- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేడిమి వైపరీత్యాన్ని ఎదుర్కోవాలి!
ఎల్ నినో ప్రభావంతో పెరుగుతున్న తీవ్రమైన ఎండలు, వడదెబ్బ ప్రమాదాలు, పేదలు మరియు కార్మికులపై ప్రభావం, అలాగే ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై విశ్లేషణాత్మక వ్యాసం.

ఎల్ నినో పుణ్యాన ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నాయి.. ఈ ఎండలు రెండు నెలల పాటు ఇలాగే ఉండేలా ఉన్నాయి. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ విషయమై హెచ్చరించింది. ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సూచనలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గతంలో కన్నా వడదెబ్బల మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి కానీ అనారోగ్య సమస్య మాత్రం తీవ్రంగానే ఉంది. ఉదయం నుండే ఎండ తీవ్రత పెరిగి ఏ రోజూ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉండడం లేదు సరికదా మునుపటి కన్నా ఎక్కువ ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కొన్ని అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందులో ముఖ్యంగా ఈ రెండు నెలల పాటు పెన్షన్లు, ప్రజా పంపిణీ ద్వారా అందించే నిత్యావసర సరుకులు లబ్ధిదారుల ఇంటికే పంపించే ఏర్పాట్లు చెయ్యాలి. ఎక్కువ వడదెబ్బకు గురయ్యేది పేదలు, చిన్నచిన్న తోపుడు బళ్లు, డెలివరీ బాయ్స్, కార్మికులు, ఈ తరహా వీధి వర్తకులు, ఉపాధి హామీ వినియోగించుకునే వాళ్లు, వ్యవసాయ కార్మికులు.. ఇళ్లు వదిలి ఎండలోకి రాక తప్పని వీరి కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. పనివేళల మార్పు మొదలుకొని, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, టెంట్లు, మజ్జిగ పంపిణీ చేపట్టాలి. ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ విరివిగా అందుబాటులో ఉంచాలి. ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించడంతో పాటు స్థానిక యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉమ్మడిగా పని చేయాలి. కరోనా లాంటి ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొన్న తీరులోనే ఈ వేడిమి వైపరీత్యాన్ని ఎదుర్కోవాలి. సమగ్రమైన ప్రణాళిక, సమన్వయంతో కూడిన పనితీరుతోనే ఈ విపత్తును దాటగలం. ప్రస్తుతం ఎదురవుతున్న ఈ తీవ్రమైన ఉష్ణ పరిస్థితులు సాధారణ కాలానుగుణ మార్పులు కాదు, ఒక పెద్ద సామాజిక, ఆర్థిక సవాలు. ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దెబ్బతినకుండా ఉండాలంటే ప్రభుత్వం, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకు రావాలి. ముందస్తు ప్రణాళికలు, సమయోచిత చర్యలు, ప్రజల సహకారం కలిసొస్తేనే ఈ వేడి విపత్తును విజయవంతంగా ఎదుర్కోవచ్చు.
-డా. డి.వి.జి.శంకర రావు,
94408 36931






