ప్రజలే డబ్బులిచ్చి.. సర్పంచ్‌ను గెలిపించారు

by Bhoopathi Nagaiah |

ఎన్నికలు అంటే డబ్బు, మద్యం, ప్రలోభాలు తప్పవన్న భావన రాజకీయ వాస్తవంగా మారిన ఈ కాలంలో, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామం ఒక అరుదైన ప్రజాస్వామ్య తీర్పు చెప్పింది.

ప్రజలే డబ్బులిచ్చి.. సర్పంచ్‌ను గెలిపించారు
X

న్నికలు అంటే డబ్బు, మద్యం, ప్రలోభాలు తప్పవన్న భావన రాజకీయ వాస్తవంగా మారిన ఈ కాలంలో, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల(Munipampula) గ్రామం ఒక అరుదైన ప్రజాస్వామ్య తీర్పు చెప్పింది. ఈ గ్రామంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ పోటీ చేయగా, సర్పంచ్ ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంది. నోట్లు, మద్యం (చుక్క), మాంసాహారం (ముక్క), వెండి ఆభరణాల వంటి ప్రలోభాలకు పాల్పడిన రాజకీయాలను ప్రజలు తిరస్కరించి, నిజాయితీ, ప్రజాసేవనే మూలధనంగా ఉన్న యువ నాయకుడిని స్పష్టమైన మెజార్టీతో గెలిపించారు. ఈ ఎన్నికలో పోటీ కేవలం ఓట్లకే పరిమితం కాలేదు. ఒకవైపు డబ్బు, మద్యం, బహుమతులు, వెండి ఉంగరాల వంటి ప్రలోభాల రాజకీయాలు; మరోవైపు ఒక్క రూపాయి కూడా ఓటు కొనడానికి వినియోగించని నిజాయితీ రాజకీయాలు—ఈ రెండు ధోరణుల మధ్యే ముని పంపుల ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు.

ఆయన ఒంటరిగా పోటీ చేయలే..

ప్రలోభాలను ఎంచుకోకుండా, ప్రజా సమస్యలు తెలిసిన, ప్రజల మధ్యే జీవించిన సీపీఐ(ఎం)(CPI(M)) పార్టీకి చెందిన యువ కార్యకర్త బొడ్డుపల్లి వెంకటేశానికి అండగా నిలబడ్డారు. సర్పంచ్‌గా ఎన్నికైన బొడ్డుపల్లి వెంకటేశం(Boddupalli Venkatesham) రాజకీయ వారసత్వం లేని సాధారణ యువకుడు. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా ఉద్యమాల వరకు సాగిన ఆయన పోరాటాలు గ్రామ ప్రజలకు సుపరిచితమే. త్రాగునీరు, ఉపాధి, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలపై ఆయన చేసిన నిరంతర పోరాటాలే ప్రజల విశ్వాసానికి ప్రధాన కారణమయ్యాయి. అందుకే ఈ ఎన్నికలో ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు.. గ్రామ ప్రజలే ఆయన ప్రచార బృందంగా మారారు.

ప్రజలే గెలిపించుకున్న అభ్యర్థి

ఇంటింటా చందాలు, ప్రచార వ్యయం, ఎన్నికల ఏర్పాట్లు...అన్నింటినీ ప్రజలే భరించారు. ఓటు కొనకుండా, ప్రజలే డబ్బులు ఇచ్చి తమ అభ్యర్థిని గెలిపించడం ఈ గ్రామంలో కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికింది. ఫలితంగా 454 ఓట్ల మెజార్టీతో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా ప్రకటించారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు; డబ్బు రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన బలమైన చెంపపెట్టు. ఈ పరిణామం భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటే మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రజా స్పృహ అవసరం. డబ్బు, మద్యం తీసుకుని ఓటు వేస్తే పాలన ప్రజల చేతుల్లో ఉండదు. ప్రజల కోసం పనిచేసే, ప్రజల మధ్యే జీవించిన నాయకులకు అవకాశం ఇచ్చినప్పుడే స్థానిక సంస్థలు నిజమైన అభివృద్ధికి వేదికలవుతాయి.

ఈ తీర్పు ఒక గ్రామ కథ కాదు..

ఇలాంటి గ్రామాలు, ఇలాంటి నాయకులు ముందుకు రావాలంటే ప్రజలతో పాటు ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే కీలకం. నైతిక ఎన్నికలను ప్రోత్సహించే విధానాలు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు తీసుకుంటే ముని పంపుల వంటి గ్రామాలు రాష్ట్రవ్యాప్తంగా రూపుదిద్దుకుంటాయి. ప్రజాస్వామ్యానికి బలం డబ్బులో కాదు.. ప్రజల చైతన్యంలోనే ఉందన్న సత్యాన్ని ఈ గ్రామం మరోసారి గుర్తు చేసింది. మునిపంపుల ఇచ్చిన తీర్పు ఒక గ్రామ కథ మాత్రమే కాదు. రేపటి రాజకీయాలకు హెచ్చరిక. ప్రజలకు ధైర్యం. పాలకులకు దిశానిర్దేశం. డబ్బు కాదు... ప్రజలే అసలైన శక్తి. ప్రలోభాలకు చెక్ పెట్టిన మునిపంపుల గ్రామం దేశానికే ఆదర్శం. ప్రజాస్వామ్యానికి నిదర్శనం.

-గడగోజు రవీంద్రాచారి.

98487 72232

Next Story