- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులకు స్వాగతం
సాయుధపోరుకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం.

సాయుధపోరుకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం. ఆధునిక ప్రపంచంలో ఎక్కడా సాయుధపోరాటాలకు, విముక్తి ఉద్యమాలకు చోటు లేదు. ఆయా దేశాల్లోని సమకాలీన రాజకీయ స్థితిగతులే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆలస్యంగానైనా భారత మావోయిస్టులు తమ పంథా మార్చుకుని సాయుధ పోరుకు స్వస్తి పలికి సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావటం వారి వారి కుటుంబాలకు, దేశానికి శుభపరిణామం. ఆలస్యంగానైనా హింసను విడనాడి, వాస్తవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, ప్రజాస్వామ్య పంథాను స్వీకరించట సరైన నిర్ణయం. పీపుల్స్ వార్, మావోయిజం పేరుతో 50 ఏళ్లుగా యువత అడవుల బాట పట్టింది. పోలీసులు, ఉద్యమకారులు వేలాది మంది ఈ సంఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు.
దేశం కోల్పోయిన మేధస్సు
వేలాది కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఎంతో మంది తల్లుల కడుపుకోత వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివాద వామపక్ష ఉద్యమాల బాధితులు లక్షల్లోనే ఉంటారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయిలో ఎంతో మంది రాజకీయ నాయకత్వం ప్రాణాలు కోల్పోయింది. ఫలితంగా ఎంతో భవిష్యత్తు, మేధస్సు కలిగిన యువతను భారత దేశం కోల్పోయింది. తద్వారా నవభారత నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. మావోయిజానికి ప్రస్తుతం ముగింపు సమయం. సిద్ధాంత వైరుధ్యాలున్నప్పటికీ మావోయిస్టుల మేధస్సు ఈ దేశ నిర్మాణానికి అవసరం. అయితే భారతీయ మూలాలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వారి మేధస్సును నవభారత నిర్మాణానికి తోడ్పాటునందించాల్సి ఉంటుంది. వేగవంతమైన నేషన్ బిల్డింగ్‌కు మావోయిజం వంటి సాయుధ పోరాట సిద్ధాంతాలకు చోటే లేదు.
దేశం మరిచిపోలేని గాయాలు
దశాబ్దాలుగా మావోయిస్టుల పేరుతో జరిగిన హింస, అరణ్యాలలో నిష్కల్మషంగా జీవించే ఆదివాసీల రక్తపాతం.. ఇవి ఈ దేశం మరిచిపోలేని గాయాలు. కానీ ఆ గాయాలు మానుతున్నాయి. పీడిత వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నామనే ముసుగులో అడవులను తమ రాజ్యంగా మార్చుకున్న మావోయిస్టులు, చివరికి అమాయక యువతను తుపాకీ దారి పట్టించి మరణాలకు కారణమయ్యారు. గత యైబై ఏళ్లలో వేలాది ఆదివాసి, దళిత, బహుజన యువత మావోయిజం అనే మాయలోపడి అకాల మరణం చెందారు. ఈ రక్తపాతం ఎవరి కోసం ఏ సిద్ధాంతం కోసం ఎవరి భవిష్యత్తు కోసం.. అధునాతన యుగంలో సాయుధ పోరాటం ఏ సమస్యకూ సమాధానం కాదు. అభివృద్ధి కావాలంటే తుపాకీలు కాదు.. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, మార్కెట్లు, ఇన్నోవేషన్ సెంటర్లు కావాలి. మావోయిజం ఇవేవీ ఇవ్వలేదు. పైగా దేశాన్ని దశాబ్దాల వెనక్కి లాక్కెళ్లింది. మావోయిస్టు కార్యకలాపాలు దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరుకోవటం మంచిదే.
ఏ సిద్దాంతమైన కాలంతో పాటు మారాలి. సమకాలీన పరిస్థితులను అవలోకనం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా మనం తీసుకునే నిర్ణయాలు సమాజానికి మేలు చేకూర్చేలా ఉండాలి. వందేళ్ల క్రితం, యాభై ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. కూడు, గూడు, గుడ్డ నినాదాలు ప్రస్తుతం జనబాహుళ్యంలో లేనే లేవు. ఆశించిన దానికన్నా ఎన్నో రెట్లు ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయి. మెజార్టీ ప్రజలు సంతృప్త జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా కొంత వెనకబాటు అక్కడక్కడా ఉన్నా.... వారి భద్రత, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. ఓ స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేశంలోని పౌరులంతా గౌరవంగా, గర్వంగా బతికేందుకు ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులే అందుకు ఉదాహరణ.
మావోయిస్టుల భాగస్వామ్యం
మరింత అభివృద్ధి కోసం మావోయిస్టులూ ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయాలి. ఏ సిద్ధాంతమైనా కాలంతోపాటు మారాల్సిందే. మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రణాళికలు విజయం సాధించాయి. హార్ట్ అండ్ మైండ్ స్ట్రాటజీ ద్వారా గ్రామస్తుల విశ్వాసాన్ని పొందడం, వారికి అభివృద్ధి ప్రయోజనాలు అందించటం తద్వారా మావోయిస్టులు కల్పించిన భయాన్ని తొలగించడంలో విజయం సాధించాయి. అడవిలో మొదటిసారి వచ్చిన మొబైల్ నెట్‌వర్క్, గ్రామంలో మొదటిసారి వచ్చిన రహదారి, మొదటిసారి వచ్చిన వైద్య శిబిరం… ఇవన్నీ గ్రామస్తుల జీవితాన్ని మార్చాయి. గ్రామాల్లో విద్య, వైద్యం, నీరు, రహదారులు, ఉచిత గ్యాస్, డిజిటల్ కనెక్టివిటీ... అన్నీ కలిసి ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని సృష్టించాయి. ఈ మార్పులన్నీ మావోయిస్టు విముక్త భారత్ కు బాటలు వేశాయి. ఇక త్వరలోనే మావోయిస్టు విముక్త భారత్ దిశగా భారత్ నిలబడటం ఖాయం.
ప్రజాస్వామ్య వికాసం
భారతదేశం నేడు ప్రపంచానికి మార్గదర్శకంగా దిశగా ఎదుగుతోంది. అంతరిక్ష పరిశోధనా సాంకేతికత, డిజిటల్ పాలన, గ్రామీణ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సహా ప్రతి అంశంలోనూ మూడు రంగుల జెండా రెపరెపలాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేగాన్ని అడ్డుకునే శక్తులు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాయి. ఇకపై మావోయిజం కాదు... అభివృద్ధి చరిత్ర రాయబోతుంది. అసహజ హింస కాదు... ప్రజాస్వామ్య వికాసమే దేశాన్ని ముందుకు నడపబోతుంది. స్వర్ణయుగం కేవలం కళ కాదు. సనాతన మూలాలున్న ఆధునిక భారతదేశం దాన్ని ఆహ్వానిస్తోంది. అదే నూతన భారతం. అదే మోదీ యుగం., అదే ప్రజల ఆశయం. ఈ దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకీ... చరిత్ర కాలగర్భంలో కలిసిపోవాల్సిందే.
జీవన్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు
ఓయూలో పరిశోధక విద్యార్థి,
88850 99930






