- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనం నోబెల్ సృష్టించే దేశం కావాలి.. భారత విద్య, పరిశోధన, ఆలోచనపై ఒక ఆత్మపరిశీలన
ప్రతీ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే మాట వినిపిస్తుంది. నోబెల్ బహుమతి ఎవరికొచ్చిందని? పలు విభాగాల్లో ప్రపంచంలోని మేధావులకు ఇచ్చే

ప్రతీ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే మాట వినిపిస్తుంది. నోబెల్ బహుమతి ఎవరికొచ్చిందని? పలు విభాగాల్లో ప్రపంచంలోని మేధావులకు ఇచ్చే ఈ బహుమతి మానవతా ప్రగతికి ప్రతీక. అయితే ప్రశ్న ఒక్కటే.. 140 కోట్ల భారతీయులలో ఎందుకు తరచూ నోబెల్ గ్రహీతలు లేకపోతున్నారు? ఉన్నా, కొద్దిమంది మాత్రమే. ఈ వందేళ్లలో అతి తక్కువ సంఖ్య, ఇది మనకు గర్వకారణం కాకుండా ఆత్మ పరిశీలనకు ఆహ్వానం.
నోబెల్ బహుమతి అంటే కేవలం ఒక పతకం కాదు. అది మానవ మేధస్సుకు ఇచ్చే గౌరవం. అది ఒక దేశం ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తుందో, పరిశోధనలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పే సూచిక. నోబెల్ అవార్డు సాధన అంటే ‘ప్రపంచానికి ఉపయోగపడే ఆలోచన’ ఇవ్వడం. అది శాస్త్రం కావొచ్చు, సాహిత్యం కావొచ్చు, లేదా మానవ సేవ కావొచ్చు. అందుకే నోబెల్ సాధించడమంటే దేశం ఆలోచనా శక్తి, పరిశోధన మౌలికత, మానవతా దృక్పథం కలయిక. ప్రపంచ వేదికపై భారతదేశం ఒక విజ్ఞాన శక్తిగా నిలవాలంటే, అంతర్జాతీయ గుర్తింపు అనేది ప్రేరణ, ప్రతిష్ట, ప్రగతికి మూలం.
యూదులకు 20 అవార్డులు.. ఎలా?
చిన్న ప్రజాసంఖ్య కలిగిన యూదులు ప్రపంచ నోబెల్ గ్రహీతల్లో 20 శాతం పైగా ఉన్నారు. కారణం వారు విచారణాత్మక విద్యా పద్ధతి అవలంబిస్తుండటం. అనగా యూదుల తల్లిదండ్రులు పిల్లల్ని ‘ఎందుకు’ అనే ప్రశ్న అడగమని నేర్పుతారు. ప్రశ్నించడం వారి సంస్కృతిలో భాగం. పరిశోధన వాతావరణం కల్పిస్తారు. చిన్న వయస్సు నుండే ప్రయోగాలు, సృజనాత్మకత, పుస్తకాల పట్ల ఆసక్తి పెంచడం. మతం కన్నా మేధస్సుకు విలువ ఇస్తారు. వారు మతాన్ని కూడా తర్కబద్ధంగా పరిగణిస్తారు. వారిది విభిన్న అభిప్రాయాలు స్వీకరించగలిగే సామాజిక వ్యవస్థ. ఇది మనదేశానికి పెద్ద పాఠం. భారత దేశంలో కూడా పిల్లలకు ‘జ్ఞానం సంపాదించడంతో’ పాటు ఆలోచించడం నేర్పిస్తే, మన దగ్గర నుండే నోబెల్‌ను సంపాదించే శాస్త్రవేత్తలు పుట్టొచ్చు.
మన విద్యా వ్యవస్థ ఎక్కడ తప్పుతోంది?
భారత విద్యా వ్యవస్థలో ప్రతిభ ఉంది కానీ స్వేచ్ఛ లేదు. మనం విద్యార్థులను ‘సమాధానం చెప్పడం నేర్పిస్తాం’, ‘ప్రశ్నించడం’ కాదు. సిలబస్ ఆధారిత పరీక్షలు ఆలోచనను ఆపేస్తున్నాయి. పరిశోధన అనేది పుస్తకాలకే పరిమితం అవుతోంది. ప్రశ్నించడం నేర్పిస్తే నోబెల్ స్థాయి ఆలోచన అక్కడే పుడతాయి. ప్రశ్నించడం నేర్చిన మనసుల్లో పరిమితులు దాటిన ఆలోచనలు పుడతాయి. మరికొన్ని లోపాలు పరిశోధనకు తగిన నిధుల లేమి. నిజానికి విద్య అంటే మనిషి ‘తెలిసినదానిని మరింత లోతుగా తెలుసుకోవడం’. కానీ మన విద్య ‘ఉద్యోగం’ అనే లక్ష్యా నికి పరిమితమవుతోంది.
వసతుల లేమి.. కాంతి లేని దీపం
దేశంలో ప్రతిభ ఉన్నా, మౌలిక వసతులు లేకపోతే అది కాంతి లేని దీపం లాంటిది. ప్రభుత్వం పరిశోధనలకు నిధుల పెంపు చేయాలి. యూరప్ లేదా అమెరికా వంటి దేశాల్లో GDPలో 2–3% పరిశోధనకు కేటాయిస్తారు. మన దగ్గర అది 0.7% కంటే తక్కువ. యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహక పథకాలు. ప్రపంచ స్థాయి ల్యాబ్‌లు, విశ్వవిద్యాలయాలు నిర్మాణం. పరిశ్రమలు, విద్యాసంస్థలు కలసి పరిశోధన చేయగలగాలి. నోబెల్ బహుమతి గెలవడం కంటే, దానికి తగిన వాతావరణం సృష్టించడం ప్రభుత్వ బాధ్యత. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించే విధానం అస్థిరం, రాజకీయ ప్రయోజనాల కోసం ‘పరిశోధన’ కూడా ప్రదర్శనగా మారిపోతుంది. నోబెల్ బహుమతి కేవలం మేధస్సుకే కాదు. స్వేచ్ఛ, సదుపాయాలు, సహకారం వంటి వాతావరణానికి గుర్తింపు. మన దేశంలో ఆ వాతావరణం కొరవడింది.
ఎన్ని మార్కులు వస్తాయి?
సమాజం కూడా విద్యార్థులను ‘ఉద్యోగం కోసం’ కాకుండా ‘ఆవిష్కరణ కోసం’ ప్రోత్సహించాలి. పిల్లవాడు రోబో తయారు చేస్తే ‘ఎన్ని మార్కులు వస్తాయి?’ అని అడగకూడదు. ‘ఇది ఎలా పనిచేస్తుందని అడగాలి. పరి శోధనలో విఫలం అయినా, ప్రయత్నాన్ని గౌరవించాలి. విఫలతను అవమానంగా కాకుండా, ఆవిష్కరణకు దారితీసే మెట్టుగా చూడాలి. ప్రాచీన భారతంలో తక్షశిల, నలందా వంటి విశ్వవిద్యాలయాలు మేధస్సుకు ఆలయాలు.. ఇప్పుడు ఆ వైభవం తిరిగి తీసుకురావాలి.
నోబెల్ సృష్టించే దేశం కావాలి..
భారతీయుల ప్రతిభ ప్రపంచమంతా ఉన్నది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం వంటి సంస్థలను మన వారే నడిపిస్తున్నారు. అయితే ఎందుకు మనం స్వదేశంలో శాస్త్ర సాంకే తిక నోబెల్ గ్రహీతలను సృష్టించలేకపోతున్నాం? అంటే అది ‘వ్యవస్థా లోపం’. ప్రపంచ వేదికపై నిలవాలంటే విద్యార్థి ఆలోచనకు అవకాశం ఇవ్వాలి. అంటే విద్యలో స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే అవకాశం కల్పించాలి. పరి శోధనలకు ప్రోత్సాహం కల్పించాలి. మేధస్సుకు గౌరవం ఇవ్వాలి. ఇలా చేస్తే భారతదేశం ‘నోబెల్ కోసం ఎదురుచూ సే దేశం’ కాకుండా ‘నోబెల్ సృష్టించే దేశం’ అవుతుంది.
మనకు నోబెల్ కష్టమేమమీ కాదు..
నోబెల్ బహుమతి అనేది మానవ మేధస్సుకు శాసనం. మనకు అది రావడం కష్టం కాదు, కానీ మనలోని ప్రశ్నించే శక్తిని మేల్కొలపడం అత్యవసరం. యూదులు చిన్న దేశమై కూడా ప్రపంచాన్ని మలిస్తే, మనం ఎందుకు వెనుక బడాలి? ప్రభుత్వం ప్రోత్సాహం, విద్యా వ్యవస్థ సవరణ, సమాజం ఆలోచనా స్వేచ్ఛ. ఈ మూడు కలిస్తే భారత భవిష్యత్తు ప్రకాశిస్తుంది. నోబెల్ బహుమతి మనకు దూరంగా లేదు, కానీ మన ఆలోచనలకు తగిన దిశ అవసరం.
-కమలహాసన్ తుమ్మ
95056 18252






