వికసిత భారత్‌లో వికసిత తెలంగాణ.. సమగ్ర అభివృద్ధితోనే సాకారం!

by Ravi |   (  Updated:2026-06-16 01:01:09  IST  )

వికసిత భారత్–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించే సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా ఎదుగుతోంది. రైతులు, యువత, మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధితోనే “వికసిత తెలంగాణ” సంకల్పం సాకారమవుతుందని విశ్లేషించే ప్రత్యేక కథనం.

వికసిత భారత్‌లో వికసిత తెలంగాణ.. సమగ్ర అభివృద్ధితోనే సాకారం!
X

పన్నెండు సంవత్సరాల క్రితం ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఐటీ, పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన తెలంగాణ, ఇప్పుడు "వికసిత భారత్–2047" లక్ష్యంలో కీలక భాగస్వామిగా ఎదగాలనే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ అభివృద్ధి ప్రయాణం సమగ్రంగా, సమానంగా, సుస్థిరంగా సాగినప్పుడే "వికసిత తెలంగాణ" సంకల్పం సార్థకమవుతుంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన “వికసిత తెలంగాణ” అనే భావన రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త చర్చకు దారితీసింది. “వికసిత భారత్ – 2047” లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించగల సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతోంది.

హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కాదు..

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, స్వాభిమాన పాలన అనే ఆశయాలతో సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించబడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా ఎదిగి ఐటీ, ఫార్మా, స్టార్టప్‌లు, డేటా సెంటర్లు, సేవారంగాలలో దేశానికి మార్గ దర్శకంగా నిలిచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను హైదరా బాద్‌లో విస్తరించడం తెలంగాణ సామర్థ్యానికి నిదర్శనం. అయితే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే తెలంగాణ అభి వృద్ధిగా పరిగణించలేం. గ్రామీణ ప్రాంతాలు, వెనుక బడిన జిల్లాలు, రైతులు, యువత, మహిళలు కూడా అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలి. వికసిత తెలంగాణ అంటే అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి చేరడం.

రైతు..యువశక్తి - విద్య, ఆరోగ్య రంగాల్లో

వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతుల ఆదాయం పెరగడం, అగ్రి ప్రాసెసింగ్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్‌లు, ఎగుమతి అవకాశాల విస్తరణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. రైతు సంతోషంగా ఉన్నప్పుడే తెలంగాణ నిజమైన వికసిత రాష్ట్రంగా నిలుస్తుంది. అలాగే యువశక్తి తెలంగాణకు గొప్ప ఆస్తి. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్ రంగాల్లో యువతకు నైపుణ్యాలు అందించి, ఉద్యోగార్థులుగా మాత్రమే కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వికసిత తెలంగాణకు విద్య, ఆరోగ్యం కీలక పునాదులు. మార్కులు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా సృజనాత్మకత, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే విద్య అవసరం. అలాగే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టు పెంపొందించాలి. ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, పోషకా‌హార కార్యక్రమాలను విస్తరించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఆరోగ్యవంతమైన తెలంగాణే వికసిత తెలంగాణకు బలమైన పునాది.

మహిళలు.. పర్యావరణ రంగాల్లో

మహిళల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సంపూర్ణం కాదు. విద్య, ఉపాధి, వ్యాపారం, పరిపాలన రంగాల్లో మహిళలకు సమాన అవకా‌శాలు కల్పించడం, వారి భద్రత, ఆర్థిక స్వావలంబనను పెంపొందించడం వికసిత తెలంగాణ నిర్మాణానికి అవసరం. అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ చెరువుల సంస్కృతికి, అటవీ సంపదకు ప్రసిద్ధి చెందింది. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి చర్యలు విస్తరించాలి. “గ్రీన్ తెలంగాణ” లేకుండా “వికసిత తెలంగాణ” సాధ్యం కాదు. అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని జిల్లాలకు విస్తరించాలి. పారిశ్రామిక, విద్యా, ఆరోగ్య, రవాణా సదుపాయాలు అన్ని జిల్లాల్లో సమానంగా అభివృద్ధి చెందితేనే సమగ్ర తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది. వికసిత తెలంగాణ సాధనలో కేంద్రం-రాష్ట్రం సమన్వయం కూడా కీలకం. అప్పుడే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.

వికసిత తెలంగాణ లక్ష్యం కోసం..

సరైన విధానాలు, సమర్థవంతమైన పాలన, ప్రజల భాగస్వామ్యం, యువత శక్తి, రైతుల కృషి, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పురోగతి కలిసివస్తే తెలంగాణ దేశ అభివృద్ధికి మార్గదర్శక రాష్ట్రంగా నిలుస్తుంది. వికసిత తెలంగాణ అంటే రైతు నవ్వే రాష్ట్రం, యువతకు అవకాశాల రాష్ట్రం, మహిళకు గౌరవం ఉన్న రాష్ట్రం, పరిశ్రమలకు అనుకూల రాష్ట్రం, పర్యావరణాన్ని కాపాడే రాష్ట్రం, సమాన అవకాశాలు కలిగిన రాష్ట్రం. “వికసిత భారత్” అనే మహత్తర స్వప్నంలో తెలంగాణ ఒక ప్రధాన స్తంభంగా నిలవాలంటే అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి చేరాలి. అప్పుడు మాత్రమే “వికసిత భారత్లో వికసిత తెలంగాణ” అనే సంకల్పం సార్థకమవుతుంది.

-పూసాల మోహన్ చారి

98667 09607

Next Story