- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదరికం తగ్గించాం.. కానీ సమానత్వం?
పేదరిక నిర్మూలన.. మానవ సమాజ గౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం చూపించే ఒక చైతన్య సంకేతం. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం రోజుకు $2.15

పేదరిక నిర్మూలన.. మానవ సమాజ గౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం చూపించే ఒక చైతన్య సంకేతం. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం రోజుకు $2.15 కంటే తక్కువ సంపాదించే వారు తీవ్రమైన పేదరికంలో ఉన్నవారిగా పరిగణించబడతారు. ప్రపంచ జనాభాలో సుమారు 9% మంది ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. పేదరికం అనేది కేవలం ఆర్థిక లోపం కాదు. అది విద్య, ఆరోగ్యం, ఉపాధి, గౌరవ జీవితం అందకపోవడంలో ఉన్న లోటు. అందుకే పేదరిక నిర్మూలనను మానవ హక్కుల రక్షణగా చూడాలి.
పేదరికానికి కారణాలు..
పేదరికానికి విద్యాలోపం, నిరుద్యోగం, వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు, అవినీతి, గ్రామీణ నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రధాన కారణాలు.. కొద్దిమంది వద్దే సంపద కేంద్రీకరణ కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కొరత, మహిళల ఆర్థిక భాగస్వామ్యం తక్కువగా ఉండటం పేదరికాన్ని మరింతగా పెంచుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, సాంకేతికత అందుబాటులో లేకపోవడం కూడా గ్రామీణ పేదరికానికి దారి తీస్తున్నాయి. ఇవి కేవలం ఆర్థిక సవాళ్లు మాత్రమే కాదు. సమాజంలో సమానావకాశాల లోపానికి సంకేతాలు.
పారదర్శక విధానాల ద్వారా..
పేదరిక నిర్మూలనలో చైనా 1980ల నుండి విద్యా, పరిశ్రమ, గ్రామీణ అభివృద్ధి చర్యలతో 40 కోట్ల మందికి పైగా పేదరికం నుండి బయటపడవేయగలిగింది. బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ స్థాపించిన గ్రామీణ బ్యాంక్ సూక్ష్మ రుణాల ద్వారా మహిళా సాధికారతను పెంచి లక్షల కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. బ్రెజిల్‌లో బోల్సా ఫామిలియా పథకం పేద కుటుంబాలకు ఆర్థిక మద్దతు, పిల్లల విద్యపై దృష్టి, మహిళా ప్రాధాన్యతతో సామాజిక మార్పును తెచ్చింది. వియత్నాం 1990 నుండి వ్యవసాయ సంస్కరణలు, విద్యా విస్తరణ, వాణిజ్య విప్లవం ద్వారా పేదరికాన్ని 60% నుండి 6%కు తగ్గించింది. రువాండా ‘విజన్ 2020’ ప్రణాళిక ద్వారా గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక సమానత్వం సాధించింది. ఈ విజయాల వెనక సంకల్పం, ప్రజల భాగస్వామ్యం, పారదర్శక విధానాల సమన్వయంతోనే పేదరిక నిర్మూలన గణనీయ స్థాయిలో తగ్గింది.
గత మూడు దశాబ్దాల్లో..
భారతదేశం పేదరిక నిర్మూలనలో అనేక కీలక పథకాలను అమలు చేస్తోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి ఉపాధి లభించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు గృహ నిర్మాణ సహాయం అందించి గౌరవ జీవనానికి మార్గం సుగమమైంది. ప్రధానమంత్రి కౌశల్ యోజన, జన్ ధన్ యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, పీఎం ఉజ్వల యోజన, అయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు ఆర్థిక, ఆరోగ్య, జీవన భద్రత కల్పించాయి. భారతదేశం గత మూడు దశాబ్దాల్లో 30 కోట్ల మందికి పైగా పేదరికం నుండి బయటపడేలా చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక పేదరిక నిర్మూలన సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచింది.
అందరికీ సమాన అవకాశాలు లభిస్తేనే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తర్వాత పేదరికం మళ్లీ పెరిగినప్పటికీ, విద్య, ఉపాధి, మహిళా సాధికారత పట్ల కట్టుబాటు ఉన్న దేశాలు త్వరగా పునరుద్ధరణ సాధించాయి. భారతదేశం కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందుకు సాగుతోంది. ప్రతి పౌరుడు ఆహార వ్యర్థాన్ని తగ్గించడం, విద్యా సహాయం అందించడం, గ్రామీణ వృత్తి శిక్షణకు మద్దతు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఈ యజ్ఞంలో భాగస్వామి కావాలి. పేదరికం లేకపోవడం అంటే గౌరవం, స్వాభిమానం, సమాన అవకాశాలు అందరికీ లభించడం. మానవతతో కూడిన సమాజం, ఆకలి లేని ప్రపంచం. అదే పేదరిక నిర్మూలన అసలైన విజయం.
-వెంకటరమణ గౌడ్ గిలకత్తుల
98668 78769






