Vote chor: ఓట్ చోర్‌లో ఎవరి వాదన సరైంది.. నిబంధనలు ఎవరు అతిక్రమిస్తున్నారు?

by Ravi |   (  Updated:2025-08-21 01:01:16  IST  )

ఇటీవల విపక్షాలు ఓట్ల జాబితాలలో అవకతవకలు జరిగాయని చేసిన ఫిర్యాదులపై, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర కుమార్

Vote chor: ఓట్ చోర్‌లో ఎవరి వాదన సరైంది.. నిబంధనలు ఎవరు అతిక్రమిస్తున్నారు?
X

ఇటీవల విపక్షాలు ఓట్ల జాబితాలలో అవకతవకలు జరిగాయని చేసిన ఫిర్యాదులపై, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర కుమార్ తన టీమ్‌తో సహా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రజాస్వామ్య హితులను నిరాశ పరిచిందనే చెప్పాలి. మీడియా సూటైన ప్రశ్నలకు ఆయన చాలా వరకు తగిన బదులివ్వకపోవడం మరిన్ని సందేహాలకే దారి తీసింది. ఆయన సమాధానాలను కాస్త పరికిద్దాం.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆపాదించిన ‘ఓట్ చోరీ’కి స్పందిస్తూ, ఆయన నిర్దిష్ట కాల వ్యవధిలో ఇలాంటి ఫిర్యాదులు చేయవలసి ఉంటుందని, అదిగాక ఆయన అక్కడి ఓటరు కాకపోతే అతను ప్రమాణ పత్రంతో పాటు తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలన్నారు. లేదంటే ఓటర్లను, రాజ్యాంగ వ్యవస్థను అవమానించినట్టే అని నొక్కి వక్కాణించారు. పైగా దేశానికి క్షమాపణ చెప్పాలని గట్టిగా విశదం చేశారు. మరి ఇవే నిబంధనలు, అభియోగాలు లేవదీసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‌కు వర్తించవా? అన్న ప్రశ్న ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.

ఈ ప్రశ్నలకు సమాధానం ఇదేనా?

పోలింగ్ బూత్‌లలో జరిగే ఓటింగ్ ప్రక్రియ వీడియోలపై ప్రశ్నలపై 'మా', 'బెహిన్', 'బహు'ల గోప్యతకు భంగం కలిగిస్తూ, సీసీటీవీ వీడియోలలో వారు ఓటు వేసేది చూపించాలా? అన్న ఆయన ఎదురు ప్రశ్న.. మరి ఆ గోప్యత మొదటి 45 రోజులకు వర్తించదా? అన్న తర్కం ముందు నిలువలేకపోయింది. గతంలో మహారాష్ట్రలో, అరుణాచల్ ప్రదేశ్‌లో ఆ ఏడాది ఎన్నికలున్నాయనే మిష‌తో IR(ఇంటెన్సివ్ రివిజన్) ఆపివేసిన ఎలెక్షన్ కమిషన్ బిహార్‌ను ఎందుకు మినహాయించిందన్నది కూడా యక్ష ప్రశ్నే! ‘ప్రతి పౌరుని ఓటు హక్కు చాలా పవిత్ర మైంది. ఎవరి పేరునూ 'హడావిడి'గా తొలగించకూడదు. ఏదైనా ఓటరు పేరు ఒక్క చోట కంటే ఎక్కువ సార్లు ఉంటే కూడా తగినంత తనిఖీ, విచారణ జరుపుకుండా తొలగించకూడదన్న ఆయన వాదన సబబని తోచినా, మరి అదే ఎలక్షన్ కమిషన్ బీహార్‌లో 65 లక్షల మంది అల్ప సంఖ్యాకుల, అణగారిన వర్గాల, పేదల పేర్లను హడావిడిగా ఇంత తక్కువ వ్యవధిలో ఎలా తొలగించారన్న ప్రశ్నకు వారిచ్చిన సంజాయిషీ కూడా అంతంత మాత్రమే. మరో ప్రశ్నకు బదులుగా ఆ జాబితాలో 22 లక్షల మంది పైచిలుకు మంది మృతి చెందారని, అయితే వారు గత ఆరు నెలల్లో కాక గడిచిన 20 ఏళ్లుగా మరణించారని వివరణ ఇచ్చారు. బిహార్‌లో గత 20 ఏళ్లుగా జరిగిన ఎన్నికల సమయంలో గాని, ఇటీవలి IR (intensive Revision)లో గాని ఆ వివరాలు వెలికి రాలేదా? అన్న ప్రశ్నకు కూడా సరియైన సమాధానం దొరకలేదు. మరి అలాంటప్పుడు ఆ మృతుల ఓట్లు దుర్వినియోగమయ్యాయా? అయ్యుంటే ప్రజాస్వామ్య ప్రక్రియ లో జరిగిపోయిన మార్చలేని పర్యవసానాలేవైనా చోటు చేసుకున్నాయా? ఇది మరింత ఇబ్బంది కల్గించే ప్రశ్న.

పొంతన లేని సమాధానాలు ఇచ్చి..

బిహార్ ఓటర్ల జాబితా/తొలగించబడిన వారి జాబితా ముసాయిదా (draft)ల ప్రతులను ఆయా ప్రాంతీయ రాజకీయ పక్షాల ప్రతినిధులకు అందజేశామని ఆయనన్నది కూడా 'పచ్చి అబద్ధమ'ని అన్ని విపక్షాలు ఏక కంఠంతో వెంటనే ఖండించాయి. బిహార్ SIR సర్వేక్షణలో ఎంత మంది బంగ్లాదేశీయులు, నేపాలీలు (గుస్ బైటియా‌లు) దొరికి పోయారు?' అన్న ప్రశ్నకు, ఆయనిచ్చిన సమాధానానికీ ఎటువంటి పొంతన లేకపోయింది. ఇక సిఫారసు చేయబడని ఓటర్ల గురించిన ప్రశ్న కూడా ఆయన ఈ చెవిన విని, ఆ చెవిన వదిలేశారు. 24 గంటల్లో 2,3 లోక్‌సభ నియోజక వర్గాల మొత్తం పోలయిన ఓట్ల వివరాలను మెషీన్ రీడబుల్ (చదవగల) ఫార్మాట్‌లో ఎలక్షన్ కమిషన్ అనురాగ్ ఠాకూర్‌కు ఇచ్చిన నేపథ్యంలో, ‘సుప్రీంకోర్టు ఆదేశం 56 గంటల్లో అమలు జేశాం’ అని ఆయన తమను తామే అభినందించుకోవడం కూడా కాస్త అతి శయోక్తిగానే తోచింది. ‘దారి పక్క, చెట్టు కింద, వంతెనల కింద నివసించే వాళ్ల డోర్ నంబర్లు నమోదు కానంత మాత్రాన వారికి ఓటు హక్కు లేకుండా చేయరాదు. డోర్ నంబరు లేకుంటే కంప్యూటర్ ‘0’ అనే నమోదు చేస్తుందన్న ఆయన విశ్లేషణ కూడా సహేతుక మనిపించలేదు.

అంతేకాక అఖిలేష్ యాదవ్ చేసిన ఫిర్యాదులపై స్పందిస్తూ, ఆయన 'అఫిడవిట్' ఇవ్వలేదన్న అభియోగం కూడా దుమారాన్నే రేపింది. మొత్తం మీద ఎవరు రాజ్యాంగాన్ని విధిగా పాటిస్తున్నారో, ఎవరు అతిక్రమిస్తున్నారో భారత పౌరులకు అర్థమయ్యేలోగా, ప్రజాస్వామ్యం గాడి తప్పితే జరిగే విపత్కర పరిణామాలు భయానకమైన భవిష్యత్తుకు దారితీస్తాయా? ఇందుకు కాలమే సమాధా నం చెబుతుందా? లేదా పౌరులే సక్రియాత్మకంగా జవాబును వెదుక్కుంటారా? వేచి చూడాల్సిందే!

ప్రతాప్ రాజులపల్లి

97698 55645

Next Story