- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక విజయానంద గాథ
గొప్పవారి ఆత్మకథలకు ఎంతో ఆదరణ లభిస్తుంటుంది. శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, కళాకారులు ఇలా ఎందరో తాము నిర్వహించిన

గొప్పవారి ఆత్మకథలకు ఎంతో ఆదరణ లభిస్తుంటుంది. శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, కళాకారులు ఇలా ఎందరో తాము నిర్వహించిన విధుల్లో సాధించిన సంతృప్తిని అక్షరాల్లో కూర్చి పెడతారు. ముందు తరాలకు అవి పాఠాలుగా పనికొస్తాయి. ఈ మధ్య అలాంటివారి జీవితగాధల ఆధారంగా బయోపిక్‌ల పేరిట సినిమాలు వచ్చి తెరపై అవి సందడి చేస్తున్నాయి. ఇదే బాటలో వచ్చిన ఓ కన్నడ సినిమా 'విజయానంద్'. ఇది ఓ లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని జీవిత కథ. వి.ఆర్.ఎల్ అనే ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్స్ సంస్థ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పసుపు రంగులో గూడ్స్ లారీలు, ప్రైవేటు బస్సులు నగరాల్లో కనబడతాయి. మంచి సేవలు అందిస్తున్న పేరు కూడా ఆ సంస్థకు ఉంది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల సముదాయం ఉన్న సంస్థగా ఇది ఘనతకెక్కింది.
వ్యాపారంలో ఇక్కట్లను చూపించి..
ఏ రంగంలోనైనా విశేష ప్రతిభ కనబరచి, విజయశిఖరాలను అందుకోవడం అరుదైన విషయమే. గెలుపు కోసం ప్రయత్నించే వారెందరో ఉంటారు.. కానీ అందరికి అంతిమ విజయం సాధ్యపడదు. దాని వెనుక ఎన్నో కఠిన పరీక్షలు, అడ్డంకులు ఉంటాయి. వాటికి వెరవకుండా ముందుకు సాగి తమ లక్ష్యాన్ని చేరినవారి జీవిత విశేషాలు ఎంతో విలువైనవి. వి.ఆర్.ఎల్ అనే ట్రాన్స్‌పోర్ట్ సంస్థ చైర్మన్ విజయ్ సంకేశ్వర్. ఆయన మైసూరు సమీపంలోని గదగ్‌లో 1950లో జన్మించారు. తండ్రి నడుపుతున్న ప్రింటింగ్ ప్రెస్‌లో కొంత కాలం పని చేసి, 19 ఏళ్ల వయసులోనే సొంత వ్యాపారం కోసం రవాణా రంగాన్ని ఎంచుకుంటాడు. ఇంటి పెద్ద అయిన తండ్రి దానికి పూర్తిగా వ్యతిరేకిస్తాడు. ఒక్కరి కోసం పెట్టిన ప్రెస్‌లో ఎదిగిన ముగ్గురు కొడుకులు ఎందుకని, తాను వేరే వ్యాపారం చేస్తానని విజయ్ మొండికేస్తాడు. ఒక్క లారీని కొనడానికి, సాటి వ్యాపారులతో పోటీలో నిలదొక్కుకోవడానికి విజయ్ ఎదుర్కొన్న ఇక్కట్లను సినిమాలో బాగా చూయించారు. ప్రెస్ వ్యాపారంతో హాయిగా బతుకుతున్న కుటుంబం కొత్త వ్యాపారంలో ఎదురయ్యే చిక్కుల్ని తట్టుకొని ఎలా నిలబడుతుంది అనేది చిత్ర మూల కథ. దీనితో పాటు విజయ్ సంకేశ్వర్ రాజకీయ ప్రవేశం, పత్రిక ప్రచురణలో పోటాపోటీ అన్నీ సినిమాపై ఆసక్తి కలిగించే అంశాలు.
నాటి వాతావరణాన్ని చూపిస్తూ..
కన్నడ హీరో నిహాల్ పురోహిత్ ఈ సినిమాలో విజయ్‌గా నటించారు. ఆయన తండ్రి పాత్రను సీనియర్ నటుడు అనంత్ నాగ్ పోషించారు. ఇద్దరు పోటాపోటీగా నటించారనవచ్చు. కన్నడ యువ దర్శకురాలు రిషిక శర్మ స్వయంగా కథ సిద్ధం చేసుకొని దర్శకత్వం వహించారు. డెబ్భై ఏళ్ల క్రితం గదగ్ ప్రాంత వాతావరణాన్ని కళా దర్శకుడు అనిల్ కబీర్ ఎంతో సమర్థవంతంగా పునః సృష్టించారు. రైలు పెట్టెలు, రైల్వే స్టేషన్, దుకాణాలు ఆనాటి రూపాల్ని తలపిస్తాయి. ఈ సినిమా తొలుత కొంత సాధారణ కథనంలో వేగం తగ్గినా విజయ్ జీవితంలోని మలుపులతో ప్రేక్షకుడి సినిమాపై ఉత్కంఠ పెరుగుతుంది. 2022లో కన్నడంలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకున్నా విజయ్ సంకేశ్వర్ కుటుంబం కోరుకున్నట్లు ఆయన విజయగాథ లోకానికి తెలిసింది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా వ్యాపారం పనులు చూసుకోవడం మరో స్ఫూర్తిదాయక అంశం. ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. ఈ జీవిత కథపై ఆసక్తి ఉన్నవారు తెలుగులో 'ఆహా' ఒటిటి వేదికపై చూడవచ్చు.
- బద్రి నర్సన్
94401 28169






