- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హక్కుల అణచివేతపై.. ప్రశ్నిస్తున్న గొంతులు - రాఘవ
రాజ్యాంగం కల్పించిన కనీస ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోంది. ప్రశ్నించిన వారిని నిరంకుశ చట్టాల కింద అరెస్టు చేస్తున్నారు. ప్రజలహక్కుల కోసం పోరాడే వారిని జైళ్లలో నిర్బంధిస్తున్నారు.

రాజ్యాంగం కల్పించిన కనీస ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోంది. ప్రశ్నించిన వారిని నిరంకుశ చట్టాల కింద అరెస్టు చేస్తున్నారు. ప్రజలహక్కుల కోసం పోరాడే వారిని జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోంది. ఈ దేశాన్ని లౌకిక, ప్రజాతంత్ర రాజ్యంగా నిర్మించి, పరిరక్షించుకోవాలంటే, ప్రజాతంత్ర వాదులంతా పౌర, ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్త వలసిన సమయం ఆసన్నమైంది.
ఎన్నికల సంఘాన్ని కేంద్రప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుని, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(ఎస్ ఐ ఆర్) పేరుతో తమకు ఇష్టం లేని వారి ఓటు హక్కును తొలగించేస్తోంది. ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం’ పేరులో గాంధీజీ పేరును తొలగించేశారు. జాతిపితని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా కేంద్రంలోని పాలకపార్టీ సోదర సంస్థ భజరంగ్ నేతలు కొనియాడుతున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి కాకుండా, ఆర్ ఎస్ ఎష్ ఆలోచనకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారు.
వేలాదిగా విచారణకు నోచుకోకుండా..
వివిధ రాష్ట్రాల్లో అనేక మంది ఖైదీలు విచారణకు నోచుకోకుండా, కనీసం బెయిల్ దొరక్కుండా, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. పార్కిన్ సన్ తో బాధపడుతూ, స్ట్రా గ్లాసుక్కూ డా నోచుకోని స్టాన్ స్వామి జైల్లోనే మరణించాడు. బీమా కోరే గాన్ కేసులో అరెస్టయిన ప్రజాన్యాయవాది సురేంద్ర గాడ్గింగ్ పోలీసు కస్టడీలో ఉండగానే గుండెపోటుకు గురయినా, బెయిల్ ఇవ్వకుండా ఏడేళ్ళకు పైగా జైల్లోనే నిర్బంధించారు. తొంభైశాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను అయిదు సంవత్సరాలకు పైగా జైల్లో నిర్బంధించారు. నిర్దోషిగా విడుదలైనప్పటికీ, జైల్లో పెట్టిన బాధల వల్ల ఆరు నెలలకే ఆయన మృతి చెందారు. జేఎన్ యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ కూడా అయిదు సంవత్సరాలుగా బెయిల్ దొరకకుండా జైల్లోనే ఉన్నాడు. ప్రభుత్వ వాదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అనేక మంది ఖైదీలకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానాలు నిరాకరిస్తున్నాయి.
కార్టూన్‌లు వేస్తే అరెస్టు
ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ గ్రామంలో పదిహేడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెగార్ కు ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇతనికి మాత్రం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయ వ్యవస్థ పరువు నిలబెట్టు కోవడానికి సుప్రీం కోర్టు అతని బెయిల్ ను రద్దు చేసింది. ప్రధాన మంత్రిపైన వ్యంగ్య చిత్రం వేసిన ఒక కార్టూనిస్ట్‌ను కూడా అరెస్టు చేసి, బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. న్యాయస్థానాలు ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయో వీటిని బట్టి అర్థమవుతోంది. అడవుల నుంచి ఆదివాసీలను తరిమేస్తున్న కేంద్ర ప్రభుత్వం, దేశంలోని అడవులు, కొండలు, గనులు వంటి సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేస్తోంది. మైనింగ్ జరుపుతున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆదివాసీలపై పోలీసు బలగాలతో విరుచుకుపడుతోంది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న మావోయిస్టుల తలలకు వెలకడుతూ, ‘కగార్’ పేరుతో వారిని చంపేస్తోంది. మావోయిస్టులతో చర్చలు జరపండని పౌర, ప్రజాస్వామిక వాదులు చేసిన విజ్ఞప్తులను పెడచెవిన పెడుతోంది. ఇప్పటికే వందలాది మందిని చంపేసిన కేంద్ర ప్రభుత్వం, జనవరి చివరి కల్లా మావోయిస్టులను తుడిచివేస్తామని డెడ్ లైన్ కూడా పెట్టింది.
ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్‌గా మారితే..
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేవు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా అప్పగించేస్తున్నారు. అమరావతిలో వ్యవసాయ భూములనే కాకుండా, ఇళ్లను కూడా స్వాధీనం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒడిగట్టింది. దీంతో భూములు కోల్పోయిన అన్నదాతలు గుండెపగిలి చచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అసమ్మతిని అణచివేయడానికి దేశంలో ఉన్న హక్కుల కార్యకర్తలను, మేధావులను, రచయితలను, జర్నలిస్టులను, కళాకారులను ఏళ్ల తరబడి నిర్బంధిస్తోంది. ‘ఉపా’ చట్టానికి మరింత పదును పెట్టి ప్రయోగిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపైన ఎన్ ఐ ఏ, సీబీఐ, ఈడి వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది.
గొంతెత్తవలసిన సమయం
ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులకు ఇలా భంగం వాటిల్లుతోంది. ఈ దేశాన్ని లౌకిక, ప్రజాతంత్ర రాజ్యంగా నిర్మించి, పరిరక్షించుకోవాలంటే, ప్రజాతంత్ర వాదులంతా పౌర, ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్త వలసిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్ లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభలకు సన్నద్ధమవుతున్నారు. ఈ సభల్లో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, పౌరహక్కుల నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ , సామాజిక ఉద్యమకారిణి బేలాబాటియా, ప్రముఖ గాంధేయవాది హిమాంశుకుమార్ తదితరులు పాల్గొననున్నారు.
(జనవరి 10,11 న తిరుపతిలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహా సభల సందర్భంగా)
-రాఘవ
94932 26180






