- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధం ఖేదం.. శాంతే మార్గం!
ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అ హింసా దినోత్సవం జరుపుకుంటున్నాం.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అ హింసా దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచ దేశాలు, జాతులు, మతాలు, వర్గాలు అన్నీ కలసి శాంతి, సఖ్యత, సోదరభావం కోసం కృషి చేయడం. ప్రపంచంలో యుద్ధాలు, ఉగ్రవాదం, జాతి వివక్ష, వర్గ విభేదాలు, ద్వేషాలు పెరుగుతున్న ఈ కాలంలో అహింస, శాంతి విలువ మరింత పెరిగింది. ఒక దేశంలో శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ప్రగతి సాధించాలంటే ముందు ప్రజల మనసుల్లో సౌభ్రాతృత్వం ఉండాలి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రజలందరికీ ‘హింసను విడిచి శాంతిని ఆచరించండి’ అనే సందేశం ఇస్తోంది. అనాదిగా మన భారతదేశ సంస్కృతిలో ‘అహింసా పరమో ధర్మః’ ప్రసిద్ధమైన సూక్తి. హిందూ ధర్మం, జైనిజం, బౌద్ధం వంటి భారతీయ తత్వశాస్త్రాల ప్రధాన బోధన కూడా. యుద్ధం ఎప్పుడూ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థలకు, భౌగోళిక స్థిరత్వానికి తీవ్ర నష్టాలను కలిగిస్తుంది. ఇది ప్రాణనష్టం, ఆస్తి నష్టం, విద్య-ఆరోగ్య వ్యవస్థల పతనం, శరణార్థుల సమస్యలకు దారి తీస్తుంది. దీనికి ప్రపంచ యుద్ధాలే సజీవ సాక్ష్యం. నేటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సుమారుగా 56 దేశాల్లో అంతర్గత లేదా అంతర్జాతీయ సంఘర్షణలను ఎదుర్కొంటున్నట్లుగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 నివేదిక పేర్కొంది. ఈ యుద్ధాల కారణంగా ఎన్నో దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతిని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఆహార, ఇంధన సంక్షోభం పర్యావరణ నష్టం వాటిల్లింది. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, శాంతి-భద్రతలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం, ప్రాణనష్టం ఏ దేశానికీ శ్రేయస్కరం కాదు. కాబట్టి, సమస్యలను ఆయుధాలతో కాదు. చర్చలతో పరిష్కరించుకోవాలని యుద్ధ అనుభవాలే ప్రపంచానికి గొప్ప గుణపాఠం. అహింసా దినోత్సవం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ, సహనంతో జీవించి, ప్రపంచాన్ని శాంతిమయంగా తీర్చిదిద్దాలి.
-డాక్టర్ సి.కె. రెడ్డి
77992 92222






