- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతదేశ సుపరిపాలన ప్రదాత వాజపేయ
భారతదేశ రాజకీయాలలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన వ్యక్తిగా పార్టీలకు అతీతంగా ప్రశంసించే

భారతదేశ రాజకీయాలలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన వ్యక్తిగా పార్టీలకు అతీతంగా ప్రశంసించే, అతి తక్కువ వ్యక్తులలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ముందు వరుసలో ఉంటారు. దేశ ప్రధానుల్లో ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యుత్తమ ప్రధానుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. భారతదేశానికి సుపరిపాలన, పరిపాలనలో ఖచ్చితత్వం, జవాబుదారితనాన్ని, ఈ గవర్నెన్స్ విధానాన్ని, ప్రజలకు పరిచయం చేసిన నిస్వార్థ రాజకీయ నాయకుడు.
విద్యార్థి దశ నుంచే హిందుత్వం, భారతీయ సాంప్రదాయాల పట్ల అపార గౌరవం ఉన్న ఆయన 12 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ భావాలకు ఆకర్షితుడయ్యి బీజేపీకి పూర్వం ఉన్న భారతీయ జనసంఘ్‌లో గణనీయమైన, బహుముఖ పాత్ర పోషించారు. తన వాక్చాతుర్యంతో పార్టీ విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో సఫలీకృతుడయ్యాడు. అంతేకాక, సమగ్ర మానవతావాదం, సాంస్కృతిక జాతీయవాదంతో సహా, జనసంఘ్ విధానాలు, భావజాలాన్ని వాగ్ధాటితో సమర్థించారు.
జనతా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర
భారత దేశంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ సమయంలో ఈయన ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించకపోయినా, ఆయన సామర్థ్యం తెలిసిన ప్రభుత్వం ఆయనను జైలులో నిర్బంధించింది. ఆయన మితవాదైనప్పటికీ బలమైన ప్రత్యర్థిగా చూశారు. ఎమర్జెన్సీని రద్దు చేసిన తర్వాత, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి మురార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే అన్ని పార్టీలను కలిపి జనతా పార్టీని ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. సానుకూల జాతీయవాద భావజాలం ప్రభావంతో భారతీయ జనతాపార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. వాజపేయి భారత 10వ ప్రధానమంత్రి అయ్యారు. వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రధానమంత్రిగా వ్యూహాత్మక చర్యలతో..
ఈయన ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో రవాణా సౌకర్యాల ప్రాధాన్యతను గుర్తించి ప్రధాన నగరాలను అనుసంధానించే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్టును, గ్రామీణ రోడ్లను మెరుగుపరిచే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనను ప్రారంభించారు. అలాగే, సమాచార వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ఎందుకంటే, ప్రభుత్వ రంగంలోనే ఉన్న టెలికామ్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు చెందిన వ్యక్తులకు కూడా అనుమతి ఇవ్వడం ద్వారా నేడు కాల్ రేట్లు తగ్గాయి. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ మీడియాని వాడే వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే అది ఆయన వేసిన బీజమే.. ముఖ్యంగా ఈయన విదేశాంగ విధానం ముఖ్యమైనది. ఎందుకంటే, అది ఆచరణాత్మకతను ధైర్యమైన వ్యూహాత్మక చర్యలతో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత ప్రముఖంగా నిలిపింది. 1974లో తొలిసారిగా ‘ప్రోఖ్రాన్-I’ అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్లీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్‌లోని ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను ‘ప్రోఖ్రాన్-II’గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి. ఇది భారతదేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేసింది.
ఆర్థిక దౌత్యం వలన..
అమెరికా, ఇతర దేశాల నుండి ప్రారంభ ఆంక్షలు ఉన్నప్పటికీ, వాజ్‌పేయి దౌత్యపరంగా సంబంధాలను తిరిగి ప్రారంభించి త్వరగా సాధారణీకరించగలిగారు. పాకిస్తాన్‌తో భద్రత, శాంతి ప్రయత్నాలను సమతుల్యం చేయాలని భావించి, శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించారు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి ఆర్థిక దౌత్యం వల్ల భారతదేశం పెరుగుతున్న ఆర్థిక సంస్కరణలను విదేశాంగ విధానంతో అనుసంధానించింది, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని మరింతగా అనుసంధానించింది. విదేశాలలో భారతదేశం యొక్క ఇమేజ్‌లో భాగంగా IT సాఫ్ట్‌వేర్ ఎగుమతులను ప్రోత్సహించింది. వాజ్‌పేయి తరచుగా తన రాజకీయ ప్రసంగాలను కవితలతో జోడించేవారు. ఇందులో అతి ప్రధానమైనది, ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపయోగించే ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వాజ్‌పేయి. భారతదేశ స్థితి స్థాపకత ప్రకటన, తన ప్రసంగాల ద్వారా భారతీయులలో దేశభక్తిని, దేశం పట్ల ప్రేమను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యయనం ప్రారంభించినటువంటి మహనీయమైన వ్యక్తిగా పార్టీలకు అతీతంగా ఆయనను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(నేడు అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్థంతి)
- డా. ఎ. శంకర్
99514 50009






