WAVES summit: మన కళలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడానికే..

by Ravi |   (  Updated:2025-05-02 00:45:45  IST  )

ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగను న్న ప్రతిష్టాత్మకమైన Waves 2025 (వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

WAVES summit: మన కళలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడానికే..
X

ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగను న్న ప్రతిష్టాత్మకమైన Waves 2025 (వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌) కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ నిన్న లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నాంది పలికింది. ఈ సందర్భంగా మోడీ ‘వేవ్స్‌’ అనేది కేవలం కొన్ని అక్షరాల సమూహం మాత్రమే కాదని సంస్కృతి, సృజనాత్మకత, సార్వత్రిక అనుసంధానం అని చెప్పారు. సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్‌’ అవార్డులను ప్రవేశపెట్టనున్నామని, ప్రతిష్టాత్మక స్థాయిలో వీటిని అందించనున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు భారతీయ సినిమాను పరిచయం చేసిన సత్యజిత్ రే, రాజ్‌ కపూర్‌, రాజమౌళి, ఏఆర్‌ రెహమాన్‌ వంటి ప్రముఖులను ప్రధాని ప్రశంసించారు.

తొలి గ్లోబల్ సమ్మిట్

భారతదేశాన్ని ప్రపంచంలో ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సృజనాత్మక శక్తిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం WAVES అనే వ్యూహాత్మక విజన్‌ని ఆవిష్కరించింది. ప్రధానంగా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ విస్తరణ, ప్రపంచ స్థాయి సాంస్కృతిక ప్రాచుర్యంపై ఇది దృష్టి సారిస్తోంది. ఈ దృష్టిని మరింత బలోపేతం చేయడానికి, ముంబైలో ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ జరుగుతోంది. ఇది భారతదేశంలో జరిగే మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ కావడం విశేషం. ఈ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి మీడియా సీఈఓలు, వినోద రంగంలోని అగ్రతారలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక కలిగిన ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది.

ఆరెంజ్ ఎకానమీకి నాంది

ఈ సమ్మిట్ భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ప్రపంచ వేదికగా ఉపయోగపడుతుంది, ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో వివిధ దేశాలమధ్య సహకారాలను పెంపొందిస్తుంది. యానిమేషన్, గేమింగ్, వినోద సాంకేతికత, ప్రాంతీయ, ప్రధాన స్రవంతి సినిమాల్లో భారతదేశ పురోగతిని కూడా ప్రపంచ యవనికపై ప్రతిబింబించేటట్లు తోడ్పాటును అందిస్తుంది. దేశం సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, కంటెంట్ సృష్టి, మేధో సంపత్తి సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా దాని స్థానాన్ని విస్తృతం చేయడానికి సిద్ధంగా ఉంది. బ్రాడ్‌కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, జనరేటివ్ AI, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (XR) వంటి పరిశ్రమలు, రంగాలపై ఇది దృష్టి సారించనుంది.

ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లేందుకు..

వినోదం, భారతీయ సినిమాలు, సంగీతం, నాటక కళలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం, ఫిల్మ్ టూరిజం, డిజిటల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం. కళలు, జానపద కళలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించడం. సృజనాత్మక సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ శిఖరాగ్ర సమావేశం ముందడుగు వేస్తోంది. వేవ్స్ ద్వారా, భారత్ ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. ఇది దేశానికి సాంస్కృతికంగా మాత్రమే కాక, వాణిజ్యపరంగా, సాంకేతికంగా కూడా ఓ కొత్త దారి తీసుకొస్తోంది. దేశ సృజనాత్మక సమాజం క్రియాశీల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు దేశ యువత ఉత్సాహాన్నిచ్చే కీలకమైన చోదక శక్తిగా WAVES కీలక భూమిక పోషించగలదు.

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story