమయంలో బీజేపీ తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ వంటి దూకుడు, ప్రజాకర్షణ, రాజకీయ చాతుర్యం ఉన్న నాయకుడిపై బీజేపీ ఆసక్తి చూపడం అసాధారణం కాదు. అయితే దీనిని “రేవంత్ బీజేపీలోకి వెళ్తున్నారు” అనే స్థాయికి తీసుకెళ్లడం కూడా అతిశయోక్తే అవుతుంది.
రాజకీయాల్లో ‘సిగ్నల్స్’ కి విలువ జాస్తి!
ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో అత్యంత కీలక స్థాయిలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ ఆయన నాయకత్వంతో ముడిపడి ఉంది. అలాంటి సమయంలో పార్టీ మార్పు రాజకీయంగా ఆయనకు కూడా ప్రమాదకరమే. అంతేకాదు, రేవంత్.. బీజేపీతో పోటీ పడుతూ ఎదిగిన నాయకుడే గానీ, బీజేపీతో సన్నిహితంగా గుర్తింపు పొందిన నాయకుడు కాదు. అయితే రాజ కీయాల్లో ‘సిగ్నల్స్’ కి విలువ ఉంటుంది. మోడీ వ్యాఖ్యలో కనిపించింది అదే, ఒకవైపు సరదా వ్యాఖ్య, మరోవైపు రాజకీయ ఆహ్వానం, ఇంకోవైపు కాంగ్రెస్‌కు మానసిక సందేశం. ‘అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడవాలి’ అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా అందులో కనిపించింది. ఇక్కడ మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. తెలంగాణలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కవిత కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ కొంత బలహీన పడింద నుకోవడం సహజమే, ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష రాజకీయ పోటీ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ, రేవంత్ వేదిక పంచుకోవడం, పరస్పర ప్రశంసలు, సానుకూల వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారితీయడం సహజం.
ఈ చిన్న వ్యాఖ్యతో దేశవ్యాప్తంగా చర్చ!
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ‘తెలంగాణ అభివృద్ధికి రెండు గంటలు సమయం ఇవ్వండి’ అని కోరడం, మోడీ కూడా ఘాటైన రాజకీయ విమర్శలు చేయకుండా స్పందించడం ఢిల్లీ-హైదరాబాద్ సంబంధాల్లో మారుతున్న రాజకీయ భాషను సూచిస్తోంది. అయితే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సహకారాన్ని రాజకీయ విలీనాలతో కలపడం సరైన పద్ధతి కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర సహకారం కోరితే అది రాజ్యాంగబద్ధ సమాఖ్య వ్యవస్థలో భాగం. దానిని ‘నాతో చేరండి’ అనే రాజకీయ సంకేతంగా మార్చడం బీజేపీ రాజకీయ శైలికి అనుగుణంగా కనిపించినా, సమాఖ్య భావనకు పూర్తిగా అనుకూలం కాదు. కానీ రాజ కీయంగా చూస్తే మోడీ వ్యాఖ్య విజయవంతమైంది. ఎందుకంటే ఒక సరదా వ్యాఖ్య దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైంది. అదే మోడీ రాజకీయ కమ్యూనికేషన్ ప్రత్యేకత. ఒక చిన్న వ్యాఖ్యతో ప్రత్యర్థి పార్టీల్లో ఊహాగానాలు రేకెత్తించడం, మీడియా దృష్టిని ఆకర్షించడం, రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇవన్నీ బీజేపీ అత్యంత సమర్థంగా ఉపయోగిస్తున్న రాజకీయ పద్ధతులు..
రేవంత్‌పై బీజేపీ దృష్టి పడిందా?
అంతిమంగా చెప్పాలంటే మోడీ వ్యాఖ్యను కేవలం సరదాగా తీసేసేంత అమాయకత్వం రాజకీయాల్లో ఉండదు. అలాగే దాన్ని తక్షణ రాజకీయ ఆహ్వానంగా భావించేంత సరళత కూడా ఉండదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షిస్తున్న నాయకుడుగా ఎదుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం దృష్టి అతనిపై పడిందేమోనన్న అనుమానాలనూ కొట్టివేయడానికి లేదు. వెంటనే కాకున్నా వచ్చే ఎన్నికల నాటికైనా పనికొస్తాయని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు, యాధృచ్ఛికమూ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
-ఉదయ్
83676 03197






