సమాజాన్ని కాపాడుకోవాల్సింది మనమే!

by Ravi |   (  Updated:2025-07-08 00:31:25  IST  )

పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎటు చూసినా, ఎటు విన్నా, ఏం మాట్లాడినా.. దేశ వ్యాప్తంగా హత్యలు

సమాజాన్ని కాపాడుకోవాల్సింది మనమే!
X

పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎటు చూసినా, ఎటు విన్నా, ఏం మాట్లాడినా.. దేశ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలతో కాలం గడిచిపోతున్నది. అనేక హృదయ విచారక ఘటనలు మనుషుల హృదయాలను పిండేస్తున్నాయి. మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయి. మానవీయ విలువలు మట్టిలో కలిసిపోతున్నాయి. సమాజంలో బంధాలు, బంధుత్వాలు, ప్రేమాను రాగాలు, నమ్మకాలు, విశ్వాసం, ఆప్యాయత అనురాగాలు ఇవి ఏమీ లేకుండా ఈ సమాజం ముందుకు పోతుంది. రోజు మన కండ్ల ముందు అనేక ఘటనలు జరుగుతున్నా చట్టాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నాయి? అనుకునే బదులు మనం ఏం చేస్తున్నాం? అని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైనది.

కొన్ని సంవత్సరాల క్రితం గ్రామాలలో వీధివీధికీ కొన్ని కుటుంబాలు ఒకచోట చేరి ఒకరినొకరు గౌరవించుకుంటూ, కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఆ రోజులు ఇప్పుడు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలలో కూడా మనుషులు మృగాల్లా మారుతున్నారు. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియా వల్ల చెడు ఎక్కువైంది. అందుకే అవి చెడును చూయించకుండా ప్రభుత్వం నిబంధన పెట్టాలి. బంధాలు, బంధుత్వాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. విద్యార్థులు, యువతీ యువకులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి మానవీయ విలువల పట్ల, సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల అవగాహన కల్పించాలి. చెడు వ్యసనాలకు అలవాట్లకు విద్యార్థులను యువతను గురి కాకుండా చూసుకోవాలి. యువత పెడదోవ పట్టకుండా కౌన్సిలింగ్‌లు నిర్వహించాలి. గ్రామాల్లో బహిరంగంగా మానవ సంబంధాలతో పాటు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించేందుకు గ్రామ పంచాయతీలో ఒక వేదికను ఏర్పాటు చేయాలి. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది.

-గడగోజు రవీంద్రాచారి

98487 72232

Next Story