ఆడపిల్లల స్వావలంబనకు ప్రతీక.. ఈ సినిమా!

by Ravi |   (  Updated:2025-07-05 01:15:27  IST  )

కళ ఎంత ప్రాంతీయమైతే అంత విశ్వజనీనమవుతుంది. రీమా దాస్ సినిమాలు చిన్న చిన్న జీవితాలను, గ్రామీణ ప్రపంచాన్ని, ఆప్యాయతను

ఆడపిల్లల స్వావలంబనకు ప్రతీక.. ఈ సినిమా!
X

కళ ఎంత ప్రాంతీయమైతే అంత విశ్వజనీనమవుతుంది. రీమా దాస్ సినిమాలు చిన్న చిన్న జీవితాలను, గ్రామీణ ప్రపంచాన్ని, ఆప్యాయతను ఎంతో సహజంగా, అంతరంగికంగా చూపిస్తాయి. ఆమె కథలు చిన్నవే కావచ్చు.. కానీ వాటి ప్రభావం ప్రపంచ స్థాయిలో విస్తృతం. ఆమె ఒక పాఠశాల కాదు, ఓ ప్రేరణ. మంచి కళ, కవిత్వం, సినిమాలు కూడా మంచి శిల్పంలా ముఖ్యమైనవే. అలాంటి మంచి స్వతంత్ర సినిమాలు ఈశాన్య భారతం నుండి వెలువడుతున్నాయి.. విజయాలూ అవార్డులూ సాధిస్తున్నాయి.

వర్తమాన కాలంలో కవిత్వం పట్లే కాదు అన్ని కళల పట్ల ఉదాసీనత పెరిగిపోతున్నది. ముఖ్యంగా సినిమా ఇవాళ బాక్సాఫీసు లెక్కల్లో మునిగి తేలుతున్న సమయంలో స్వతంత్ర సినిమా స్థితి కనా కష్టంగా ఉందనే చెప్పాలి. నిజానికి మన జనాభాలో అతి తక్కువ శాతం మాత్రమే సినిమాలు చూస్తారు, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. కమర్షియల్ సినిమా ఇవాళ కార్పొరేట్ సినిమాగా రూపాంతరం చెందింది.

'విలేజ్ రాక్‌స్టార్ -2' కి అంతర్జాతీయ అవార్డు..

మనం పాత కాలానికి చెందిన శిల్పాలను చూసి ముచ్చటపడతాం కానీ కొత్తగా ఏమీ నిర్మించడం లేదు. మంచి కళ, కవిత్వం, సినిమాలు కూడా మంచి శిల్పంలా ముఖ్యమైనవే. ప్రఖ్యాత అస్సామీ దర్శకురాలు రీమా‌దాస్ మరోసారి అస్సామీ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు.. త్వరలో విడుదల కాబోయే ఆమె చిత్రం 'విలేజ్ రాక్‌స్టార్ 2'కు 25వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకురాలి అవార్డును గెలుచుకున్నారు. రీమా ఇంతకు ముందు తీసిన 'విలేజ్ రాక్‌స్టార్స్'కు ఇది సీక్వెల్.

ప్రాంతీయతకు మారుపేరు ఈ చిత్రాలు..

ప్రకృతి సిద్ధమైన నదీనదాలూ, పర్వతాలతో స్వచ్ఛమైన వాతావరణంతో తులతూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడి నుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమా మొదలు అన్ని కళలూ అత్యంత ప్రాంతీయమై అసలైన కళారూపాలుగా వుంటాయి. అస్సామీ సినిమా జాలీ‌వుడ్ (JOLLYWOOD)గా పిలవబడుతున్నది. 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాల్ నిర్మించిన “జోయ్ మతి” సినిమాతో అస్సామీ సినిమా మొదలైంది. కానీ అనేక కారణాల రీత్యా అక్కడ సినిమా విస్తారంగా ఎదగలేదు. చాలా కాలం కలకత్తా కేంద్రంగానే అస్సామీ సినిమాల నిర్మాణం జరిగింది. కానీ వచ్చిన సినిమాలు మాత్రం చాలా వరకు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

అస్సామ్ జనజీవన సజీవ దృశ్యం

“విలేజ్ రాక్ స్టార్స్” మొదటి భాగం సహజంగానూ, గ్రామీణ వాతావరణ నేపథ్యంలోనూ చిత్రించబడి అస్సామ్ జనజీవన సజీవ దృశ్యంలా సాగుతుంది. ఈ సినిమాను దర్శకు రాలు తమ గ్రామం చాహాయి గాంవ్‌కు అంకితం చేస్తుంది. మహిళల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో సొంత కాళ్లపై నిలబడడం, వ్యక్తిత్వ నిర్మాణం రూపొందించుకోవడం, తమ కలలను సాకారం చేసుకోవడం అనే అంశాలపై ఈ సినిమా సాగుతుం ది. విజువల్‌గా చాలా అద్భుతంగా ఉండి అబ్బురపరుస్తుంది.

గిటారిస్ట్ కావాలనే పల్లెటూరి అమ్మాయి..

సినిమా కథా కథనానికి వస్తే ఓ మారు మూల గ్రామంలో ధును అనే ఓ పదేళ్ల అమ్మాయి విధవరాలైన తన తల్లి, బద్దకస్తుడు అయిన అన్నతో కలిసి జీవిస్తుంటుంది. తల్లి చేసిన తినుబండారాలను అమ్ముకు రావడానికి జాతరకు వెళ్లిన ధును అక్కడ ఒక బ్యాండ్ ప్రదర్శన చూసి అబ్బుర పడుతుంది. అంతే కాదు ఒక కార్టూన్ పుస్తకం చూసి ప్రభావితమై తానూ ఒక గిటారిస్ట్ కావాలని, తానూ ఒక బ్యాండ్‌ను రూపొందించుకోవాలని కలలు కంటుంది. ఒక పాత పేపర్లో పాజిటివ్‌గా వుండడం వల్ల కలలు సాకారమవుతాయని దాంతో దేన్నయినా సాధించుకోవచ్చునని చదివి అర్థం చేసుకుంటుంది. కానీ తమ పేదరికం అసహాయత అడ్డు పడుతుండగా మొక్కవోని దీక్షతో ఒక్కో రూపాయి కూడబెట్టడం ఆరంభిస్తుంది. అప్పుడే ధును రజస్వల అవుతుంది. మొత్తం ఆచారాల ప్రకారం తంతు నిర్వహిస్తారు. కానీ అప్పటి నుంచి ఆమె పైన ఆంక్షలు మొదలవుతాయి. చీర కట్టాలని, మగపిల్లలతో కలిసి తిరగొద్దని కట్టుబాట్లు చెబుతారు. కానీ ధును తల్లి అందుకు భిన్నంగా తన బిడ్డకు పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తుంది.

ఆడపిల్లలకు, మగ పిల్లలకు ఉండే తేడా..

వరదలు ప్రకృతి భీభత్సాలకు వాళ్లకున్న కొద్ది భూమిలో పంట కూడా కొట్టుకు పోతుంది. ప్రతి ఏటా వరదలకు కొట్టుకుపోయే ఈ వ్యవసాయం ఎందుకు చేయాలని ధును తల్లిని అడుగుతుంది. కానీ తమకు తెలిసిన వృత్తి ఇదే అని తల్లి బదులిస్తుంది. మునిగి పోతుందని ఏమీ చేయకుండా ఉండలేం కదా అంటుంది. మరోవైపు రూపాయి రూపాయి కూడబెట్టి ధును తన గిటార్ కలను నెరవేర్చుకుంటుంది. ఇక్కడ గిటార్ సాధించడం కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, మొత్తం సినిమాలో ధునులో పొంగిపొర్లే ఉత్సాహం, సొంతంగా సాధించాలనే తత్వం చాలా సహజంగా చూపిస్తుంది దర్శకురాలు.. వర్తమాన కాలంలో ఆడపిల్లలకు, మగపిల్లలకు నడుమ ఉండే ఒక ప్రధానమైన తేడాను “విలేజ్ రాక్ స్టార్స్” వివరిస్తుంది. ఆడపిల్లల స్వావలంబనను ఆవిష్కరిస్తూ “విలేజ్ రాక్ స్టార్స్-2” కొనసాగుతుంది. ఇందులో నీలోత్పల్ బోరా సంగీతం అదనపు మూడ్‌ను కలిగిస్తుంది. కెమెరా బాధ్యతలను కూడా రీమా దాస్ నిర్వహించం విశేషం.

- వారాల ఆనంద్

94405 01281

Next Story