- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా వేరు.. పాలన వేరు..!
తమిళనాడులో ఎన్నికల విజయంతో అధికారంలోకి వచ్చిన విజయ్ ముందున్న అసలైన సవాళ్లు ఏమిటి? ప్రజల అంచనాలు, పాలనలో ఎదురయ్యే సమస్యలు, ఇమేజ్ నుంచి గవర్నెన్స్‌కి మారాల్సిన అవసరం ఉంది.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల విజయం ఒక నాయకుడి ప్రయాణంలో కీలక ఘట్టం. అయితే అదే సమయంలో, అది అసలు పరీక్షకు ఆరంభం కూడా. తమిళనాడులో విజయ్ సాధించిన ఘన విజయం ఇప్పుడు ఆయనకు అధికారాన్ని మాత్రమే కాకుండా, భారీ బాధ్యతను కూడా అప్పగించింది. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాల్.
సినీ రంగంలో అపారమైన క్రేజ్ సంపాదించిన విజయ్, అదే ప్రజాదరణను రాజకీయాల్లోకి తీసుకువచ్చి విజయాన్ని అందుకో వడం ఒక విశేషం. కానీ రాజకీయాల్లో గెలవడం, పాలనలో నిలబడడం రెండూ వేర్వేరు విషయాలు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజల్లో రేకెత్తించిన ఆశలు ఇవి ఇప్పుడు కార్యరూపంలో కనిపించాలి.
విజయం ఒక మార్పు చిహ్నం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, విజయ్ ఎదుర్కొనే సవాళ్లు అనేకం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్య, ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడం, రైతుల సమస్యలను పరిష్కరించడం.. ఇవి అన్నీ తక్షణ ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఈ రంగాల్లో స్పష్టమైన విధానాలు లేకపోతే, ప్రజల్లో నిరాశ పెరగడం సహజం. ఇంకా ముఖ్యంగా, ప్రజల అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. ఒక సినీ హీరో రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజలు అతనిని కేవలం నాయకుడిగా కాకుండా, ఒక మార్పు చిహ్నంగా చూస్తారు. అదే సమయంలో, ఆ మార్పు కనిపించకపోతే విమర్శలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి.
విజయ్ ముందున్న మార్గం
చరిత్రలో ఎం.జి. రామచంద్రన్, జయలలిత వంటి నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రజాదరణను పాలనలోకి మార్చి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. అదే విధంగా, ఎన్.టీ రామ రావు కూడా ఆత్మగౌరవాన్ని రాజకీయ అజెండాగా మార్చి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. ఈ ఉదాహరణలు విజయ్ ముందు ఉన్న మార్గాన్ని సూచిస్తున్నాయి.
ఇమేజ్ నుంచి గవర్నెన్స్‌కి..!
అయితే, విజయ్ ముందున్న మరో కీలక సవాల్.. ఇమేజ్ నుంచి గవర్నెన్స్‌కి మారడం. సినిమాల్లో హీరోగా కనిపించడం ఒక విషయం. కానీ నిజజీవితంలో సమస్యలను పరిష్కరించే నాయకుడిగా నిలవడం మరో విషయం. దీని కోసం అనుభవజ్ఞులైన టీమ్, స్పష్టమైన విజన్‌తో పాటు నిర్ణయాత్మక నాయకత్వం అవసరం. అలాగే, కులం మతాలకు అతీతంగా అన్ని వర్గాల మద్దతును పొందడం అతని విజయానికి కారణమైతే, అదే సమతుల్యతను పాలనలో కూడా కొనసాగించాలి. ఏ వర్గం కూడా నిర్లక్ష్యం చెందకుండా, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా పాలన సాగించాల్సిన బాధ్యత అతనిపై ఉంది.
నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం!
పారదర్శకత, అవినీతి నియంత్రణ, సమర్థవంతమైన అమలు ఈ మూడు అంశాలు విజయ్ పాలనకు పునాది కావాలి. ప్రజలు ఇప్పుడు కేవలం మాటలను కాదు, ఫలితాలను ఆశిస్తున్నారు. ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తీసుకు రావాలి. మొత్తానికి, విజయ్ గెలిచాడు ఇది ఒక వాస్తవం. కానీ అతను ఎలా పాలన అందిస్తాడు? ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు? అన్నదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ఎన్నికల విజయం ఒక ప్రారంభం మాత్రమే. అసలు నాయకత్వం పాలనలోనే నిరూపించబడుతుంది. విజయ్ ముందున్న సవాల్ ఒక్కటే..ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం!
-ఎల్లబోయిన వెంకటేశ్వర్లు
81849 40814






