EV Cars: చౌక ధరకే ఈవీ కార్లు

by S Gopi |

కానీ, ఈ స్థానిక ఉత్పత్తి ప్రణాళికలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. నిర్ణీత 50 గిగావాట్-అవర్ లక్ష్యంలో కేవలం 1.4 గిగావాట్ అవర్ సామర్థ్యం మాత్రమే ఉత్పత్తి ప్రారంభమైంది.

EV Cars: చౌక ధరకే ఈవీ కార్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలు తగ్గించాలంటే దేశీయంగానే లిథియం-అయాన్ బ్యాటరీ సెల్స్ తయారీ పెరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ తయారీ వ్యయంలో దాదాపు సగం వాటా బ్యాటరీలదే కాగా, విదేశీ దిగుమతులపై (ముఖ్యంగా చైనా) ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 18,100 కోట్లతో 'అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) పీఎల్ఐ ' పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈవీలు చౌకగా మారాలంటే కేవలం బ్యాటరీ ప్యాక్‌లను అసెంబ్లింగ్ చేయడం మాత్రమే సరిపోదు, దేశీయంగా సెల్స్‌ను ఉత్పత్తి చేయాలి. కానీ, ఈ స్థానిక ఉత్పత్తి ప్రణాళికలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. నిర్ణీత 50 గిగావాట్-అవర్ లక్ష్యంలో కేవలం 1.4 గిగావాట్ అవర్ సామర్థ్యం మాత్రమే ఉత్పత్తి ప్రారంభమైంది. అది కూడా పూర్తిగా ఓలా ఎలక్ట్రిక్ నుంచే వచ్చింది. దేశంలో లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ వంటి కీలక ఖనిజాల శుద్ధి సామర్థ్యం లేకపోవడం వల్ల ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో బ్యాటరీ సెల్స్ ఇక్కడ తయారైనా, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాలు విదేశాల నుంచే రావాల్సి వస్తోంది. పరికరాల కొరత, సాంకేతిక లోపాలు, స్థానిక నిబంధనల వల్ల ఇంకా ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో లేవు.

సామాన్యుడికి భారం తగ్గేదెప్పుడు?

బ్యాటరీల స్థానిక ఉత్పత్తి పెరిగినంత మాత్రాన వాహనాల ధరలు వెంటనే తగ్గుతాయని భావించలేము. భారత్‌లో తయారవుతున్న ఈవీలలో వాడే సెల్స్‌లో 99 శాతం ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నవే. ఒకవేళ దేశీయంగా తయారీ ప్రారంభమైనా, కంపెనీలు పెట్టిన భారీ ప్లాంట్ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవాల్సి ఉంటుంది. టూ-వీలర్, త్రీ-వీలర్ వాహన రంగాలు ఇప్పటికే పెట్రోల్ వాహనాలతో సమాన స్థాయిలో ధరలను తీసుకురాగా, భవిష్యత్తులో తగ్గే ఖర్చులను కంపెనీలు ధరలను తగ్గించడం కంటే తమ లాభాలను పెంచుకోవడానికి ఉపయోగించే అవకాశముంది. కార్ల విభాగంలో మాత్రం రాబోయే రోజుల్లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ, విదేశీ మారకపు రేట్లు, గ్లోబల్ మార్కెట్లో వస్తువుల ధరలు దీనిపై ప్రభావం చూపుతాయి.

కేవలం సెల్స్ తయారీ చాలదు

నిజమైన వ్యయ నియంత్రణ సాధించాలంటే కేవలం బ్యాటరీలు తయారు చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాల శుద్ధి, క్యాథోడ్-యాక్టివ్ మెటీరియల్స్, టెస్టింగ్, సెమీకండక్టర్లు, నాణ్యతా పరీక్షలు, రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలతో కూడిన పూర్తి స్థాయి 'పర్యావరణ వ్యవస్థ'ను భారత్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్థానికీకరణ వల్ల తక్షణమే ధరలు తగ్గకపోయినా.. భారత రోడ్డు, ఉష్ణోగ్రతల పరిస్థితులకు తగినట్లుగా మెరుగైన నాణ్యత, భద్రత, ఎక్కువ లైఫ్ ఇచ్చే బ్యాటరీలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాతే సరఫరా గొలుసు పుంజుకుని, క్రమంగా ఈవీ ధరలు తగ్గే అవకాశం ఉంది.

Next Story