- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ అగ్ని ప్రమాదం యాదృచ్ఛికమేనా?
తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సాధారణ ఘటనగా పరి గణించడానికి వీలులేని విషయం. నేర విచారణల్లో కీలకమైన ఆధారాలు, విలువైన రికార్డులు, డిజిటల్ డేటా భద్ర పరచబడే అత్యంత సున్నితమైన సంస్థలో ఈ తరహా ఘటన జరగడం రాష్ట్ర భద్రతా వ్యవస్థలపై, పాలనా నైతికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సాధారణ ఘటనగా పరి గణించడానికి వీలులేని విషయం. నేర విచారణల్లో కీలకమైన ఆధారాలు, విలువైన రికార్డులు, డిజిటల్ డేటా భద్ర పరచబడే అత్యంత సున్నితమైన సంస్థలో ఈ తరహా ఘటన జరగడం రాష్ట్ర భద్రతా వ్యవస్థలపై, పాలనా నైతికతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది నేరస్తులను గుర్తించేందుకు, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఆధారమైన వ్యవస్థ. అలాంటి వ్యవస్థే అగ్నికి ఆహుతి కావడం అంటే న్యాయ ప్రక్రియకు తూట్లు పొడిచినట్లే. ఇది కేవలం ప్రమాదమా? లేక ఒక పథకం ప్రకారం ఆధారాలను నాశనం చేసే ప్రయత్నమా? అనే సందేహాలు ప్రజల మనసుల్లో సహజంగానే తలెత్తుతున్నాయి..
ప్రమాదంలో మన భద్రత..
హైదరాబాద్ నగరం దేశంలోనే భద్రత, వాతావరణం, భౌగోళిక స్థిరత్వం పరంగా విశ్వసనీయమైన నగరంగా పేరుగాంచింది. అందుకే అనేక అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ కీలక డేటా సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి. అలాంటి నగరంలోనే అత్యంత భద్రత ఉండాల్సిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరగడం ‘రాష్ట్రంలో నిజంగా భద్రత ఉందా?’ అనే సందేహాన్ని ప్రపంచానికి పంపుతోంది. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు ఈ ల్యాబ్‌లో ఉన్నాయనే వాస్తవం అనుమానాలకు మరింత బలం చేకూ రుస్తోంది. వోటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వంటి కీలక రాజకీయ కేసుల్లోని వాయిస్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను తొలగించేందుకే ఈ అగ్నిప్రమాదం జరిగిందా అన్న అనుమానం పూర్తిగా నిరాధారమని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
గొర్రెల స్కాం నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా..
ఇది మొదటిసారి కాదు. గతంలో గొర్రెల స్కామ్ వెలుగులోకి వచ్చిన సమయంలో ఒక మాజీ మంత్రి కార్యాలయం అగ్నికి ఆహుతి కావడం, అలాగే సచివాలయంలోని రికార్డుల గది కాలిపోవడం వంటి ఘటనలు కూడా ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయి. కీలక కుంభకోణాలు బయటపడే వేళ రికార్డులు కాలిపోవడం యాదృచ్ఛికమని ఎలా నమ్మాలి? ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ఘటనపై పౌర సమాజం, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. కానీ ఇంత తీవ్రమైన అంశంపైనా మౌనం పాటించడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.
నిజాన్నే ధ్వంసం చేసినట్లయితే...
ఈ అగ్నిప్రమాదం ప్రభుత్వ భద్రతా వైఫల్యానికే కాకుండా, పాలనా సమర్థత లోపానికి నిదర్శనంగా కనిపి స్తోంది. ఆధారాల సంరక్షణలో ప్రభుత్వం విఫలమైతే, వ్యవస్థలపై ప్రజల నమ్మకం పోతుంది. నిజ నిర్థారణ సంస్థలు సాక్షాలను భద్రపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే అంతిమంగా నిజాన్నే ధ్వంసం చేసినట్లే కదా? ఏది ఏమైన విచారణలు కీలక దశలో చేరుకుంటున్న సమయంలో సాక్ష్యాలు ధ్వంసం కావడం పాలకుల నీతిని శంకించే పరిస్థి నెలకొన్నది. ప్రభుత్వ శ్రేణులు, ప్రతిపక్షాలు, ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మధ్య పెట్టే చర్యగా ఈ సంఘటనను చూడవచ్చా? కాబట్టి ఈ ఘటనపై తక్షణమే స్వతంత్ర, పారదర్శక, కఠినమైన విచారణ జరగాలి. ఎవరి ప్రమేయం ఉన్నా నిర్భయంగా బయటపెట్టాలి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. లేదంటే ‘ఆధారాలు కాలిపోతాయి – న్యాయం కూడా కాలిపోతుంది’ అన్న ప్రమాదకరమైన భావన రాష్ట్రంలో బలపడే ప్రమాదం ఉంది.
- సయ్యద్ రఫీ,






